తెలుగు అంతరించే పరిస్థితులొచ్చాయి: జస్టిస్​ఎన్. వి.రమణ

తెలుగు అంతరించే పరిస్థితులొచ్చాయి:  జస్టిస్​ఎన్. వి.రమణ

ఖమ్మం టౌన్, వెలుగు : తెలుగు అంతరించే పరిస్థితులు ఏర్పడ్డాయని, మన భాషలో మనం మాట్లాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూకలపాటి వెంకట రమణ కోరారు. ఆదివారం ఖమ్మం సిటీలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో కమ్మ మహాజన అధ్యక్షుడు ఎర్నినేని రామారావు అధ్యక్షతన ఎన్. వి.రమణ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించారు. దీనికి చీఫ్​ గెస్ట్​గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ హాజరయ్యారు. ముందుగా జస్టిస్ ఎన్.వి.రమణ, తన భార్య శివమాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జస్టిస్ రమణ మాట్లాడుతూ పదవిలో ఉన్నప్పుడు పిలిచి సన్మానిస్తారని, కానీ, తాను పదవీ విరమణ పొందినా సన్మానించడం సంతోషాన్నిస్తుందన్నారు. మనం ఏ దేశంలో ఉన్న మన మూలాలు, మనవాళ్లను మర్చిపోవద్దన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తెలుగువాడికి గౌరవం తెచ్చిన వ్యక్తి జస్టిస్ రమణ అని అన్నారు. ఆల్మట్టి డ్యాం ప్రాజెక్ట్ అక్రమంగా నిర్మిస్తున్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులతో జస్టిస్​ రమణ కమిటీ వేయించడాన్ని తుమ్మల గుర్తు చేశారు. ఆల్మట్టి డ్యాం హైట్ పెంచకుండా అడ్డుకున్న వ్యక్తి రమణ అని  కొనియాడారు.