
- కేరళకు చెందిన బాధితురాలు షార్జాలో బలవన్మరణం
- తెల్లగా ఉన్నందుకు గుండికొట్టి వేధించినట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్
కొల్లం(కేరళ), షార్జా: భర్త, అత్తామామల వేధింపులు తట్టుకోలేక కేరళకు చెందిన మహిళ ఏడాది వయసున్న బిడ్డతోసహా ఆత్మహత్యకు పాల్పడింది. నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి ప్రాణాలు తీసుకుంది. యూఏఈలోని షార్జాలో ఈ నెల 8న ఈ ఘటన జరగ్గా, మంగళవారం ఫేస్‌బుక్‌లో కనిపించిన షెడ్యూల్డ్ పోస్ట్ ద్వారా అసలు విషయం బయటపడింది.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లం జిల్లాకు చెందిన విపంచిక మణియన్‌కు(32), నిధీష్ వలియవిఠల్‌తో 2020లో పెండ్లికాగా, అదే ఏడాది వీళ్లు షార్జాకు షిఫ్ట్ అయ్యారు. ఓ పాప పుట్టాక భర్త, అత్తమామల నుంచి విపంచికకు వేధింపులు మొదలయ్యాయి. తన కంటే విపంచిక తెల్లగా ఉందని ఆమెకు భర్త గుండు చేయించాడు. నిత్యం వరకట్నం కోసం వేధించాడు. ఇతర మహిళలతో సంబంధాలపై నిలదీసినందుకు బిడ్డపైనా దాడికి దిగాడు.
ఈ చిత్రహింసలు భరించలేక విపంచిక కొద్ది నెలల నుంచి పాపతో కలిసి మరో అపార్ట్‌మెంటులో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలోనే నిధీష్ విడాకుల నోటీసులు పంపగా మనస్థాపంతో బిడ్డతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. జరిగిన విషయాలన్నీ రాసి ఉంచిన నోట్‌ను ఫేస్‌బుక్‌లో షెడ్యూల్డ్ పోస్ట్ పెట్టి ప్రాణాలు తీసుకుంది. నిధీష్‌తోపాటు అతడి చెల్లి, తల్లిదండ్రులపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా తెలిసిందని, ఆమె ప్రాణాలు తీసుకునే ముందు దిండుతో నొక్కి చిన్నారిని చంపేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.