పదేళ్ల పాలనలో వాపస్​ తీస్కోలేదేం? :కచ్చతీవు దీవులపై మోదీకి ఖర్గే కౌంటర్

పదేళ్ల పాలనలో వాపస్​ తీస్కోలేదేం? :కచ్చతీవు దీవులపై మోదీకి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: పదేళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీకి దేశ సరిహద్దుల సమగ్రత, నేషనల్ సెక్యూరిటీ గుర్తుకొచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్​మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. పదేళ్ల తర్వాత సడెన్ గా నిద్రలేచి, ఎన్నికల ముందు ఈ సున్నిత అంశాన్ని ప్రస్తావించడం మోదీలోని నిరాశను బయటపెడుతోందని అన్నారు. రెండు టర్మ్ లు దేశాన్ని పాలించిన బీజేపీ సర్కారు కచ్చతీవు దీవులను ఎందుకు తిరిగి తీసుకోలేకపోయిందంటూ ఖర్గే ట్వీట్ చేశారు. 1974లో శ్రీలంకతో జరిగిన స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా కచ్చతీవు దీవులను ఆ దేశానికి అప్పగించడం జరిగిందన్నారు.

 బీజేపీ మొదటి టర్మ్ పాలనలోనూ బంగ్లాదేశ్​తో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుందని ఖర్గే గుర్తుచేశారు. ఇండియా, బంగ్లాదేశ్​ల మధ్య సరిహద్దులకు సంబంధించి కుదిరిన ఈ ఒప్పందం కేవలం భూమి గురించి మాత్రమే కాదని, రెండు హృదయాల కలయిక అని మోదీ చెప్పారని గుర్తుచేశారు. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్​లోని 111 భారత భూభాగాల(ఎంక్లేవ్స్)పై హక్కులను మోదీ సర్కార్ ఆ దేశానికి బదిలీ చేసిందని చెప్పారు. బంగ్లా​ నుంచి 55 భూభాగాలపై హక్కులు మన దేశానికి సంక్రమించాయని వివరించారు.