- వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీపీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అలర్ట్గా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఆటోల ద్వారా మైక్ ల ద్వారా మాల్స్, రైల్వే స్టేషన్స్ బస్టాండ్, రద్దీ ప్రాంతాలలో సైబర్ నేరాలపై ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అర్థమయ్యేలా రూపొందించిన సైబర్ నేరాల పోస్టర్లకు అన్ని రద్దీ ప్రాంతాల్లో ప్రదర్శించాలని సూచించారు. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లు, వెబ్ సైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, వాట్సాప్. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి మోసపురిత ఆఫర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
