చంద్రయాన్ 3 సక్సెస్ ఎఫెక్ట్: పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్ పేర్లు

చంద్రయాన్ 3 సక్సెస్ ఎఫెక్ట్: పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్ పేర్లు

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం, ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఘనతను, ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను మెచ్చుకున్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. . తాజాగా కర్ణాటకకు చెందిన వారు తమ కుమారులకు విక్రమ్, ప్రజ్ఞాన్ లుగా నామకరణం చేసి దేశ భక్తిని చాటుకున్నారు. స్థానికులు సైతం వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, చిన్నారుల పేర్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిన తరువాత కర్ణాటకలోకి యాదగిరి జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు శిశువులకు విక్రమ్, ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. వడగెరా పట్టణానికి చెందిన బాలప్ప, నాగమ్మ దంపతులకు జూన్ 28న ఓ బాలుడు జన్మించాడు. ఆ బిడ్డకు  విక్రమ్ అని నామకరణం చేయగా.... అదే కుటంబానికి చెందిన నింగప్ప, శివమ్మ దంపతులకు ఆగస్టు 14న ఓ బాబు పుట్టాడు. ఆ చిన్నారికి ప్రజ్ఞాన్ గా నామకరణం చేశారు. చంద్రయాన్ 3లో రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలను గౌరవించేందుకు తమ పిల్లలకు విక్రమ్, ప్రజ్ఞాన్ పేరు పెట్టామని ఈ కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

భారత్ జులై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించగా.. పలు దశలు పూర్తి చేసుకున్నాక ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. అదే రోజు విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ సైతం జాబిల్లి మీద కాలుపెట్టి ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ అంతర్జాతీయంగా దేశానికి పేరు తీసుకొచ్చింది. భారత్ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది. 

వడగెరా పట్టణానికి చెందిన బాలప్ప, నాగమ్మ దంపతులకు జూన్ 28న ఓ బాలుడు జన్మించాడు. అదే కుటుంబానికి చెందిన నింగప్ప, శివమ్మ దంపతులకు ఆగస్టు 14న ఓ బాబు పుట్టాడు. ఆగస్టు 23న చంద్రయాన్ 3 సక్సెస్ కాగా, అందుకు గుర్తుగా ఈ ప్రయోగంలో ఉపయోగించిన ల్యాండర్ విక్రమ్ పేరును బాలప్ప, నాగమ్మ దంపతులు ఆగస్టు 24న తమ బాబుకు అదే పేరు పెట్టారు. నింగప్ప, శివమ్మ దంపతులు వారి సంతానమైన చిన్నారికి ప్రజ్ఞాన్ గా నామకరణం చేశారు. 

పాప పేరు చంద్రయాన్..

చంద్రయాన్ 3 సక్సెస్ అయినరోజు సాయంత్రం ఒడిశాలోని కేంద్రపరా జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు జన్మించారు. అందులో ఒక శిశువుకు చంద్రయాన్ గా నామకరణం చేయడం తెలిసిందే. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే జన్మించడంతో పాపకు చంద్రయాన్ అని నామకరణం చేసినట్లు ఆ శిశువు తల్లి ప్రవత్ మల్లిక్ తెలిపారు. దేశం గర్వించే ఈ అద్భుతమైన క్షణాన్ని మరింత ప్రత్యేకంగా ఉండేలా పాపకు ఈ పేరు పెట్టామన్నారు.