వరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • 3 నెలల పాటు నీటి వనరుల రిపోర్టింగ్ షెడ్యూల్ తయారు చేయాలి
  • విపత్తుల సన్నద్ధతపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్​

ఖమ్మం టౌన్, వెలుగు :  వరద ఉధృతి  అంచనాలను సమర్థవంతంగా అందించాలని, ఆ దిశగా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టర్​ తన క్యాంపు కార్యాలయంలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి విపత్తుల సన్నద్ధత గురించి సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు.  వరద అంచనా వ్యవస్థ కట్టుదిట్టంగా పని చేయాలని ఆయన సూచించారు. నీటి నిల్వలు, పైన ఉన్న మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసే వర్షాలు, వస్తున్న వరద వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు రెగ్యులర్ గా మానిటర్ చేయాలన్నారు. 

భద్రాచలంలో వరద ఉధృతి సంబంధించి పకడ్బందీ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. భద్రాచలం వద్ద వరద వివరాలు ప్రతీ గంటకు తెలుస్తాయని, ఆ దిశగా ఖమ్మం జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.  ఖమ్మం అర్బన్, రూరల్ ప్రాంతాలలో వరద విపత్తు నిర్వహణ బాధ్యత రెవెన్యూ వ్యవస్థపై ఉంటుందన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.  ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఖమ్మం ఆర్డీవో జి. నరసింహారావు, ఇరిగేషన్ డీఈలు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు పాల్గొన్నారు.