అమెరికా కలలు మరింత ఆలస్యం.. కొత్త ఏడాది షాకిచ్చిన ట్రంప్ సర్కార్.. ఎందుకిలా..?

అమెరికా కలలు మరింత ఆలస్యం.. కొత్త ఏడాది షాకిచ్చిన ట్రంప్ సర్కార్.. ఎందుకిలా..?

అమెరికాలో జాబ్ చేయాలి అక్కడే క్వాలిటీ లైఫ్ తమ తర్వాతి తరాలకు అందించి స్థిరపడాలనే కలలు కనే భారతీయ టెక్కీలకు, ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ప్రొఫెషనల్స్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. H-1B వీసా స్టాంపింగ్ కోసం ఎదురుచూస్తున్న వేలమంది భారతీయుల వెయిటింగ్ ఇప్పుడు ఏకంగా 2027 వరకు చేరింది.

2027 వరకు నో స్లాట్స్..
భారత్‌లోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా యూఎస్ కాన్సులేట్లు ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూ స్లాట్లను నిలిపివేశాయి. 2025 డిసెంబర్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూలు 2026 మార్చికి.. ఆ తర్వాత అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ అపాయింట్‌మెంట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వెళ్లిపోయాయి. దీనివల్ల వేలమంది ఉద్యోగులు స్వదేశానికి రాలేక, ఒకవేళ వచ్చినా తిరిగి అమెరికా వెళ్లలేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

కొత్త రూల్స్‌తో చుక్కలు..
ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ముఖ్యంగా లాటరీ పద్ధతిలో కీలక మార్పులు తెచ్చారు. ఇకపై కేవలం అదృష్టం మీద కాకుండా.. ఉద్యోగి జీతం, అనుభవం ఆధారంగా వీసాలు కేటాయించనున్నారు. ఎక్కువ జీతం ఉన్న లెవెల్ IV ఉద్యోగులకు లాటరీలో నాలుగు అవకాశాలు, తక్కువ జీతం ఉన్నవారికి కేవలం ఒకే అవకాశం లభిస్తుంది. దీంతో తక్కువ జీతంతో అమెరికా వెళ్లాలనుకునే యువ ప్రొఫెషనల్స్‌కు గట్టి దెబ్బ తగిలింది.

సోషల్ మీడియా వెట్టింగ్..
వీసా ఆలస్యాలకు మరో ప్రధాన కారణం అప్లికెంట్ల సోషల్ మీడియా స్క్రీనింగ్. డిసెంబర్ 2025 నుంచి ప్రతి దరఖాస్తుదారుడి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అమెరికా నిర్ణయించింది. మీ ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను పరిశీలించడం వల్ల ఒక్కో అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం బాగా పెరిగిపోయింది. దీనికి తోడు గతంలో ఇతర దేశాల్లో వీసా స్టాంపింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అమెరికా ప్రస్తుతం రద్దు చేసింది. దీంతో వీసా స్టాంపింగ్ కోసం పడుతున్న సమయం రోజుల నుంచి నెలలకు పెరిగిపోయింది. 

తాజా వీసా కష్టాలు కేవలం భారతీయులకే కాదు, అమెరికా కంపెనీలకు కూడా తలనొప్పిగా మారాయి. టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడుతోంది. ఉద్యోగులు సకాలంలో విధుల్లో చేరకపోవడంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. ప్రతిభావంతులు అమెరికా వదిలి ఇతర దేశాలకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కంపెనీలు చేసేది లేక ఇండియాలో చిక్కుకున్న ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఫెసిలిటీని కల్పిస్తూ బిజినెస్ అంతరాయాలను కొంత మేర తగ్గించుకుంటున్నాయి. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణుల పాలిట వీసా సంక్షోభంగా మారాయి.