ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

తల్లాడ/వైరా/కల్లూరు, వెలుగు: మన ఊరు–మన బడి పనుల్లో నాణ్యత పాటించాలని ఖమ్మం కలెక్టర్  వీపీ గౌతమ్​ అధికారులు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రెడ్డిగూడెం (కొడవటిమెట్ట) స్కూల్​లో పనులను పరిశీలించారు. స్కూల్ బిల్డింగ్ సరిపోవడం లేదని కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని సర్పంచ్ బద్దం నిర్మల కలెక్టర్ ను కోరగా ప్రపోజల్  పంపించాలని సూచించారు. ఎస్సీ కాలనీలో రోడ్డును ఆక్రమించడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పగా, సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, ఆర్ఐ రాధిక, బద్దం కోటిరెడ్డి ఉన్నారు. వైరా పట్టణంలోని పలు వార్డులలో కలెక్టర్​ పర్యటించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, షాదీఖానా పనులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్​ మొగిలి, మున్సిపల్  చైర్మన్  జైపాల్, జడ్పీ సీఈవో వింజం అప్పారావు, స్పెషల్​ ఆఫీసర్​ సత్యనారాయణ, డీఎంహెచ్​వో మాలతి పాల్గొన్నారు. కల్లూరు మండలం పోచవరం గ్రామంలో నిర్మించిన ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్  వీపీ గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. స్కూల్​ ఆవరణలో కలెక్టర్  మొక్క నాటారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్​ పాల్గొన్నారు.

ఎంబీ రికార్డు వెంటనే చేయాలి

భద్రాద్రికొత్తగూడెం: పూర్తి చేసిన పనులకు ఎంబీ రికార్డు చేయడంలో జాప్యంతోనే బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అనుదీప్​ చెప్పారు. కలెక్టరేట్​లో మన ఊరు–మన బడి, దళితబంధు అమలు తీరుపై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. డీఈవో సోమశేఖరశర్మ, దళితబంధు నియోజకవర్గ స్పెషల్​ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మరియన్న, బీమ్లా, రాంప్రసాద్​ పాల్గొన్నారు. 

వయోవృద్ధుల సంక్షేమానికి పెద్దపీట

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా సంక్షేమాధికారి ఆర్ ​వరలక్ష్మి చెప్పారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ సీనియర్​ సిటిజన్​ అసోసియేషన్​ భవన్​ నుంచి పోస్టాఫీస్​ సెంటర్​ వరకు మారథాన్​ ర్యాలీ నిర్వహించారు. సీడీపీవో స్వర్ణలత లెనీనా, అసోసియేషన్​ ప్రెసిడెంట్​ కె. నాగేశ్వరరావు, జనరల్​ సెక్రటరీ సురేశ్, సెక్రటరీ శివరామకృష్ణ పాల్గొన్నారు. 

గురుకులం టీచర్లను క్రమబద్ధీకరించాలి

సత్తుపల్లి, వెలుగు: గిరిజన సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, పీఈటీలను వెంటనే రెగ్యులరైజ్​ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్  డిమాండ్ చేశారు. శుక్రవారం గురుకులం కాంట్రాక్ట్​ టీచర్లు, లెక్చరర్లు వసంత విష్ణువర్ధన్, బానోత్​ నెహ్రూ తదితరులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియమితులైన 1917 మందిని జీవో నంబర్​ 16 ప్రకారం క్రమబద్దీకరించాలని డిమాండ్​ చేశారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రావి నాగేశ్వరరావు, నాయకులు మానుకోట ప్రసాద్, ఐ కృష్ణ, కాంతారావు, ఫజల్ బాబా పాల్గొన్నారు.

ప్రైవేట్​ ఆసుపత్రుల తనిఖీ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలో శుక్రవారం వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రైవేట్​ ఆసుపత్రులను తనిఖీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్​వో డా.రాజ్​కుమార్, డాక్టర్​ చైతన్య, డీపీఎంవో ముత్యాలరావు, హెచ్ఈవో కృష్ణయ్య, సీహెచ్​వోలు కాంతమ్మ, శారద తనిఖీ చేసి అనుమతుల్లేని డయాగ్నస్టిక్​ సెంటర్లు, ల్యాబ్​లకు నోటీసులు జారీ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలు అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి సీజ్​ చేశారు. 8 ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న హాస్పిటళ్లను సీజ్​ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో తెలిపారు.

ములకలపల్లి: మండలంలోని రెండు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను డీఐవో డాక్టర్ నాగ ప్రసాద్  ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన వెంట సీహెచ్ వో నాగభూషణం, హెచ్ఎస్​ రమణారెడ్డి, హెచ్ఈవో ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

8 మంది దొంగల అరెస్ట్.. రూ.42 లక్షల సొత్తు స్వాధీనం​

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: అంతర్​ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్​ చేసి రూ.42 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు సీపీ​విష్ణు ఎస్​ వారియర్ తెలిపారు. పోలీస్​ కాన్ఫరెన్స్​హాల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన నూకమళ్ల నాగేంద్రబాబు, పుప్పుల రాజ్​కుమార్, బాదే నాగేంద్రబాబు, మండల అశోక్, బాణాల ముత్యాలు, చింతమళ్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన తెలగమళ్ల వెంకటేశ్వర్లు పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో 27, సూర్యాపేట జిల్లాలో ఒక చోట 28 ఇళ్లల్లో బంగారం, వెండి అభరణాలు, టీవీలు, ఇతర వస్తువులను దొంగతనం చేసినట్లు చెప్పారు. 638 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 10ఎల్ఈడీ టీవీలను రికవరీ చేశామన్నారు. సీసీఎస్​ ఏసీపీ టి రవి, సీఐలు పులిగిళ్ల నవీన్, మల్లయ్యస్వామి, చిట్టిబాబు రివార్డులు అందజేశారు.

రైతులకు అండగా ఉండాలి

నేలకొండపల్లి, వెలుగు: రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నేలకొండపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్​ కమిటీ కొత్త పాలకవర్గం రైతులకు న్యాయం చేసేలా పని చేయాలని సూచించారు. నేలకొండపల్లి మార్కెట్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ  చైర్ పర్సన్  నంబూరి శాంత, జడ్పీ వైస్ చైర్ పర్సన్  మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్  నెల్లూరి లీలాప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సర్పంచ్​ రాయపూడి నవీన్  పాల్గొన్నారు.

ధాన్యలక్ష్మీకి జేజేలు

భద్రాచలం/పాల్వంచ, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారు శుక్రవారం ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి స్నపన తిరుమంజనం అయ్యాక ఉత్సవమూర్తిని ధాన్యలక్ష్మీగా అలంకరించారు. సామూహిక లక్ష కుంకుమ, లక్ష్మీ అష్టోత్తరశతనామార్చనలు చేశారు. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లి ధనలక్ష్మి దేవి అలంకరణతో దర్శనమిచ్చారు. అమ్మవారికి అష్టోత్తరం, కలశాభిషేకం, చండీ హోమం, లక్ష కుంకుమార్చన నిర్వహించారు.

రేషన్ బియ్యం పట్టివేత

వైరా, వెలుగు: కొణిజర్ల మండలకేంద్రంలో రఘునాథపాలెం నుంచి కాకినాడకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పల్లిపాడు సెంటర్​లో ఎస్సై యాయాతి రాజు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన తరపట్ల వెంకటేశ్, డ్రైవర్​ కమ్మిరెడ్డి సతీశ్​లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సివిల్​ సప్లయ్​ అధికారులకు అప్పగించారు.

చల్లారని పోడు వివాదం

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోడురైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య వివాదం మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం పోడురైతులు నాగళ్లతో భూములను దున్నేందుకు వెళ్లారు. ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుందన్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

సీఐ బొమ్మెర బాలకృష్ణ పోడురైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోడురైతులు వాగ్వాదానికి దిగారు. ఫారెస్ట్ ఆఫీసర్లు దాడి చేసి పంటలను ధ్వంసం చేశారని, మహిళలని కూడా చూడకుండా బట్టలు చింపి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. దాడి చేయించిన రేంజర్ రెహమాన్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళను అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేస్తామని పోడురైతులు హెచ్చరించారు.

సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో కోల్​ప్రొడక్షన్​ టార్గెట్​ రీచ్​ కాలేదు. అర్ధ సంవత్సరానికి 3,16,20,739 టన్నులకు గానూ 2,90,63,714 టన్నుల బొగ్గు(92 శాతం) మాత్రమే తవ్వారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్​లను వర్షాలు వెంటాడాయి. మరోవైపు ఓవర్​బర్డెన్​ను కాంట్రాక్టర్లు అనుకున్న టార్గెట్​ ప్రకారం తీయకపోవడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 740 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించింది. ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ వరకు అర్ధ సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి గానూ 92శాతం మాత్రమే రీచ్​ అయింది. మణుగూరు, ఆర్జీ–1, శ్రీరాంపూర్​ ఏరియాలు మాత్రమే నిర్దేశించిన ప్రకారం వంద శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి. కొత్తగూడెం ఏరియా–91, ఇల్లెందు ఏరియా–96, ఆర్జీ 2 ఏరియా 98, ఆర్జీ 3 ఏరియా 98, అడ్రియాల ప్రాజెక్ట్​ 62, భూపాలపల్లి ఏరియా 58, బెల్లంపల్లి ఏరియా 77, మందమర్రి ఏరియా 76 శాతం బొగ్గు ఉత్పత్తి చేశాయి. 

మణుగూరు నెంబర్ వన్

మణుగూరు, వెలుగు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్  నెలలో 120 శాతం కోల్  ప్రొడక్షన్  సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని జీఎం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. జీఎం ఆఫీస్  కాన్ఫరెన్స్ హాల్​లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ లో మణుగూరు ఏరియాకు 8.77 లక్షల టన్నుల కోల్  టార్గెట్  విధించగా 10,56,117 టన్నుల ప్రొడక్షన్ సాధించినట్లు చెప్పారు. కోల్ ట్రాన్స్​పోర్టేషన్​లో రికార్డు సాధించామన్నారు. 116 లక్షల టన్నుల ఇయర్లీ టార్గెట్ ను కూడా సాధిస్తామని తెలిపారు. ఎస్ఓటూ జీఎం లలిత్ కుమార్, ఏజీఎంలు రమేశ్, ఫ్రిడ్జ్ రా, వెంకటేశ్వర్లు, వెంకట్​రావు, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
 

‘దళితబంధులో రాజకీయాలొద్దు’

గుండాల, వెలుగు: దళితబంధును రాజకీయం చేయొద్దని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం ఆళ్లపల్లి మండల పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ నెల14న విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వాగబోయిన రమేశ్, గొగ్గేల కృష్ణయ్య, రేసు ఎల్లయ్య, ఎస్కే రహీం, కోటేశ్వరరావు  పాల్గొన్నారు.