వచ్చే వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'బడ్జెట్ 2026-27'ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సగటు పన్ను చెల్లింపుదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఆదాయపు పన్నుపై ఆమె చేయనున్న ప్రకటన గురించే. పాత పన్ను విధానం కొనసాగుతుందా? లేక కొత్త విధానంలో మరిన్ని మార్పులు వస్తాయా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కీలకంగా మారింది. కొందరు పాత విధానం పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పద్ధతికే పెద్దపీట..
బడ్జెట్ 2026లో ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం లేనప్పటికీ.. ప్రజలను కొత్త విధానం వైపు మళ్లించేలా మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలుగా ఉంది. దీనిని ఈసారి మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు చేతిలో ఖర్చు చేసేందుకు మిగిలే నగదు పెరిగి, వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
పాత వర్సెస్ కొత్త: ఎక్కడ లాభం..?
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్లాబ్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎల్‌ఐసీ, పీపీఎఫ్, హోమ్ లోన్ వంటి మినహాయింపులు లేవు. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 72 శాతం మంది అంటే 5.27 కోట్ల మంది టాక్స్ పేయర్స్ కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. మిగిలిన 28 శాతం మంది ఇప్పటికీ పాత విధానంలోనే ఉన్నారు. ముఖ్యంగా ఇంటి అద్దె, హోమ్ లోన్ వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పెద్ద మొత్తంలో మినహాయింపులు కోరుకునే వారికి పాత విధానమే లాభదాయకంగా ఉంటోంది ఇప్పటికీ. అందుకే కొందరు మినహాయింపుల కోసం పాత టాక్స్ విధానాన్నే కొనసాగిస్తున్నారు.
మధ్యతరగతి ఆశల విషయానికి వస్తే.. ఈ బడ్జెట్‌లో నిర్మలమ్మ నుంచి పన్ను చెల్లింపుదారులు ప్రధానంగా మూడు మార్పులను కోరుకుంటున్నారు.
1. హోమ్ లోన్ మినహాయింపు: కొత్త విధానంలో కూడా హోమ్ లోన్ వడ్డీపై కనీసం రూ.2 లక్షల వరకు మినహాయింపు ఇస్తే అది రియల్ ఎస్టేట్ రంగానికి, సామాన్యుడికి పెద్ద ఊరట అవుతుంది.
2. హెల్త్ ఇన్సూరెన్స్: వైద్య ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా, కొత్త విధానంలో మెడికల్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
3. జాయింట్ ఫైలింగ్: భార్యాభర్తలు కలిసి పన్ను దాఖలు చేసే 'జాయింట్ ఫైలింగ్' సౌకర్యాన్ని భారతదేశంలో కూడా ప్రయోగాత్మకంగా తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది.
మొత్తానికి పాత పన్ను పద్ధతిని ఇప్పుడే తొలగించకుండానే.. కొత్త పద్ధతిని మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశ్యం కావచ్చు. నిర్మలమ్మ బడ్జెట్ పెట్టెలో పన్ను చెల్లింపుదారుల కోసం ఎలాంటి స్వీట్ వార్తలు ఉంటాయో తెలియాలంటే ఫిబ్రవరి 1న ఆమె ప్రసంగం వచ్చే వరకూ ఆగాల్సిందే మరి.
