తొలిసారి ఔన్సు 5వేల డాలర్లు దాటేసిన గోల్డ్.. 2026లో రేట్లు ఎంత పెరిగాయంటే..

తొలిసారి ఔన్సు 5వేల డాలర్లు దాటేసిన గోల్డ్.. 2026లో రేట్లు ఎంత పెరిగాయంటే..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 26, సోమవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా ఔన్సుకు 5వేల డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్రను సృష్టించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలకు గోల్డ్ ర్యాలీ సగటు  భారతీయ కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 1.79% పెరిగి 5,071.96 డాలర్ల వద్ద ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఒక దశలో ఇది గరిష్టంగా 5,085.50 డాలర్లను తాకింది నేడు. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. ఏకంగా 4.57% పెరిగి 107.65 డాలర్ల వద్ద ఔన్సు రేటు ట్రేడవుతోంది. భారత మార్కెట్ MCX రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ.. గత వారం ముగిసే సమయానికి ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షా 59వేల 226 వద్ద, వెండి కిలోకు రూ.3 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించాయి.

2025లో బంగారం ధరలు సుమారు 64% పెరగగా.. 2026 ప్రారంభం నుంచే 17% మేర లాభపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దూకుడు మరింతగా కొనసాగటానికి కీలక కారణాలను పరిశీలిస్తే.. 
* అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం.
* చైనా వంటి సెంట్రల్ బ్యాంకులు వరుసగా బంగారం నిల్వలను పెంచుకోవడం.
* ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం ఉన్నాయి. 

గోల్డ్ అండ్ సిల్వర్ భవిష్యత్తు ఏంటి..
రాబోయే రోజుల్లో కూడా రేట్ల ర్యాలీ మరింత దృఢంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో ట్రేడ్ టారిఫ్స్‌పై జరగనున్న విచారణ, ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించనున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే.. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు స్థానిక మార్కెట్‌లో బంగారం, వెండి రేట్ల భవిష్యత్తును మారుస్తాయి. ధరలు స్వల్పంగా తగ్గినా.. అది కొనుగోలుకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.