ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం వాయిదా

ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం వాయిదా
  • బహిష్కరించిన 10 మంది డైరెక్టర్లు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశం 10 మంది డైరెక్టర్ల అసమ్మతి సెగ కారణంగా వాయిదా పడింది. గురువారం డీసీసీబీ కార్యాలయంలో బ్యాంకు సీఈవో అబీద్ అధ్యక్షతన ఏర్పాటు  చేసిన సమావేశం రసాభాసగా మారింది. అసమ్మతి డైరెక్టర్లు వచ్చే సమావేశంలో ఎజెండాలో పెట్టిన నాలుగు అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు. 

ఈ సందర్భంగా అసమ్మతి డైరెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇన్​చార్జ్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న దొండపాటి వెంకటేశ్వరరావు కాకుండా, కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక మీటింగ్ నిర్వహించాలని ఈఏడాది మార్చి 15న 15 మంది డైరెక్టర్లు చైర్మన్ కు నోటీసు పంపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడు నెలల్లోనే రెగ్యులర్ చైర్మన్ ను ఎన్నుకోవల్సి ఉంది.. కానీ, ఆ ప్రక్రియ జరగడం లేదన్నారు. గత సమావేశంలోనే పాలకవర్గ సభ్యులందరూ చైర్మన్ ఎన్నిక జరపాలని కోరగా, వచ్చే మీటింగ్​లో పెడతామని తాత్కాలిక చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపినట్లు సభ్యులు చెప్పారు.

 కానీ ఎజెండా కాఫీలో చైర్మన్ ఎన్నిక పెట్టకపోవడంతో అయోమయానికి గురయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సమావేశాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు. తర్వాత జరగబోయే బోర్డ్ మీటింగ్ లోనైనా అన్ని అంశాలను ఎజెండా కాఫీలో పెడితేనే సమావేశం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈనెల 30 లోపు ఆడిట్ రిపోర్ట్ పంపాల్సి ఉందన్నారు. పంపకపోతే నాబార్డ్ తో ఉన్న కనెక్టివిటీ తెగిపోయే పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

వెంటనే చైర్మన్ స్పందించి ఎజెండాలోని అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు తాత్కాలిక చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు స్పందించి వచ్చే బోర్డ్ మీటింగ్ లో అంశాలను పెడతామని స్పష్టం చేశారు. సమావేశానికి ముందు డీసీసీబీలో ఉన్న రెస్ట్ హౌస్ రూం తాళం విషయంలో దొండపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య కు స్వల్ప వివాదం చోటు చేసుకున్నది. డీసీసీబీ సమావేశాన్ని తిరస్కరించిన వారిలో తాళ్లూరి బ్రహ్మయ్య, లక్కినేని సురేందర్, బొర్ర రాజశేఖర్, మేకల మల్లిబాబు యాదవ్, లక్ష్మణ్ రావు, నూకల సైదులు,అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, చావా వేణుగోపాల కృష్ణా, మోదుగు పుల్లారావు 
ఉన్నారు.