
- ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : ఇందిరా మహిళా డెయిరీ కింద జూలై 15 తర్వాత ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ జూలై 15 తర్వాత ప్రారంభించాలన్నారు. ప్రతినెలా ఎన్ని పాడి పశువులు కొనుగోలు చేయాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. జనవరి వరకు 5 వేల యూనిట్లు పూర్తి కావాలన్నారు.
ఇందిరా మహిళా డెయిరీ సభ్యత్వం ఉన్న మహిళల్లో అనుభవం ఉన్న పాడి రైతులను గుర్తించామని, వీరిని భాగస్వామ్యం చేస్తూ పశువులు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం 2 పాడి పశువులు ఉన్న లబ్ధిదారులకు మరో రెండు పశువులు అందించేందుకు ఎంపిక చేస్తే, వారికి షెడ్డు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. పాడి పశువు, రవాణా, బీమా ఖర్చు ఎంత అవుతుందో పరిశీలించి వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్ బాబు, మైనార్టీ సంక్షేమ అధికారి డా. పురందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం హార్వెస్ట్ స్కూల్ లో టీచర్లకు నిర్వహించిన వేసవి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. విద్యా శాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలన్నారు. అనంతరం నగరంలోని సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు పనులను పరిశీలించారు. మార్ట్ లో ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్ లపై, ప్రొడక్ట్స్, ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. మహిళా మార్ట్ నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించినట్లు తెలిపారు.