అమాంతం తన్నుకపోయింది

అమాంతం తన్నుకపోయింది

ఇది ఒక కుందేలు, నక్క, గద్ద కథ. రాత్రిపూట పిల్లలకు చెప్పే కథ మాత్రం కాదు. ఇక్కడ ఒక నక్క పిల్ల విలువైన పాఠం నేర్చుకున్నది. గద్దలా తన్నుకపోవడం అంటే ఇదే అని చెప్పింది. అది వాషింగ్టన్ పక్కనున్న సాన్జోస్న్ ఐలాండ్లో ఉన్న నార్త్వెస్ట్ అడవి. పొదలో గరక మేస్తున్న కుందేలును రెడ్ఫాక్స్ (నక్క పిల్ల) చూసింది. మాటు వేసి.. దానిపై దునికింది. మెడకాయ కొరికి నోట్లో పెట్టుకుని రక్తం జుర్రుతుంటే.. ఒక గద్ద ఎంటవడ్డది. ఎన్కనుంచి వేగంగా ఎగిరొచ్చి కుందేలును, దాన్ని పట్టుకున్న నక్కనూ అమాంతం పైకి ఎగరేస్కపోయింది. అక్కడే ఫొటోలు తీస్కుంటున్న కెవిన్ ఎబీ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో వీడియో మోడ్ని ఆన్ చేసిండు.

ఎనిమిది సెకన్ల వీడియో ‘ వామ్మో’ అంటూ సర్ప్రైజ్ అయితరు. ‘‘నేను షాకయ్యాను. ఇట్లాంటివి ఎప్పుడు చూడలె. నక్క కుందేలుని నోట్లో పట్టుకుని కొంచెం ముందుకు నడవంగనే దాని కండ్లళ్ల భయం మొదలైంది. గద్ద అరుపులు వినంగనే.. ఏం జరగబోతుందో నేను ఊహించాను. గద్దకు కూడా కుందేలు కావాలని అర్థమైంది. ఫైనల్గా గాల్లో గిల గిల కొట్టుకుంటున్న నక్కని ఇడిసి కుందేల్ని తన్నుకపోయింది గద్ద. కిందవడ్డ నక్కకు దెబ్బలు తాకినయ్. ఆల్రెడీ వేటాడిన దాన్ని తన్నుకపోనీకి గద్దలు రెడీగుంటయ్. ఈ ప్రవర్తనను ‘క్లెప్టోపారసిజమ్’ అంటరు. నక్కకు ఇదే ఫస్ట్ వేట అనుకుంట. మళ్లసారి ఎన్కముందు చూస్కోని వేటాడ్తది!’’ అన్నడు ఎబీ.