- ఏడేళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వివాదానికి తెర
తిరువనంతపురం,బెంగళూరు: కేరళ, కర్నాటక రెండు రాష్ట్రాల రవాణా శాఖల మధ్య ఏడేళ్లుగా సాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. KSRTC... ఈ సంక్షిప్త పదాలు, మరియు రవాణాశాఖ తమ చిహ్నంగా ఉపయోగిస్తున్న రెండు ఏనుగుల లోగో సంబంధించిన హక్కులు కేరళకే చెందుతాయని వాణిజ్య శాఖకు చెందిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ తేల్చి చెప్పింది. రోడ్డ రవాణా సంస్థను KSRTCగా పిలిచే హక్కు కేరళ రాష్ట్రానికి ఉందని, అలాగే వారి లోగోలో రెండు ఏనుగులు, అనవాది అనే పేరు కూడా కేరళ రోడ్డు రవాణసంస్థకే చెందుతాయని పేర్కొంది.
KSRTC అనే సంక్షిప్త పదాలు మరియు రెండు ఏనుగుల లోగోను తమ పేరున రిజిస్టర్ చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2014లో దరఖాస్తు చేసుకుంది. దశాబ్దాలుగా తాము వాడుతున్న పేర్లు, చిహ్నాన్ని తాము ఉపయోగించకుండా కర్నాటక ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవడం కేరళకు రుచించలేదు. ఈ లోగో తమదేనంటూ కేరళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం కాస్తా రెండు రాష్ట్రాల మధ్య గొడవలా మారింది. వాణిజ్య శాఖకు చెందిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ విచారణ చేపట్టింది.
రెండు రాష్ట్రాల పుట్టుపూర్వోత్తరాల సమయం నుంచి ఆధారాలు సేకరించి నిగ్గుతేల్చే పనికి శ్రీకారం చుట్టింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ సంస్థల రికార్డులను లోతుగా పరిశీలించింది. స్వాతంత్రం వచ్చాక చాన్నాళ్ల వరకు కేరళలో రోడ్డు రవాణా సంస్థ లేదు. 1965లో కేరళ రోడ్డు రవాణా సంస్థ మొదలైంది. అదే సమయంలోనే కర్ణాటకలో కూడా రోడ్డు రవాణా సంస్థ కూడా ప్రారంభమైనట్లు తేలింది. అయితే కేరళ మొదట్నుంచి కేఎస్ఆర్టీసీ పదాలు ఉపయోగించగా.. కర్నాటక మాత్రం మొదట్లో మైసూర్ ప్రభుత్వ హాయంలో మొదలు కావడంతో మైసూర్ ట్రాన్స్‌పోర్స్ట్ డిపార్టుమెంట్‌గా సేవలు ప్రారంభించింది. 1973లో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థగా పేరు మార్చారు. దీంతో రికార్డుల పరంగా కేరళనే 1965 నుంచి KSRTC అని రాస్తున్నందున... ఆ రాష్ట్రానికే దీనిపై పేటెంట్ ఉందని నిర్ధారించారు. కర్నాటక అప్పీల్ ను ట్రేడ్ మార్క్ లైసన్స్ విభాగం తోసిపుచ్చింది.
