
సూపర్‌బగ్.. మందులు ఎంత పవర్ఫుల్ అయినా లొంగని మొండి బ్యాక్టీరియా. అయితే, బ్యాక్టీరియాలకు తోడు ఇప్పుడు ఫంగస్‌లూ మొండిగా తయారవుతున్నాయని అమెరికా, బ్రిటన్సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అనేక దేశాల్లోని హాస్పిటళ్లలో క్యాండిడా ఆరియస్ అనే ఫంగస్ అలియాస్ జపనీస్ ఫంగస్ తీవ్రంగా విజృంభిస్తోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సైంటిస్టులు హెచ్చరించారు. ఇండియా, అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్లలో దీని ముప్పు ఎక్కువగా ఉందని తేల్చారు.
జపాన్ నుంచి వ్యాప్తి
ఈ మహమ్మారి క్యాండిడా ఆరియస్ ఫంగస్ జపాన్ నుంచి ప్రపంచ దేశాలకు పాకింది. దానిని తొలిసారిగా 2009లో టోక్యో మెట్రోపాలిటన్ జెరియాట్రిక్ హాస్పిటల్లో గుర్తించారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండే రోగులకు ఇది సోకుతుంది. చర్మంపైనే ఉండే ఈ ఫంగస్, రక్తనాళాలు లేదా ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రాణాంతకంగా మారుతుంది. రోగులకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల ఒంట్లోని మంచి బ్యాక్టీరియా చనిపోవడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. దీంతో క్యాండిడా ఆరియస్ వివిధ అవయవాల్లోకి చేరిపోతుంది. ముఖ్యంగా రక్తనాళాల ద్వారా ఎక్కడికైనా చేరుకోగలదు. ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ వంటి వాటిని నాశనం చేసేస్తుంది. ఒక్కోసారి మెదడు వరకూ వెళ్లి నాడీవ్యవస్థనూ దెబ్బ తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫంగస్సోకిన వాళ్లలో దాదాపు 60% మంది చనిపోయారని అంటున్నారు. ఊపిరితిత్తుల వంటి అవయవాలకు ఇది సోకితే దీనిని సకాలంలో గుర్తించడం కష్టమవుతోందని, అందువల్ల ట్రీట్మెంట్చేయడం ఆలస్యమవుతోందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్’ సంస్థకు చెందిన డాక్టర్ఎలైన్క్లౌట్మాన్ వెల్లడించారు. చాలాసార్లు దీనిని వేరొక ఫంగస్ ఇన్ఫెక్షన్గా భావించి మందులు ఇస్తుండటంతో సైలెంట్‌గా పెరుగుతోందంటున్నారు.
వాతావరణ మార్పులతో..
ఫంగస్అంటే మన ఇండ్లల్ల రొట్టెలు, ఇతర ఆహారపదార్థాలపై పెరిగే బూజులే. మామూలుగా అయితే ఇవి తేమ, చల్లని వాతావరణం ఉంటేనే పెరుగుతాయి. కానీ.. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో క్యాండిడా ఆరియస్ కూడా రూట్ మార్చిందని సీడీసీ సైంటిస్టులు వెల్లడించారు. మనిషి బాడీ టెంపరేచర్ కు సమానంగా 36, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ల వేడి వాతావరణంలోనూ మనుగడ సాగించేలా ఇది మారిపోయిందని వారు తెలిపారు. యాంటీ ఫంగల్ మందులను తట్టుకునేలా దీనిలో జన్యుపరమైన మార్పులూ జరిగాయని సైంటిస్టులు చెబుతున్నారు. నోటిపుండ్లను కలిగించే క్యాండిడా ఆల్బికన్స్ ఫంగస్ డీఎన్ఏతో దీని డీఎన్ఏ పోలి ఉందని, దాంతోనే ఇది జీన్స్‌ను మార్చుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దానిని నివారించే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.