
- కేశవ్ రావ్ సంస్మరణ సభలో వక్తలు
- జాదవ్ జీవితమే ఒక పోరాటం : ప్రొఫెసర్ హరగోపాల్
- సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడ్తారా? : జస్టిస్ చంద్రకుమార్
- ఆస్తులన్నీ అమ్ముకొని ఉద్యమం చేశారు : కోదండరాం
- తెలంగాణ వ్యతిరేకులకు మంత్రి పదవులా? : ఆకునూరి మురళి
- ఒక రోబో రాష్ట్రాన్ని పాలిస్తున్నది : గద్దర్
హైదరాబాద్, వెలుగు : ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ, స్వచ్ఛమైన తెలంగాణ ఇంకా ఏర్పడలేదని, కేవలం భౌగోళికంగా మాత్రమే తెలంగాణ ఏర్పడిందని పలువురు ఉద్యమకారులు, మేధావులు, వక్తలు అన్నారు. సామాజిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్ కేశవ్‌రావ్ జాదవ్ సంస్మరణ సభను తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేధావులు, వక్తలు కేశవ్‌రావ్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత నిర్వహించిన సభలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కేశవ్‌రావ్ జాదవ్ జీవితమే ఒక పోరాటమని అన్నారు. వ్యక్తిగతంగా ఇలా కూడా జీవించొచ్చని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. సమాజాన్ని విద్యారంగం వైపు అడుగులు వేయించారని కొనియాడారు. ‘‘ఆస్తులు లేవు.. ఆదాయం లేదు.. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సరిపోదు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ గా ప్రమోషన్ తీసుకో అంటే తీసుకోలేదు. సమాజానికి జాదవ్ ఎంతో సేవ చేశారు. ఇప్పుడు జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో ఎక్కడా జాదవ్ గురించి ప్రస్తావించడం లేదు. ఆయన స్ఫూర్తి కనిపించడం లేదు”అని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. 152 మందిపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్‌చేశారు. ఇందిరా గాంధీ మీద జాదవ్ పోటీ చేసినప్పుడు ఓటేయ్యండని ఎవరినీ అడగలేదని గుర్తు చేశారు.
ధిక్కార స్వరానికి ప్రతిరూపం జాదవ్ : కోదండరాం
ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని జాదవ్ ఉద్యమం చేశారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానవతా విలువల కోసం గొప్పగా పని చేశారన్నారు. ధిక్కార స్వరానికి ప్రతిరూపం జాదవ్ అని కొనియాడారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కేశవ్‌రావ్ ఉండేవారని తెలిపారు. 152 మందిపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రొఫెసర్ కేశవ్‌రావ్ జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, మారోజు వీరన్న తెలంగాణకి పర్యాయ పదాలని ఆకునూరి మురళి కొనియాడారు. వీళ్లను చూసి పునికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా యాక్టర్ చనిపోతే ళ్లి జాగా ఇచ్చిన కేసీఆర్.. కేశవ్‌రావ్ జాదవ్ చనిపోయినా కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లనే చేరదీసి మంత్రి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మహానుభావులను పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు.
కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించారు : గద్దర్
ఆత్మ ఉన్నోళ్లంతా ఇక్కడికి వచ్చారని, ఆత్మలేని వాళ్లు రాలేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ‘‘ఆత్మలేని నాయకుడు అధికారంలో ఉన్నడు. ఒక రోబో రాష్ట్రాన్ని పాలిస్తున్నది. ఇంజినీరింగ్‌లో నాకు జాదవ్ ఇంగ్లీష్ చెప్పారు”అని గద్దర్ గుర్తు చేశారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోకొచ్చిన వాళ్లు.. ఆయన చనిపోతే సంతాప సభ పెట్టలేదని కేసీఆర్‌పై పరోక్షంగా ఆయన విమర్శించారు. 1969 ఉద్యమం విద్యార్థులే చేశారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాలేదని, ప్రజా, విద్యార్థి సంఘాల వల్లే వచ్చిందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ అప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు పెట్టించడానికి కారణం ప్రొ.కేశవ్‌రావ్ జాదవ్ అని అన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కూడా చంపుతా అని బెదిరించినా.. జాదవ్ భయపడలేదన్నారు.
మిస్టర్ తెలంగాణ.. కేశవ్‌రావ్ : విమలక్క
కేశవ్‌రావ్ జాదవ్ మిస్టర్ తెలంగాణ అని విమలక్క అన్నారు. ఆయన ప్రతీ నిమిషం తెలంగాణ గురించే ఆలోచించేవారని గుర్తు చేశారు. తెలుగులో ఎంట్రన్స్ పెట్టాలని కొట్లాడింది కూడా జాదవే అని తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం కావాలని కోరుకున్నారని, ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి జాదవ్ మొదటి నాగలిలాంటి వారని అద్దంకి దయాకర్ అన్నారు. ఇంకా కోరుకున్న తెలంగాణ రాలేదని విమర్శించారు. నికార్సైన ఉద్యమకారుడు జాదవ్ అని కొనియాడారు. తర్వాత పలు తీర్మానాలు చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తొలగించి జాదవ్ విగ్రహం పెట్టాలని, కేసీఆర్ పార్క్‌కు కేశవ్‌రావ్ జాదవ్ పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో జాదవ్ పేరిట ఆడిటోరియం నిర్మించాలని, అన్ని యూనివర్సిటీల్లో ఆయన విగ్రహం పెట్టాలని తీర్మానించారు.
ఆకలి చావులకు పాలకులే కారణం:జస్టిస్ చంద్రకుమార్
జాదవ్‌కి ఆకలి విలువ తెలుసు కాబట్టే మహబూబ్‌నగర్‌లో కరువు వచ్చినప్పుడు అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారని జస్టిస్ చంద్రకుమార్ కొనియాడారు. ఎంత పెద్దోళ్ల దగ్గర కూడా జాదవ్ భయపడేవారు కాదన్నారు. దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయని, దానికి ఈ పాలకులే కారణమని విమర్శించారు. తప్పుని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.