
కాశీబుగ్గ, వెలుగు : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి, అప్పులపాలైన యువకుడు డబ్బుల కోసం కిడ్నాప్‌కు గురైనట్లు డ్రామా ఆడాడు. తన ఫ్రెండ్‌తో తల్లిదండ్రులకు ఫోన్ చేయించి.. రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన వరంగల్ నగరంలో మంగళవారం వెలుగుచూసింది.
మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి ఓ యువకుడు ఫోన్ చేసి ‘మీ కొడుకు అదిత్ సోనిని కిడ్నాప్ చేశాం.. రూ. 10 లక్షలు ఇస్తే వదిలేస్తాం.. లేదంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీంతో అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా.. హంటర్ రోడ్డులోని ఓ హోటల్‌లో ఉన్నట్లు తేలింది.
అక్కడికి వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన అదిత్ సోని పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. దీంతో డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామాకు తెర లేపి.. తన ఫ్రెండ్‌తో తల్లిదండ్రులకు ఫోన్ చేయించి డబ్బులు డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు.