బ్రిటన్ రాజుకు ఉండే అసాధారణమైన అధికారాలు ఇవే

బ్రిటన్ రాజుకు ఉండే అసాధారణమైన అధికారాలు ఇవే

బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపడుతున్న చార్లెస్ 3 కి అసాధారణమైన అధికారాలు ఉంటాయి. ఆయనకు ఎన్నో సౌకర్యాలు, రాయితీలు దక్కుతాయి. ఆయన పాస్పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లొచ్చు. రాజకుటుంబంలోని మిగితా సభ్యుల లాగా పాస్ పోర్టు అవసరం లేదు. బ్రిటన్లో లైసెన్స్ లేకుండా వాహనం నడపవచ్చు. బ్రిటన్ లో లైసెన్స్ లేకుండా వాహనం నడిపే ఏకైక వ్యక్తి చక్రవర్తి మాత్రమే.

రెండు పుట్టినరోజులు 

చార్లెస్ రెండు పుట్టినరోజులు జరపుకోవొచ్చు. ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 కూడా రెండు పుట్టినరోజులు జరుపుకుంది. ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 కాగా దానిని ప్రైవేట్ గా జరుపుకుంటారు. అయితే వేసవిలో పరేడ్స్ కు అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండవ మంగళవారాన్ని రాణి బర్త్ డే వేడుకగా నిర్వహిస్తారు. చార్లెస్ పుట్టినరోజు కూడా చలికాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండడంతో ఆయన బర్త్ డేని కూడా వేసవిలో అధికారికంగా జరిపే అవకాశం ఉంది.

ఓటుహక్కు ఉండదు

బ్రిటన్ రాజు లేదా రాణి ఎప్పుడు ఓటెయ్యరు. అలాగే ఎన్నికల్లో పాల్గొనరు. దేశాధినేతగా వారు తటస్థంగా ఉంటారు. వీరు పార్లమెంట్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభించడంతోపాటు పార్లమెంట్ నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. బ్రిటీష్ చక్రవర్తికి జంతువులు, పక్షులపైనా అధికారం ఉంటుంది. ఇంగ్లాండ్, వేల్స్ జలాల్లోని హంసలు, డాల్ఫిన్లు, తిమింగళాలను చక్రవర్తి ఆస్తిగా పరిగణిస్తారు. అంతేకాకుండా బ్రిటన్ రాజు కోసం ఓ కవి ఉంటారు. రాజును కీర్తించేలా కవితలు రాసేందుకు ప్రతి పదేళ్లకు ఓ రచయితను బ్రిటన్ సర్కార్ నియమిస్తుంది. 

కంపెనీలకు రాయల్ వారెంట్

చక్రవర్తికి వస్తువులు సరాఫరా, సేవలు అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ అందజేస్తారు. ఇది వారికి గొప్ప గౌరవాన్ని ఇవ్వడంతోపాటు అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. క్యాడ్ బరీ, శాంసంగ్, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్,  బర్బేరీ, వెయిట్రోస్ సూపర్ మార్కెట్ లు రాయల్ వారెంట్ కలిగివున్న కంపెనీలలో ఉన్నాయి.