బ్రిటన్​ పార్లమెంట్​లో కింగ్​ చార్లెస్​ 3

బ్రిటన్​ పార్లమెంట్​లో కింగ్​ చార్లెస్​ 3

లండన్: బ్రిటన్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంట్‌‌ను ఉద్దేశించి కింగ్ చార్లెస్ 3 మాట్లాడారు. తన ప్రియమైన మాతృమూర్తి, క్వీన్ ఎలిజబెత్ నిస్వార్థ సేవా మార్గాన్ని అనుసరిస్తానని చెప్పారు. లండన్‌‌లోని వెస్ట్‌‌మినిస్టర్‌‌‌‌ హాల్‌‌లో హౌస్ ఆఫ్ కామన్స్, లార్డ్స్‌‌ సంతాప ప్రకటనపై ఆయన స్పందించారు. ‘‘తన దేశానికి, ప్రజలకు సేవ చేస్తానని.. రాజ్యాంగ ప్రభుత్వ అమూల్యమైన సూత్రాలను కొనసాగిస్తానని చాలా చిన్న వయసులోనే క్వీన్ ప్రతిజ్ఞ చేశారు. తన ప్రతిజ్ఞను ఆమె ఎంతో శ్రద్ధతో పాటించారు. నిస్వార్థ సేవకు ఒక ఉదాహరణగా నిలిచారు. దేవుడి సాయం, మీ సలహాలతో వాటిని అనుసరించాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆయన చెప్పారు. ఈ సంతాప కార్యక్రమానికి 900 మంది పార్లమెంట్ సభ్యులు, ఇతరులు హాజరయ్యారు. కొత్త ప్రభువుకు తమ విధేయతను ప్రకటించారు. సంతాప సందేశాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయ్లే చదివారు. తర్వాత రాజుకు అందజేశారు. మరోవైపు సంతాప తీర్మానాన్ని అందుకునేందుకు స్కాట్లాండ్‌‌ పార్లమెంట్‌‌కు కూడా చార్లెస్ హాజరు కానున్నారు.

ఇయ్యాల లండన్‌‌కు క్వీన్ పార్థివదేహం
బ్రిటన్ పార్లమెంటులో సంతాప కార్యక్రమం ముగిసిన తర్వాత ఎడిన్‌‌బర్‌‌‌‌కు క్వీన్‌‌ కామిల్లాతో కలిసి కింగ్ చార్లెస్ వెళ్లారు. అక్కడ హోలీ రూడ్‌‌హౌస్‌‌ నుంచి సెయింగ్ గైల్స్ కాథెడ్రల్‌‌కు క్వీన్ పార్థివదేహం ఉంచిన పేటికను తరలించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాథెడ్రల్‌‌లో 24 గంటలపాటు క్వీన్ పార్థివదేహాన్ని ఉంచి.. ప్రజల సందర్శనార్థం అవకాశం కల్పిస్తారు. మంగళవారం విమానంలో ఇంగ్లండ్‌‌లోని బకింగ్‌‌హామ్ ప్లాలెస్‌‌కు తరలిస్తారు. బుధవారం లండన్‌‌లోని వెస్ట్‌‌మిన్‌‌స్టర్ హాల్‌‌కు శవపేటికను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. సెప్టెంబర్ 19న అంత్యక్రియలు జరిగే రోజు వరకు అక్కడే ఉంచుతారు.