
- రాజ్యసభలోకి సీఐఎస్ఎఫ్ బలగాలను పంపడమేంది?
- డిప్యూటీ చైర్మన్పై ఖర్గే ఫైర్
- ప్రతిపక్ష నేతల హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శ
- సభలో ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకోండి: నడ్డా
- తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఫైర్ అయ్యారు. సభలోకి సీఐఎస్ఎఫ్ బలగాలను పంపడంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘సభను నడుపుతున్నది ఎవరు? మీరా (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్)? కేంద్ర హోం మంత్రి అమిత్ షానా?” అని నిలదీశారు. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత జీరో అవర్‌లో ఖర్గే మాట్లాడారు. బిహార్‌లో ఓటరు జాబితా సవరణకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై చర్చ జరపాలని సభలో ప్రతిపక్ష నేతలు గతవారం డిమాండ్ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ బలగాలను పంపడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ‘‘సభలో ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కులను ఉపయోగించుకుంటుంటే సీఐఎస్ఎఫ్ బలగాలు వెల్ లోకి దూసుకొచ్చాయి. దీంతో మేము ఆశ్చర్యపోయాం. బలగాలను సభలోకి పంపి ప్రతిపక్ష నేతల హక్కులను కేంద్రం ఉల్లంఘించింది” అని ఖర్గే ఆరోపించారు.
వారు మార్షల్స్.. సీఐఎస్ఎఫ్ ఫోర్సెస్ కాదు
ఖర్గే వ్యాఖ్యలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తప్పు పట్టారు. వారు సీఐఎస్ఎఫ్ బలగాలు కాదని, మార్షల్స్ అని తెలిపారు. సభలో అసలు సీఐఎస్ఎఫ్ ఫోర్సెస్ ప్రవేశించలేదని పేర్కొన్నారు. హరివంశ్ కు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మద్దతు పలికారు. రిజిజు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను ఖర్గే తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మరో కేంద్ర మంత్రి, హౌస్ లీడర్ జేపీ నడ్డా కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘నేను 40 ఏండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ, ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. సమర్థవంతమైన ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో కాంగ్రెస్ పార్టీ నా దగ్గర ట్యూషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, వారు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు” అని నడ్డా వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్ సభలో ముందు ఆమోదించగా.. మంగళవారం రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు పార్లమెంటు ఆమోదం తెలిపినట్లయింది.