ఆమె నిలిపిన కుటుంబం

ఆమె నిలిపిన కుటుంబం

బిజీ లైఫ్‌‌.. ఫ్యామిలీ అంతా కలిసేది పండుగలకే. అందుకే పండగలప్పుడైనా పూర్తిగా ఫ్యామిలీతోనే గడపాలనుకుంటున్నారు. దీంతో చాలా ఇళ్లలో టైం వేస్ట్‌‌ చేయడం ఎందుకని పిండివంటలు చేయడం మానేశారు. పట్టణాల్లో అయితే పెద్ద పెద్ద షాపుల నుంచి తెచ్చుకుని తింటున్నారు. మరి పల్లెల్లో?.. దొరకడం కాస్త కష్టమే. అందుకే పిండివంటలు, స్వీట్లు తయారు చేసి పల్లెల్లో అమ్మడం మొదలుపెట్టింది విజయలక్ష్మి

విజయలక్ష్మిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం. భర్త ప్రసాదరావు. వాళ్లది వ్యవసాయ కుటుంబం. పంటలు నష్టపోయి అప్పులే మిగిలాయి. ఏం చేయాలో తోచని పరిస్థితి వాళ్లది. మరోపక్క కొడుకుని బాగా చదివించాలనే కల. ఉద్యోగం చేద్దామంటే చదువులేదు. కూలీ చేస్తే వచ్చే డబ్బు కుటుంబ పోషణకే సరిపోదు. మరేం చేయాలి?  సరిగ్గా అప్పుడే తెలిసినవాళ్లు విజయలక్ష్మిని పిండి వంటలు చేయడానికి సాయం అడిగారు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. పిండి వంటలు చేసి వాటిని అమ్మి.. డబ్బు సంపాదించాలనుకుంది. భర్త సహకారంతో ఆరు సంవత్సరాల క్రితం పది వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టింది. ఆమె వంటల రుచికి అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు విజయలక్ష్మి పిండివంటలు అంటే ఆ ప్రాంతంలో తెలియనివాళ్లు లేరు.

వంటలకు ఫిదా..

విజయలక్ష్మి వ్యాపారం మొదలుపెట్టిన తొలినాళ్లలో అన్నీ నష్టాలే వచ్చాయి. అయినా అధైర్య పడలేదు. పిండివంటలను చుట్టు పక్కల గ్రామాలకు తీసుకెళ్లి అమ్మేది. కొన్నాళ్లకు చుట్టు పక్కల గ్రామాలంతటికీ ఆమె వంట రుచి పరిచయమైంది. ఆర్డర్లు బాగా పెరిగాయి. దాంతో స్ర్తీ నిధి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకొని వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ పచ్చళ్లు కూడా తయారు చేస్తోంది.తన కాళ్లమీద తను నిలబడటమే కాకుండా గ్రామంలో మరో పదిమందికి ఉపాధిని కల్పిస్తోంది.

చెప్పిన టైమ్కి..

నోరూరించే లడ్డూలు, కరకరలాడే కారప్పూస, గలగల లాడే బూందీ, నోట్లో వేసుకోగానే కరిగిపోయే కజ్జికాయలు, గవ్వలు, సకినాలు, బొబ్బట్లు, జంతికలు, బూరెలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు.. ఇలా ఏ వంటకం ఆర్డర్​ చేసినా చెప్పిన టైమ్​కి తయారు చేసిస్తుంది. సత్తుపల్లి చుట్టుపక్కల ఏ శుభకార్యం జరిగినా విజయలక్ష్మి చేసిన పిండి వంటలు తప్పనిసరిగా ఉంటాయి.
అంతేకాదు ఇక్కడివాళ్లు విదేశాల్లో ఉన్న తమ బంధువులకు కూడా విజయలక్ష్మి చేసిన స్వీట్లు, పిండివంటలు పంపుతుంటారు. ‘ఈ రోజుల్లో పిండి వంటలు చేసుకునే ఓపిక చాలా మందికి ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ తరం వాళ్లలో చాలామందికి పిండి వంటలు చేయడం తెలియదు.
అలాంటి వాళ్లు మా దగ్గర స్వీట్లు, పిండి వంటలు తీసుకెళ్తుంటారు. కస్టమర్లు అడిగే ప్రతి వంటకాన్ని తయారు చేస్తున్నాం. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడం. తిన్నవాళ్లంతా ఇంట్లో చేసిన వంటల్లాగే ఉన్నాయని కితాబిస్తారు’ అంటోంది విజయలక్ష్మి.

పండుగ సీజన్లో ఫుల్ బిజీ

పండుగలప్పుడు విజయలక్ష్మికి క్షణం తీరిక కూడా ఉండదు. పిండి వంటల కోసం ఆమె ఇంటి ముందు ‘క్యూ’ కడుతుంటారు. ‘సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెల ముందు నుంచే ఆర్డర్లు ఇస్తుంటారు. అందులో విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లే ఎక్కువ. అరిసెలు, సకినాలు, బొబ్బట్లు, జంతికలు, బూరెలు, కజ్జికాయలు, నువ్వుల లడ్డూ.. లాంటి  ఐటమ్స్‌‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది’ అని చెప్పింది విజయలక్ష్మి. పండుగలకు ఊళ్లకు వచ్చి తిరిగి పట్టణాలకు వెళ్లేవాళ్లు కూడా ఆమె దగ్గర నుంచి స్వీట్లు, పిండివంటలు తీసుకెళ్తారు. వీటికి ఇంత గిరాకీ ఉండడానికి కారణం అవి రుచిగా ఉండడంతోపాటు ధర కూడా చాలా తక్కువ.