పరిమితికి మించి పామాయిల్​ వాడకం.. ఖమ్మంలో బట్టబయలైన రెస్టారెంట్ల లోపాలు

పరిమితికి మించి పామాయిల్​ వాడకం.. ఖమ్మంలో బట్టబయలైన రెస్టారెంట్ల లోపాలు
  • నిల్వ చేసిన చికెన్ కబాబ్స్​
  • ఖమ్మం సిటీలో పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు 
  • మోతాదుకు మించి పామాయిల్ వినియోగం 
  • ఫుడ్ ​సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో గుర్తింపు 

ఖమ్మం/ ఖమ్మం టౌన్​, వెలుగు: ఖమ్మం సిటీలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్​సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్​లో దాచిన చికెన్ కబాబ్స్​, ప్లాస్టిక్​ బకెట్లలో మ్యారినేట్ ​చేసిన చికెన్​, బ్యాచ్​ నంబర్​ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు​ లేని పసుపు, ఎక్స్​పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్​ అతిక్రమించి పామాయిల్ వినియోగం,.. ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​జిల్లాల ఫుడ్​సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ ​జ్యోతిర్మయి ఆదివారం టాస్క్​ఫోర్స్​ టీమ్​తో కలిసి ఖమ్మంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. 

శ్రీశ్రీశ్రీ హోటల్, రెస్ట్​ ఇన్​ ​హోటల్​లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్​నెస్​ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్​చేశారు. శాంపిల్స్​ను పరీక్షల కోసం ల్యాబ్​కు పంపించారు. అయితే, రెస్ట్​ ఇన్​ ​హోటల్​లో ఫ్రీజర్​లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ ​కబాబ్స్​ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ​ప్రకారం మున్సిపల్ ​సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా..అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు 
వ్యక్తమవుతున్నాయి. 

అంతా రూల్స్​కు విరుద్ధమే..

రెస్ట్​ ఇన్​ హోటల్​లో ఏ బ్రాండ్ లేని, తయారీ తేదీ లేని 60 కిలోల పసుపు, 4 కిలోల నూడుల్స్, ఫ్రిజ్​లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ ​కబాబ్​లు కనిపించాయి. శ్రీశ్రీ హోటల్​లో రూల్స్​ ప్రకారం వంటల్లో 15 శాతం పామాయిల్ వాడాల్సి ఉండగా..23 శాతం వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఫ్రీజర్​ను మైనస్​80 డిగ్రీల్లో ఉంచి వస్తువులు నిల్వ చేయాల్సి ఉండగా, మైనస్​120 డిగ్రీలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి 

ప్లాస్టిక్​ కవర్లలో పెట్టి ఫ్రిజ్​లో నిల్వ ఉంచారు. చికెన్​ధమ్​ బిర్యానీ కోసం మ్యారినేట్​ చేసిన చికెన్​ను ప్లాస్టిక్ బకెట్​లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్​ చేసిన చికెన్​ను బయటపడేయించారు. కిచెన్​ను అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్​ అయ్యారు. స్టోర్​రూమ్స్​లో ఎక్స్​పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్​ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ ​చేశారు. ఫుడ్​సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్​ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్​ నంబర్​లేకపోతే ఫైన్​తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ఏడు నెలల్లో కేవలం14 కేసులే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు,28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్​ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి, రెగ్యులర్​గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసీ చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.