సౌమ్యుడు,స్నేహశీలి కిచ్చా సుదీప్

సౌమ్యుడు,స్నేహశీలి కిచ్చా సుదీప్

ఎటువంటి పాత్రకైనా పర్‌‌ఫెక్ట్ అనిపించుకోగల సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి నటుడే సుదీప్. కన్నడలో ఆయన స్టార్ హీరో. తెలుగువారికి ఆయనో బెస్ట్ విలన్. బాలీవుడ్ వారికి బెస్ట్ యాక్టర్. మొత్తంగా అందరికీ ఆయన ఫేవరేట్. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా సుదీప్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు..

1971లో సెప్టెంబర్ 2న కర్ణాటకలో పుట్టారు సుదీప్. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చదివారు. చిన్నప్పట్నుంచీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాలేజ్‌ తరఫున అండర్ సెవెంటీన్, అండర్ నైన్టీన్ మ్యాచెస్ కూడా ఆడారు. నటనపై కూడా అమితమైన ఆసక్తి ఉండటంతో ముంబైలోని రోషన్ తనేనా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరి ట్రైనింగ్ తీసుకున్నారు. సుదీప్ మొదటి సినిమా ‘థయవ్వా’. సునీల్ కుమార్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించారు సుదీప్. ఆ తర్వాత మూడేళ్లకి ‘స్పర్శ’ చిత్రంలో హీరోగా నటించే చాన్స్ దొరికింది. ఆ నెక్స్ట్ ఇయర్ చేసిన ‘హచ్చా’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ‘కిచ్చా’ సినిమాతో స్టార్‌‌ అయిపోయారు. అందుకే ఆయన్ని అందరూ కిచ్చా సుదీప్ అంటుంటారు.

కెరీర్ స్టార్ట్ చేసిన తొమ్మిదేళ్లకి బాలీవుడ్‌లో అడుగుపెట్టారు సుదీప్. రామ్‌ గోపాల్ వర్మ తీసిన ‘ఫూంక్’లో నటించారు. ఆపైన వర్మ తీసిన మూడు నాలుగు చిత్రాల్లో యాక్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’లోనూ కీలక పాత్ర పోషించారు. ఇక తెలుగులో సుదీప్ మొదటి సినిమా ‘ఈగ’. రాజమౌళి తీసిన ఈ ఫ్యాంటసీ ఫిల్మ్లో విలన్‌గా తన పర్‌‌ఫార్మెన్స్ తో ఫిదా చేయడమే కాదు.. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డును సైతం అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు సుదీప్. 

సుదీప్‌లో మంచి నటుడే కాదు.. దర్శకుడు కూడా ఉన్నాడు. ‘మై ఆటోగ్రాఫ్‌’ అనే సినిమా కోసం మొదటిసారి మెగాఫోన్ పట్టారాయన. ఈ సినిమా పెద్ద హిట్. 175 రోజులు ఆడింది. ఆ తర్వాత నంబర్ సెవెన్టీ త్రీ, శాంతి నివాస, వీర మడకరి, జస్ట్ మాత్‌ మథాలీ, కెంపె గౌడ, మాణిక్య లాంటి చిత్రాలు తెరకెక్కించారు సుదీప్. ‘జస్ట్ మాథ్ మథాలి’ మూవీకి ఆయనే స్క్రిప్ట్ కూడా రాయడం విశేషం. ఇక సుదీప్‌కి కిచ్చా క్రియేషన్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైన కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు సుదీప్. రియాలిటీ షోస్, మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్నారు. కన్నడ బిగ్‌బాస్‌కి హోస్ట్ కూడా ఆయనే. సుదీప్ మంచి సింగర్ కూడా. పలు సినిమాల్లో ఇరవై వరకు పాటలు పాడారు. 

కన్నడ నాట సుదీప్‌ని ‘అభినయ చక్రవర్తి’ పేరుతో పిలుస్తారు. శాండిల్‌వుడ్‌లోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో ఆయనా ఒకరని కాంప్లిమెంట్స్ కురిపిస్తారు. ఎన్నో యాడ్స్ కు సుదీప్ బ్రాండ్ అంబాసిడర్ కూడా. అంతేకాదు.. సోషల్ సర్వీస్‌లోనూ సుదీప్ ముందుంటారు. కిచ్చా సుదీప చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. యూనిఫామ్‌లు, స్కాలర్‌‌షిప్పులు అందిస్తున్నారు. సీనియర్ కన్నడ ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఆర్థిక సహాయం కూడా అందిస్తుంటారు. కోవిడ్ టైమ్‌లో సుదీప్ ట్రస్ట్ చాలా యాక్టివ్‌గా వర్క్ చేసింది. ఎయిడ్స్ నిర్మూలనకు కూడా తన ఎన్జీవో ద్వారా కృషి చేస్తున్నారు సుదీప్. 

ఇండస్ట్రీలో కూడా సౌమ్యుడు, స్నేహశీలి అనే పేరుంది సుదీప్‌కి. ఎంత బిజీగా ఉన్నా ఇతర హీరోల సినిమాలకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయమని అడిగినప్పుడు నో అనరాయన. చాలా సినిమాలకి వాయిస్ ఇచ్చారు. ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. నిడివి గురించి పట్టించుకోకుండా చిన్న పాత్రనైనా చేయడం, స్టార్‌‌డమ్ కోసం పాకులాడకుండా అందరితో కలివిడిగా ఉండటమే సుదీప్‌ స్పెషాలిటీ అని అందరూ అంటుంటారు.ఆయన మరెన్నో సంవత్సరాలు ఇలాగే ముందుకు కొనసాగాలని, కెరీర్‌‌లో ఎన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తూ.. సుదీప్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.