ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు.. భారీ వినాయకుడి ప్రత్యేకతలు ఇవే

ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు.. భారీ వినాయకుడి ప్రత్యేకతలు ఇవే

గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరకీ మొదట గుర్తోచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్. ఇక్కడ కొలువుదీరే భారీ గణనాథుడు చాలా ప్రత్యేకం. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఖైరతాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది మహాగణపతి  విభిన్న ఆకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలు ఏంటో చూదాం..

ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలు..

* గతేడాది 50 అడుగుల ఎత్తులో వెలిసిన ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి 63 అడుగులతో రూపుదిద్దుకున్నాడు.
* శ్రీ దశమహా విద్యా గణపతి విగ్రహం నిలబడి ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉన్నాయి.
* వెనుక భాగంలో సంస్కృతంలో వ్రాసిన వచనం కనిపిస్తుంది.
* మహాగణపతికి 10 చేతులు ఉన్నాయి. కుడిచేతుల్లో కింది నుంచి  పై వరకు ఆశీర్వాదం, దండ, ధాన్యం, త్రిశూలం, గధ ఉండగా.. ఎడమ చేతిలో కింది లడ్డు, పుస్తకం, తాడు, కత్తి, శంఖం ఉన్నాయి.
* పాదాల దగ్గర 10 అడుగుల ఎత్తున వారాహి దేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయి.
* ప్రధాన మండపానికి ఇరువైపులా దాదాపు 15 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా పర్యావరణహితం కోసం మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు.

150 మంది కళాకారులు, 100 రోజులు శ్రమించి..

దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ భారీ గణనాధుడి విగ్రహాన్ని తయారు చేశారు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరభద్రుడిని పూజించడం వల్ల ధైర్యం వస్తుంది. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 

Also Read :- మహాగణపతికి తొలిపూజ.. హాజరైన గవర్నర్

వరిగడ్డి, వరిపొట్టు, ఇసుక, వైట్ క్లాత్ ఇవన్నీ విగ్రహ తయారీలో ఉపయోగించినట్లు నిర్వాహకులు చెప్పారు. వర్షం వచ్చినా గణేషుడు తడవకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని తయారు చేశామని వివరించారు. విగ్రహ తయారీకి రూ.90 లక్షలు ఖర్చు అయిందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ అధికారులు తెలిపారు.

ఉత్సవాలు ఎలా ప్రారంభం అయ్యాయంటే?

బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో, సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక అడుగు గణేషుడి విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. అయితే నిర్మించబడిన విగ్రహం ఎత్తు 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. 2019 నాటికి విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది.. తద్వారా ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా పేరొందింది. 

ఇక.. అక్కడి నుంచి మళ్లీ క్రమంగా ఒక్కో అడుగు తగ్గించడం మొదలు పెట్టారు. హుస్సేన్ సాగర్ సరస్సుకు మార్గం పరిమితులు, పర్యావరణ సమస్యల కారణంగా పరిమాణం తగ్గిస్తూ వచ్చామని తెలిపారు. అయితే ఈ సారి ఏకంగా 63 అడుగుల విగ్రహాన్ని నిర్వహకులు ఏర్పాటు చేయడం విశేషం.