న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. శక్తివంతమైన వారిని ఎదుర్కొనేటప్పుడు ఆమె నిర్భయంగా, అచంచలంగా ఉండేవారని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘భారతదేశ ఆత్మగౌరవం కంటే మరేదీ ముఖ్యం కాదని ఆమె మాకు నేర్పించారు’’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు కలిసి రాహుల్ శక్తి స్థల్ వద్ద ఇందిరా గాంధీకి అంజలి ఘటించారు. సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని ఇందిర స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ‘‘శక్తిమంతులను ఎదుర్కొనేటప్పుడు మా నానమ్మ ఇందిర అచంచలమైనది. భారతదేశ గుర్తింపు, ఆత్మగౌరవం కంటే మరేదీ ముఖ్యం కాదని మాకు నేర్పించారు. ఆమె ధైర్యం, కరుణ, దేశభక్తి.. నేను వేసే ప్రతి అడుగులోనూ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి” అని రాహుల్ట్వీట్చేశారు.
కష్టాలను ఎదిరించి నిలిచే తత్వం, ధైర్యం, దార్శనికత, నాయకత్వానికి ఇందిరా గాంధీ చిహ్నం అని ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ, మన రోల్ మోడల్ అయిన ఇందిరకు నివాళి. ఆమె తన దృఢ సంకల్పం, నాయకత్వంతో దేశ సమగ్రతను కాపాడటంలో, బలమైన, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు” అని పేర్కొన్నారు.
