అధికార చోరీ ప్రయత్నమే... బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

అధికార చోరీ ప్రయత్నమే... బీజేపీపై కాంగ్రెస్ చీఫ్  ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: ఓట్ చోరీ అయిపోయిందని, ఇప్పుడు అధికారాన్ని కూడా చోరీ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే అన్నారు. ప్రతిపక్షాల ప్రభుత్వాలను పడగొట్టేందుకే కొత్త బిల్లులు తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష సీఎంలను ఏదో కారణంతో 30 రోజుల పాటు జైల్లో వేసి అధికారాన్ని లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆ బిల్లులు అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యంపై బుల్డోజర్  ఎక్కించినట్లేనని పేర్కొన్నారు. 

ఆ బిల్లులతో ఈడీ, సీబీఐ వంటి సంస్థలకు అధికారాన్ని కట్టబెడతారన్నారు. ఇటీవలే నియమితులైన హర్యానా, మధ్యప్రదేశ్  డిస్ట్రిక్ట్  కాంగ్రెస్  కమిటీల (డీసీసీ) ప్రెసిడెంట్లతో ఆదివారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఖర్గే భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ బూత్, మండల కమిటీలను ఏర్పాటు చేయడంలో జాగ్రత్తగా ఉండాలని, పార్టీకి విధేయులుగా ఉండాలన్నారు.

ఓట్లు చోరీ కాకుండా జాగ్రత్త పడాలి

ఓట్లు చోరీ కాకుండా జాగ్రత్తగా ఉండాలని డీసీసీ చీఫ్​లకు ఖర్గే సూచించారు. కర్నాటకలోని మహదేవపురలో ఓట్లను ఎలా దొంగిలించారో పార్టీ ఎంపీ రాహుల్  గాంధీ ప్రజంటేషన్  ఇచ్చారని గుర్తుచేశారు. ‘‘కేవలం 6 నెలల్లోనే ఓట్లను చోరీ చేశారని తెలుసుకున్నాం. దీనిపై ఎలక్షన్  కమిషన్ ను అడిగితే జవాబు లేదు. 

ఓట్ల చోరీ జరిగిందని ఇప్పుడు దేశమంతా అర్థం చేసుకుంటోంది. ఓట్ల చోరీ, సర్ పై చర్చించాలని పార్లమెంటులో మేము డిమాండ్  చేస్తే, మా గొంతు నొక్కేశారు. సర్ తో ప్రజల ఓట్లు దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి ఓట్లు చోరీ కాకుండా డీసీసీ ప్రెసిడెంట్లు జాగ్రత్త పడాలి” అని ఖర్గే అన్నారు.