ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు.. కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు..  కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు బయట ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధంలో ఉన్నాయి.

ఆదివారం కావడంతో నగరం  ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు గణేష్‌ మహరాజ్‌ కీ జై నినాదాలతో మార్మోగింది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది.  ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. 

ఖైరతాబాద్‌కు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. మింట్‌ కాంపౌండ్, ఖైరతాబాద్‌ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్‌ భవన్‌ రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి.