- ఉమ్మడి ఖమ్మంలో సోమవారం భారీగా సరుకు పట్టివేత
- ఆర్టీసీ బస్సులో పట్టుబడ్డ బీటెక్ బాబులు
- భద్రాచలంలో138 కిలోల గంజాయి సీజ్
భద్రాచలం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడుతోంది. కారులో అక్రమంగా తరలిస్తున్న 138 కిలోల ఎండు గంజాయిని భద్రాచలంలో సోమవారం ఖమ్మం ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ముంబైకు చెందిన యూసఫ్ షహీద్ ఖాన్ఒడిశాలో రూ.2.20 లక్షలకు ఈ సరుకును కొనుగోలు చేసి, జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ఫరీద్తో కారులో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఐదు బస్తాల్లో గంజాయిని కారులో తీసుకెళ్లి కర్నాటక బార్డర్లో యూసఫ్ షహీద్ఖాన్కు ఫరీద్అప్పగించే క్రమంలో పట్టుకున్నట్లు చెప్పారు. ఫరీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వైరా: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8.5 కేజీల గంజాయిని వైరా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పల్లిపాడులో తమ సిబ్బందితో సోమవారం తనిఖీలు చేస్తుండగా, భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు యువకులు బ్యాగుతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సీఐ మమతారెడ్డి తెలిపారు. వారిని పట్టుకొని బ్యాగ్ చెక్ చేయగా, గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. పట్టుపడ్డ ముగ్గురు యువకులు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించినట్లు చెప్పారు . నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
624 కేజీల గంజాయి దహనం
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం కమిషనరేట్‌లోని ఆయా ఠాణాల పరిధిలో పట్టుబడిన 624 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. అడిషనల్ డీసీపీ నరేశ్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్ , నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు ఠాణాలకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఉదయ్ కుమార్, రమేశ్, జనార్దన్, ఉస్మాన్ షరిఫ్, కల్లూరు ఎస్సై ఇతర అధికారులు పాల్గొన్నారు.