ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో అభివృద్ధి పనులు చాలా ఆలస్యంగా జరగడం పట్ల కలెక్టర్​ అనుదీప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను బుధవారం కలెక్టర్​ పరిశీలించారు. సఖి కేంద్రంతో పాటు వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్ల నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కూలీలను పెంచి పనులు స్పీడప్​ చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం నిర్మిస్తున్న సఖి కేంద్రాన్ని అన్ని వసతులతో కంప్లీట్​ చేయాలన్నారు. రేడియాలజీ సెంటర్​ నుంచి హాస్పిటల్​కు రోడ్డు నిర్మించాలన్నారు. రామచంద్ర కాలేజీ మైదానంలో పార్క్​తో పాటు వాలీబాల్, బాస్కెట్​ బాల్, వాకింగ్​ ట్రాక్, అవుట్​ డోర్​ షటిల్​ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. చిట్టి రామవరం ప్రైమరీ స్కూల్​లో తొలిమెట్టు ప్రోగ్రామ్​ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడ టీచర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్​ చైర్ పర్సన్​ కె సీతాలక్ష్మి, మున్సిపల్​ కమిషనర్​ నవీన్​ కుమార్​, పీఆర్​ ఈఈ సుధాకర్, సీడీపీవో లెనీనా, తహసీల్దార్​ రామకృష్ణ పాల్గొన్నారు. 

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలె : జస్టిస్ దీప

చండ్రుగొండ,వెలుగు: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా మొదటి అదనపు జడ్జి దీప సూచించారు. బుధవారం చండ్రుగొండ జడ్పీ హైస్కూల్ లో జరిగిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. బాల కార్మికుల సమాచారాన్ని ఆఫీసర్లకు ఇవ్వాలన్నారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, పెళ్లి టైమ్​లో అక్కడ ఉన్నా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తాము ఈవ్​టీజింగ్​తో ఇబ్బంది పడుతున్నట్టు స్కూల్  బాలికలు జడ్జి దృష్టికి తీసుకెళ్ళారు. ఎస్ఐ విజయలక్ష్మి, జడ్పీటీసీ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ బాబూరావు, టీచర్​ మంజూశ్రీ పాల్గొన్నారు.

బ్యానర్  రిలీజ్

ఖమ్మం టౌన్: గర్భస్థ శిశువును హత్య చేయవద్దని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డా. టి శ్రీనివాసరావు, కలెక్టర్  వీపీ గౌతమ్  చెప్పారు. కలెక్టర్  చాంబర్ లో వరకట్నం, భ్రూణహత్యలపై రూపొందించిన బ్యానర్లను రిలీజ్​ చేశారు. గర్భస్థ శిశువులను హత్య చేయొద్దని, ఆడపిల్లలను కాపాడాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్  ఎన్  మధుసూదన్, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్  పాల్గొన్నారు.

సోలార్​ ప్రాజెక్ట్ పనులు షురూ

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీరామదివ్యక్షేత్రంలో సోలార్ ప్రాజెక్టు పనులు షురూ అయ్యాయి. సౌమిత్రీ సదనంపై భాగంలో సోలార్​ ప్లేట్లు బిగించే పనుల కోసం బుధవారం పూజలు నిర్వహించారు. జార్ఖండ్​ నుంచి వచ్చిన సన్​ టెక్నాలజీస్​కు చెందిన ముగ్గురు టెక్నీషియన్లు సోలార్​ ప్లేట్లను బిగించే పనులు మొదలు పెట్టారు. ఆలయంలోని 27 కాటేజీలు, 140 రూములు, ఆలయం, నిత్యాన్నదాన సత్రం తదితర చోట్ల ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. సౌమిత్రీ సదనంపై సోలార్​ ప్లేట్లు బిగిస్తారు. 15 రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తారు. తర్వాత రంగనాయకుల గుట్టపై ఉన్న కాటేజీలకు, రామాలయం, నిత్యాన్నదాన సత్రం వద్ద కూడా ప్యానెల్స్ బిగిస్తారు. శ్రీరామనవమి నాటికల్లా రాములవారి కోవెలలో సోలార్​ లైట్లు వెలగనున్నాయి. తెలంగాణలో సోలార్​ లైటింగ్​ ఉన్న ఏకైక దేవాలయంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రికార్డులకెక్కనుంది. తెలంగాణ ఆర్టీసీకి సోలార్​ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన సన్​ టెక్నాలజీస్​ సంస్థ దేవస్థానంతో ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటికీ, ఎండోమెంట్​ కమిషనర్​ నుంచి పర్మిషన్​ రాక ఆలస్యమైంది. ప్రాజెక్టు ఖర్చును సన్​ టెక్నాలజీస్​ సంస్థ భరిస్తుండగా, 25 ఏళ్ల పాటు ఒకే ధరకు యూనిట్​ కరెంట్​ సరఫరా చేయనుంది. కిలో వాట్ నుంచి 10 కిలోవాట్లకు రూ.5.80, 11కేవీ నుంచి 100 కేవీల వరకు యూనిట్​కు రూ.5.50, 100 కేవీ దాటితే యూనిట్​కు రూ.4.80లు వసూలు చేయనుంది. ప్రస్తుతం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం యూనిట్​కు రూ.9 చొప్పున నెలకు రూ.7 లక్షల కరెంట్  బిల్లులు 
చెల్లిస్తోంది. 

ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్‌తోనైనా పోరాటం

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే సీఎం కేసీఆర్​తోనైనా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం తెలిపారు. సిటీలోని సుందరయ్య భవన్‌లో బుధవారం పార్టీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని, అంతమాత్రాన ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్‌తోనూ రాజీ పడేది లేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్‌, బత్తుల హైమావతి, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేశ్, బొంతు రాంబాబు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్‌, చింతలచెర్వు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

‘పర్మిషన్​ లేని ప్లాట్లు కొనవద్దు’

కూసుమంచి, వెలుగు: మండలంలోని జుజ్జల్​రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీనిధి ఎన్​క్లేవ్​ వెంచర్​ పేరిట 37 ఎకరాల్లో విక్రయిస్తున్న ప్లాట్లకు ఎలాంటి పర్మిషన్​ లేదని జీపీ సెక్రటరీ సహజ తెలిపారు. బుధవారం ప్రజలు మోసపోకుండా లేఔట్​ పర్మిషన్​ లేదు.. ప్లాట్లు కొనవద్దని వెంచర్​లో బోర్డు పెట్టారు. రైతుల నుంచి రిజిస్ట్రేషన్​ చేయించుకోకుండా ల్యాండ్​ డెవలప్​ చేస్తుండడంతో ప్రజలు మోసపోకుండా అనుమతులు లేవని బోర్డు పెట్టినట్లు ఆమె చెప్పారు.


సీతారాముల ఉత్సవమూర్తులకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఉత్సవమూర్తులకు ప్రాకార బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు. పాలు, పంచదార, తేనె, నెయ్యి, పెరుగుతో అభిషేకం చేశారు. అభిషేక జలాలను భక్తులకు ప్రసాదంగా అందించారు. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణ వేడుక జరిగింది. మాధ్యాహ్నిక ఆరాధనల అనంతరం రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. 

దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి

చండ్రుగొండ, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి సతీశ్​ డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్​ రవికుమార్ కు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దివ్యాంగులకు అంత్యోదయ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్వయం ఉపాధి కోసం  గొర్రెలు, బ్యాంకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. టీవీపీఎస్  సభ్యులు నాగేశ్వరావు, ఖాసిం, గోవింద్, శివ, మీరా పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి రూ.11.25 కోట్లు మంజూరు

పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని శ్రీనివాస కాలనీ గుట్టపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11.25 కోట్లను మంజూరు చేసినట్లు కొత్తగూ డెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. రిజర్వ్​ ఫారెస్ట్  పరిధిలో రోడ్డు నిర్మాణం చేస్తుండగా, ఆ స్థలానికి బదులుగా అశ్వారావుపేట మండలంలో 1.85 హెక్టార్ల భూమిని అటవీశాఖకు అప్పగించినట్లు చెప్పారు.

రాష్ట్ర స్థాయి క్రీడలకు ఏర్పాట్లు చేయాలి

పాల్వంచ, వెలుగు: కిన్నెరసాని స్పోర్ట్స్​ స్కూల్​లో నిర్వహించే రాష్ట్ర స్థాయి 6వ ఇంటర్  లీగ్  సొసైటీ క్రీడా పోటీలకు సిద్ధం కావాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. బుధవారం కిన్నెరసాని స్పోర్ట్స్​ స్కూల్​ ఆవరణలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 400 మీటర్ల ట్రాక్ ను పటిష్టంగా నిర్మించాలని, వేదిక నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు వసతి ఏర్పాట్లలో లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేల మంది హాజరవుతారని తెలిపారు. ఆయన వెంట ఏపీవో డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్  డీడీ రమాదేవి, ఈఈ తానాజీ, దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, స్పోర్ట్స్​ ఆఫీసర్​ డాక్టర్ వీరు నాయక్ ఉన్నారు. 

పత్తికి రూ.12 వేలు చెల్లించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: పత్తి క్వింటాలుకు రూ.12 వేలు మద్దతు ఇవ్వాలని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని, కోతులను నియంత్రించి పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్  చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్  మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలు కురిసి పత్తి దిగుబడి తగ్గిందని అన్నారు. కోతులతో వేలాది ఎకరాల్లో పంట ధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు టి. భాస్కర్ రావు, సీహెచ్  చలపతిరావు ,షేక్  మీరా, వి ప్రసాద్, డి కృష్ణ  పాల్గొన్నారు.

సిమెంట్ రోడ్లకు ఎంపీ నామా ఫండ్స్

ఖమ్మం టౌన్, వెలుగు: టీఆర్ఎస్​ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లాలోని ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని ఆరు చోట్ల సీసీ రోడ్లు నిర్మించేందుకు రూ.24.50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఏన్కూరు మండలం నూకాలంపాడుకు రూ.10 లక్షలు, జన్నారం గ్రామానికి రూ.4.50 లక్షలు, సింగరేణి మండలం సీతారాంపురానికి రూ. 5 లక్షలు, పాటిమీదిగుంపు గ్రామానికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు.

రాజుపేట కాలనీలో కార్డెన్​ సెర్చ్

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణ​శివారులోని రాజుపేట కాలనీలో బుధవారం కార్డెన్​ సెర్చ్ నిర్వహించారు. 50 మంది సివిల్, సీఆర్పీఎఫ్​ జవాన్లతో కలిసి సీఐ నాగరాజురెడ్డి, ట్రాఫిక్​ ఎస్ఐ వీఎన్​రావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించి వారి ఐడెంటిటీ కార్డులను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని 30 బైక్​లను సీజ్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, అసాంఘిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ కోరారు.

సాగు భూములకు పట్టాలివ్వాలి

భద్రాచలం, వెలుగు: సాగులో ఉన్న భూములన్నింటికీ పట్టాలివ్వాలని, పోడు సర్వే సమగ్రంగా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గిరిజనులపై పెట్టిన కేసులు సరైనవేనని నమ్మించేందుకు ఫారెస్ట్  ఆఫీసర్లు సర్వేను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దబ్బకట్ల లక్ష్మయ్య, గడ్డం స్వామి, మర్లపాటి రేణుక, సరియం రాజమ్మ, చిలకమ్మ, చంద్రయ్య, సున్నం గంగ, కారం నరేశ్​​పాల్గొన్నారు.