ఒక్క చాన్సివ్వండి.. ఖానాపూర్​ను సిరిసిల్ల చేస్తా : జాన్సన్ నాయక్

ఒక్క చాన్సివ్వండి.. ఖానాపూర్​ను సిరిసిల్ల చేస్తా : జాన్సన్ నాయక్

జన్నారం, వెలుగు: తనకు ఒక్క ఆవకాశమిస్తే ఖానాపూర్ ​నియోజకవర్గాన్ని సిరిసిల్ల లెక్క అభివృద్ధి చేస్తానని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్ అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని రాంపూర్, తపాలాపూర్, రోటిగూడ, మహ్మదాబాద్, చింతగూడ, ధర్మారం, రేండ్లగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేసిన సభల్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్​తో పాటు, మంత్రి కేటీఆర్ సైతం ఖానాపూర్ ను దత్తత తీసుకుంటామని ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామాల్లో తాగు నీటితో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు. అసరా పెన్షన్లతో పాటు ఆడ పిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అందించి పేదలను అదుకున్న ఘనత కేసీఆర్​కే దక్కిందన్నారు.

 మళ్లీ అధికారంలోకి వస్తే 18 ఏండ్లు నిండిన ఆడ పిల్లలకు సౌభాగ్యలక్ష్మి పథకం క్రింద ప్రతి నెలా రూ.3 వేలు వారి బ్యాంక్ అకౌంట్​లో వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. తనను గెలిపిస్తే గతంలో పెన్షన్లు రాని వృద్ధులు, బీడీ కార్మికులకు ఎలాంటి పైరవీలు లేకుండా అందరికీ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్ర మంత్రి, ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి, ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, పార్టీ మండల ప్రెసిడెంట్ గుర్రం రాజారాంరెడ్డి, జనరల్ సెక్రెటరీ సులువ జనార్దన్, జిల్లా అధికార ప్రతినిధి సిటీమల భరత్ కుమార్, సర్పంచ్​ల ఫోరం మండల కన్వీనర్ జాడి గంగాధర్, పార్టీ లీడర్లు ఫజల్ ఖాన్, విజయ్ ధర్మా, సీపతి బుచ్చన్న, జాడి శంకర్, ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఖానాపూర్ ఆలయంలో పూజలుకార్తిక పౌర్ణమిని పురష్కరించుకొని సోమవారం ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జాన్సన్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బక్కశెట్టి కిషోర్, రాజేందర్ గౌడ్, మహేశ్ తదితరులున్నారు.