తమిళ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుందర్ సి ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. సుమారు మూడు దశాబ్దాల పాటు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ సందర్భంగా ఖుష్బూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మదురై సెంట్రల్ నుంచి బరిలోకి..
ఎన్నికల టైమ్ దగ్గర పడటంతో రాజకీయ పార్టీలో పోత్తు ఎత్తులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పుతియ నీతి కచ్చి (PNK) పార్టీ తరపున సుందర్ సి పోటీ చేయబోతున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా మదురై సెంట్రల్ స్థానాన్ని ఏఐఏడీఎంకే (AIADMK) కోటా కింద పీఎన్కేకు కేటాయించారు. దీనిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం స్పందిస్తూ.. సుందర్ సి అభ్యర్థిత్వాన్ని ధృవీకరించారు. అయితే ఇక్కడ సుందర్ సి పీఎన్కే అభ్యర్థి అయినప్పటికీ, ఏఐఏడీఎంకే యొక్క అధికారిక చిహ్నం ‘రెండాకులు’ పైనే పోటీ చేయనున్నారు.
భర్త విజయంపై ఖుష్బూ ధీమా
తన భర్త రాజకీయ ప్రవేశంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 30 ఏళ్లుగా సినిమాల ద్వారా మిమ్మల్ని అలరించిన వ్యక్తి, ఇప్పుడు ప్రజల మనిషిగా సేవ చేయడానికి వస్తున్నారు. ఆయన ఎదుగుదలకు కారణమైన తమిళనాడు ప్రజలకు తిరిగి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉంది. నా భర్త నిర్ణయం చూసి గర్వపడుతున్నాను అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఎడప్పాడి పళనిస్వామి, నైనార్ నాగేంద్రన్ వంటి అగ్రనేతల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
హోరాహోరీ పోరు తప్పదా?
సుందర్ సి పోటీ చేయబోతున్న మదురై సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం అధికార డీఎంకే (DMK) కంచుకోటగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఐటీ శాఖ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీటీఆర్ తాతగారు పీటీ రాజన్ గతంలో జస్టిస్ పార్టీకి వెన్నెముకగా ఉండేవారు. ఇప్పుడు అదే జస్టిస్ పార్టీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ‘పుతియ నీతి కచ్చి’ నుంచి సుందర్ సి బరిలోకి దిగుతుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుంది.
►ALSO READ | నాగార్జున సరసన ఆ క్రేజీ హీరోయిన్? 'కింగ్ 100' చిత్రంలో మరో సర్ప్రైజ్!
ముదలియార్ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుందర్ సి ఇమేజ్ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఒకవైపు స్టార్ డైరెక్టర్ గా క్రేజ్, మరోవైపు భార్య ఖుష్బూ రాజకీయ అండదండలు ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
