భైంసాలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఒకవేళ అలా చేయకపోతే ఊరేసుకుంటానని చెప్పారు.కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మెన్ గా చేస్తే పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. గోండు బిడ్డగా మాట ఇస్తున్నా.. అభివృద్ధి చేయకపోతే ఉరేసుకుంటా అని భైంసాలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్స్ ఎన్నికల ప్రచారానికి సోమవారం ఆఖరి రోజు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 9న సాయంత్రం 5 నుంచి 11న సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రైడే అమలులో ఉంటుందని తెలిపింది. ఎక్కడైనా మద్యం పంపిణీ చేసినా, బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరిపినా సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.
