కవర్ స్టోరీ: కింగ్ కోహ్లీ! 

  కవర్ స్టోరీ: కింగ్ కోహ్లీ! 

రెండు పరుగులకు మూడు వికెట్లు..వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా పరిస్థితి ఇది. అప్పుడొచ్చాడు అతడు.. ఆసీస్ గెలుపుకు అడ్డుగోడకట్టాడు.. టీమిండియా విజయానికి వారధి వేశాడు. ఇలా ఆడటం ఇదే మొదటిసారి కాదు. అతడి ఆటే అంత. సగటున ప్రతి అరు మ్యాచ్‌‌‌‌లకు ఒక సెంచరీ కొట్టిన అరుదైన క్రికెటర్. ఛేజింగ్ అంటే ఇంకింత చెలరేగిపోతాడు. పరుగుల దాహం అలాంటిది.ప్రత్యర్థులు అతడిని కొరకరాని కొయ్య అంటారు. విశ్లేషకులు అతడిని ‘పరుగుల యంత్రం’ అని ప్రశంసిస్తారు. విమర్శకులు వివాదాస్పదుడని అంటారు. కానీ, కోట్లాది మంది అభిమానులు మాత్రం.. ‘కింగ్’ అంటారు. అతడే విరాట్ కోహ్లీ.

పదిహేనేండ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్‌‌‌‌లలో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు. ఫ్యాన్స్‌‌‌‌ను  ఫిదా చేస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 48 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డు బ్రేక్ చేసే దిశగా సాగుతున్నాడు. కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా.. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత  స్థానంలో ఉంటున్నాడు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా లీడ్ చేస్తున్న కోహ్లీ గురించి స్పెషల్ కవర్ స్టోరీ.

మూడేండ్లకే బ్యాట్ పట్టి 

విరాట్ కోహ్లీ ఒక పరుగుల ప్రవాహం. అరుదైన ఆటగాడు. పిచ్ ఎలాంటిదైనా.. అవతలున్నది ఎలాంటి బౌలర్​ అయినా లెక్క చేయడు. క్రీజులో అడుగు పెట్టాడంటే మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం అతడికి అలవాటైన పని. ఇదంతా ఏదో అలా సాధ్యం కాలేదు.. ఎంతో సాధన.. ఎన్నో ఒడిదొడుకులు.. ఇంకెన్నో సవాళ్లు.. వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి ఎదిగాడు. 1988 నవంబర్5న ఢిల్లీలో పుట్టిన విరాట్ కోహ్లీకి.. చిన్నప్పటి నుంచే క్రికెట్‌‌‌‌ అంటే ఇష్టం పెరిగింది. 

తన మూడేండ్ల వయసులోనే బ్యాట్ పట్టిన అతడు.. తనకు బౌలింగ్ చేయమని తన తండ్రిని అడిగే వాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ ప్రోత్సాహంతో అప్పుడు మొదలుపెట్టిన ఆట.. ఎన్నడూ ఆపలేదు. అయితే మంచి ప్రతిభ కనబరిచినా.. కొన్ని కారణాల వల్ల ఢిల్లీ అండర్ 14 టీమ్‌‌‌‌లో చోటు దక్కలేదు. దీంతో స్థానికంగా ఉన్న క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో చేర్చాలని, అప్పుడు టీమ్‌‌‌‌లో విరాట్‌‌‌‌కు చోటు దక్కుతుందని ప్రేమ్ కోహ్లీకి కొన్ని ఆఫర్లు వచ్చాయి. 

కానీ ఆయన వాటిని తిరస్కరించారు. మెరిట్‌‌‌‌ ఆధారంగానే టీమ్‌‌‌‌కు విరాట్ సెలక్ట్ కావాలని ఆయన భావించారు. ఆయన నమ్మకాన్ని విరాట్ వమ్ము చేయలేదు. తన ప్రతిభతోనే అండర్ 15 టీమ్‌‌‌‌లో చోటు సాధించాడు. ఆ టైంలో మాజీ రంజీ ప్లేయర్, క్రికెట్ కోచ్ రాజ్‌‌‌‌కుమార్ శర్మ కోచింగ్‌‌‌‌లో కోహ్లీ రాటుదేలాడు. ప్రాక్టీసుకు వస్తే అంత త్వరగా వెళ్లే వాడు కాదు. గంటలకు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో బలవంతంగా విరాట్‌‌‌‌ను రాజ్‌‌‌‌కుమార్ శర్మ ఇంటికి పంపించేవారట. 

కన్నీళ్లను దిగమింగుకుని..

ఫిబ్రవరి 18, 2006 న ‘లిస్ట్ ఏ’ క్రికెట్‌‌‌‌లో అడుగుపెట్టాడు కోహ్లీ. అదే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కర్నాటక– ఢిల్లీ మ్యాచ్‌‌‌‌ అప్పుడు అనుకోని దుర్ఘటన జరిగింది. ఢిల్లీ 130 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి.. క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అప్పటికే 40 పరుగులతో కోహ్లీ క్రీజులో ఉన్నాడు. ఆ రోజుకు ఆట పూర్తయింది. మరుసటి రోజు కోహ్లీ ఆటపైనే టీమ్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. 

కానీ డిసెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున విరాట్ తండ్రి ప్రేమ్‌‌‌‌ కోహ్లీ గుండెపోటుతో మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కోహ్లీ మ్యాచ్‌‌‌‌ ఆడేందుకు వచ్చాడు. కన్నీళ్లను దిగమింగుకుని బ్యాటింగ్ కొనసాగించాడు. 90 పరుగులు చేసి.. ఫాలో ఆన్ బారి నుంచి జట్టును కాపాడాడు. తర్వాత వెళ్లి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రి మరణం తర్వాత మ్యాచ్‌‌‌‌ ఆడటంపై కోహ్లీ స్పందిస్తూ.. ‘‘ఆ క్షణం నేను వ్యక్తిగా మారా. కఠిన నిర్ణయం తీసుకున్నా” అన్నాడు.

అండర్ 19 టీమ్ కెప్టెన్‌‌‌‌గా..

2008లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ చాలామంది క్రికెట్ అభిమానులకు,  ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్‌‌‌‌కు గుర్తుండే ఉంటుంది. అప్పుడు అండర్​ 19 టీం కెప్టెన్‌‌‌‌ కోహ్లీ. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌‌‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం159 పరుగులకే కుప్పకూలింది. ఇక మ్యాచ్ సౌతాఫ్రికాదేనని అంతా అనుకున్నారు. కానీ తన కెప్టెన్సీతో కోహ్లీ మ్యాజిక్ చేశాడు.

 టీమిండియాను 12 పరుగుల తేడా (డక్​వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో గెలిపించాడు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎంతో అగ్రెసివ్‌‌‌‌గా కనిపించాడు కోహ్లీ. అదే దూకుడు ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. అప్పటి అండర్ 19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ గెలిచిన టీమ్‌‌‌‌లో మనీశ్ పాండే, రవీంద్ర జడేజా కూడా సభ్యులుకావడం గమనార్హం. తర్వాత కొన్ని రోజులకే సీనియర్‌‌‌‌‌‌‌‌ టీమ్ తలుపుతట్టాడు కోహ్లీ. 2008 ఆగస్టులో శ్రీలంక టూర్‌‌‌‌‌‌‌‌కు, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అప్పటికి అతడు ఆడిన ‘లిస్ట్ ఏ’ మ్యాచ్‌‌‌‌లు కేవలం 8 మాత్రమే. ఆగస్టు 18న పందొమ్మిదేండ్ల వయసులో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌‌‌‌లో 12 పరుగులు చేశాడు. 

రన్స్ మెషిన్‌‌‌‌లా...

డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2008లో తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టు ‘గ్రేడ్ డి’ని కోహ్లీ పొందాడు. కానీ 2009 జనవరిలో జరిగిన శ్రీలంక సిరీస్‌‌‌‌కు ఎంపిక కాలేదు. తర్వాత 2009 జులై–ఆగస్టులో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌‌‌‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కోహ్లీ. దెబ్బకు మళ్లీ సీనియర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి తీసుకోకతప్పలేదు సెలక్టర్లకు. తర్వాత కొన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌‌‌‌లో మూడో మ్యాచ్‌‌‌‌లో 114 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇది కోహ్లీకి తొలి సెంచరీ. 

2010 మే–జూన్‌‌‌‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌‌‌‌కు వైస్ కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యాడు. అతి తక్కువ (26) మ్యాచ్‌‌‌‌లలో వెయ్యి పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్‌‌‌‌మన్ గా రికార్డు సృష్టించాడు. 2010లో వన్డేల్లో 995 పరుగులు చేసి.. ఐసీసీ పురుషుల ర్యాంకింగ్స్‌‌‌‌లో 2వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే సమయంలో 2011 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో సెంచరీతో చెలరేగాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌‌‌‌లోనే సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఫైనల్‌‌‌‌లో ప్రారంభంలోనే సచిన్, సెహ్వాగ్ ఔట్ కాగా.. గంభీర్‌‌‌‌‌‌‌‌తో కలిసి 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇండియా గెలిచింది. వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ తర్వాత జూన్‌‌‌‌లో టెస్టుల్లోకీ ఎంట్రీ ఇచ్చాడు. 

అప్పటి నుంచి పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రికార్డుల వర్షం కురుస్తూనే ఉంది. 2014లో టెస్టులకు ధోనీ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించడంతో సారథిగా కోహ్లీ ఎంపికయ్యాడు. 2017లో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌‌‌‌ అయ్యాడు. కెప్టెన్‌‌‌‌గా ఉన్నప్పుడే ఎక్కువగా పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. టెస్టుల్లో 68 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించాడు కోహ్లీ. అందులో 40 మ్యాచ్‌‌‌‌లు టీమిండియా గెలిచింది. 17 ఓడిపోగా, 11 డ్రాగా ముగిశాయి. వన్డేల్లో 95 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించగా.. 65 గెలిపించాడు. టీ20 ల్లో 50 మ్యాచ్‌‌‌‌లకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించి 30 గెలిపించాడు. 

సచిన్ రికార్డుకు అడుగు దూరంలో..

తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 78 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 48, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒకటి కొట్టాడు. ఇండియన్ ఆల్‌‌‌‌ టైమ్ గ్రేట్ సచిన్​  టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు కోహ్లీ. నిజానికి ఈ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లోనే ఈ ఫీట్‌‌‌‌ను కోహ్లీ సాధిం చాల్సింది. కానీ రెండు సార్లు ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 50 సెంచరీల రికార్డును ఈ ప్రపంచకప్‌‌‌‌లోనే కోహ్లీ సాధించే అవకాశం లేకపోలేదు. వన్డేల్లో 2017, 2018 సంవత్సరాల్లో ఆరు చొప్పున 12 శతకాలు బాదాడు. 2012, 2019లో ఐదు చొప్పున శతకాలు కొట్టాడు. ఇక టెస్టుల్లోనూ 2017, 2018లో ఐదేసి చొప్పున 10 శతకాలు కొట్టాడు. ఇటీవల టీ20ల్లో తొలి సెంచరీని అఫ్గానిస్తాన్‌‌‌‌పై నమోదు చేశాడు.

గడ్డు పరిస్థితులు

కోహ్లీ తక్కువ స్కోరుకు ఔట్ కావడం అతితక్కువ సందర్భాల్లోనే జరుగుతుంటుంది. అయితే ఎలాంటి ఆటగాడైనా ఏదో ఒక సందర్భంలో ఫామ్ కోల్పోవడం సాధారణమే. సచిన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కోహ్లీ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఒక దశలో ఫామ్‌‌‌‌తో కొంత తంటాలు పడ్డాడు. కరోనా కారణంగా మ్యాచ్‌‌‌‌లు లేకపోవడం, ప్రాక్టీస్ తగ్గడంతో కోహ్లీ ఆట లయ తప్పింది.

అదే సమయంలో కెప్టెన్సీకి సంబంధించిన వివాదం విరాట్‌‌‌‌ను మానసికంగా దెబ్బ తీసింది. తప్పనిసరి పరిస్థితుల్లో టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడు. సెలక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. దీంతో టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదిలేశాడు. ఈ దశలో విరాట్ ఫామ్ మరింత దెబ్బతింది. వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి. 2019లో నవంబర్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్ మీద చేసిన టెస్టు సెంచరీ తర్వాత సుమారు మూడేండ్ల పాటు కోహ్లీ సెంచరీ చేయలేదు.  

దీంతో ఫామ్‌‌‌‌లో లేని కోహ్లీని ఇంకా ఎందుకు టీమ్‌‌‌‌లో ఉంచుతున్నారంటూ చాలా విమర్శలు వచ్చాయి. ఇంకెవరైనా అయితే కెరియర్ ముగిసిపోయేదోమో.. అక్కడున్నది కోహ్లీ కదా. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పైకి ఎగిశాడు. తిరిగి ఫామ్‌‌‌‌ను అందుకుని, పరుగుల వరదను పారిస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో అఫ్గానిస్తాన్ మీద సెంచరీ చేయడం ద్వారా తన సత్తాను చాటాడు. తర్వాత ఈ ఏడాది బంగ్లాదేశ్ మీద ఒక సెంచరీ, శ్రీలంక మీద రెండు సెంచరీలు బాదాడు. ఈ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లోనూ అదరగొడుతున్నాడు.

ఛేజింగ్ అంటే చాలు.. చెలరేగిపోతాడు

ప్రపంచ క్రికెట్‌‌‌‌లో విరాట్‌‌‌‌ కోహ్లీ ఓ అరుదైన బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా నిలవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సాధారణంగా క్రికెటర్లు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో బాగా ఆడుతుంటారు. సెంచరీలు కొడుతుంటారు. ఎందుకంటే అప్పుడు ఒత్తిడి ఉండదు. టార్గెట్ ఏమీ ఉండదు. కాబట్టి.. స్వేచ్ఛగా ఆడేందుకు వీలుంటుంది. కానీ లక్ష్య ఛేదనలో పరిస్థితి వేరుగా ఉంటుంది. లక్ష్యం, రన్‌‌‌‌రేట్‌‌‌‌, పడుతున్న వికెట్లు.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. అందుకే రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఎక్కువ సెంచరీలు చేసిన వాళ్లు చాలా అరుదు. 

పరుగులు, సగటు కూడా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. కానీ విరాట్ కోహ్లీ గణాంకాలను ఓ సారి చూస్తే.. అతడు ఎందుకు అరుదైన బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా మారాడో అర్థమవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లోనే ఎక్కువ సెంచరీలు చేశాడు. ఈ విషయంలో లెజెండ్ సచిన్‌‌‌‌ టెండూల్కర్ కంటే కూడా విరాట్ ఎంతో ముందున్నాడు. వన్డేల్లో సచిన్ చేసిన పరుగులు 18,426. సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో 8,720 పరుగులు చేయగా.. ఇందులో 17 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. 

మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం 32 శతకాలు నమోదు చేశాడు. ఇక కోహ్లీ వన్డేల్లో13,437 పరుగులు చేశాడు. అందులో 48 సెంచరీలు ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో 7,794 పరుగులు కొట్టగా.. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. సగటు ఏకంగా 65.50. బహుశా ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్‌‌‌‌కూ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇలాంటి గణాంకాలు ఉండవు. 2012లో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌‌‌‌లో ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై 40 ఓవర్లలోనే 320 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే.. 86 బంతుల్లోనే 133 పరుగులు చేసి 36.4 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌పై ఛేదనలో కోహ్లీ ఆడిన సంచలన ఇన్నింగ్స్‌‌‌‌ ఎవర్‌‌‌‌‌‌‌‌గ్రీన్. 

ఇటీవల ప్రపంచకప్‌‌‌‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో విరాట్ ఆడిన తీరు ఓ మచ్చు తునక మాత్రమే. రెండు పరుగులకే 3 వికెట్లు పడిన సమయంలో.. ఆసీస్‌‌‌‌ పేస్‌‌‌‌ను సమర్థంగా అడ్డుకుని టీమ్‌‌‌‌ను విజయ తీరాలకు చేర్చాక 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. బంగ్లాదేశ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో ఛేజింగ్‌‌‌‌లోనే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ‘‘కోహ్లీ మెదడులో ఓ కంప్యూటర్ ఉంటుంది.. అది ఛేజింగ్‌‌‌‌ను ప్లాన్ చేస్తుంది. పక్కాగా పని పూర్తి చేస్తుంది” అంటూ ఓ విశ్లేషకుడు చెప్పిన మాటలు అప్పుడప్పుడు నిజమే అనిపిస్తాయి.

దూకుడే అతడి ఆయుధం

విరాట్‌‌‌‌ కోహ్లీ అంటే దూకుడుకు మారుపేరు. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. తొలి నుంచీ అంతే. 2008లో జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నుంచి ఇప్పటిదాకా అదే తీరు. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా కొంచెం మీసాలు, గడ్డం పెంచాడంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రత్యర్థులకు అటు ఆటతోనూ.. ఇటు మాటతోనూ బదులిస్తాడు. తనను ఎంతగా రెచ్చగొట్టాలని చూస్తే అంతలా చెలరేగిపోతాడు. బౌలర్ రెండు మాటలతో కవ్విస్తే.. నాలుగు పరుగులతో బదులిస్తాడు.

తన టీమ్మేట్‌‌‌‌తో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే.. తాను ముందు నిలబడతాడు. కొన్ని సార్లు అవి వివాదాస్పదమైనా, ఎన్ని విమర్శలు ఎదురైనా.. ‘డోంట్ కేర్’ అంటాడు కోహ్లీ. ‘‘ఆసీస్ ఆటగాళ్లు నన్ను చెడిపోయిన పిల్లాడు అన్నారు. నేను నిజంగా అలాంటివాడినేమో. వాళ్లు నన్ను  ద్వేషించడమే నాకిష్టం. నన్ను ఎన్ని మాటలు అన్నా అది నాకే ప్లస్​ అయింది. నా అత్యుత్తమ ఆట బయటపడింది. అయినా వాళ్లు మారరు” అంటూ దశాబ్దం కిందటే ఆస్ట్రేలియా ఆటగాళ్లపై మాటల తూటాలు పేల్చాడు విరాట్. ఇదే సమయంలో మైదానంలో తోటి ఆటగాళ్లతో చలాకీగా ఉంటాడు కోహ్లీ. ఇమిటేట్ చేస్తూ ఆటపట్టిస్తుంటాడు. డాన్స్‌‌‌‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు. ప్లేయింగ్ టీమ్‌‌‌‌లో లేనప్పుడు ఆటగాళ్లకు డ్రింక్స్‌‌‌‌ తీసుకుని మైదానంలోకి వస్తాడు కూడా.

‘ఒలింపిక్స్’లో కోహ్లీ చర్చ

2028 ఒలింపిక్స్‌‌‌‌లో క్రికెట్‌‌‌‌ను చేర్చాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌‌‌‌ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. క్రికెట్‌‌‌‌ను చేర్చే సమయంలో కోహ్లి ప్రస్తావన రావడం విశేషం. ‘‘నా స్నేహితుడు విరాట్‌‌‌‌ కోహ్లీకి సోషల్ మీడియాలో 34 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువమంది అనుసరించే ప్రపంచ అథ్లెట్లలో మూడో వ్యక్తి అతడు. లెబ్రాన్‌‌‌‌ జేమ్స్‌‌‌‌, టామ్‌‌‌‌ బ్రాడీ, టైగర్‌‌‌‌ వుడ్స్‌‌‌‌లను ఫాలో అయ్యేవారి సంఖ్యను ఒక్కచోట కలిపినా కోహ్లి కంటే తక్కువే. ఇది ఎల్‌‌‌‌ఏ28, ఐఓసీ, క్రికెట్‌‌‌‌ సమాజం గెలిచిన సందర్భం” అంటూ లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌ 2028 నిర్వాహక కమిటీ క్రీడా డైరెక్టర్‌‌‌‌ నికోలో కాంప్రియాని ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వేదికపై క్రికెట్‌‌‌‌కు మరింత చోటు దక్కనుందని, సంప్రదాయ క్రికెట్‌‌‌‌ దేశాలను దాటి విస్తరిస్తుందని చెప్పారు.

ఫిట్‌‌‌‌నెస్ మంత్ర

35 ఏండ్ల వయసు వచ్చినా.. 20 ఏళ్ల  కుర్రాడిలా కనిపిస్తాడు కోహ్లీ. పదిహేనేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌లో ఉన్న అతడు.. ఇప్పటికీ కొత్త తరం ఆటగాళ్లతో పోటీపడుతుంటాడు. క్రీజ్‌‌‌‌లో చిరుతలా కదులుతుంటాడు. ఫోర్లు, సిక్సులే కాదు.. సింగిల్స్‌‌‌‌తోనూ స్ట్రయిక్ రొటేట్ చేస్తుంటాడు. రనౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కోహ్లీ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఇందుకు కారణం. ఎక్సర్​సైజ్​తోపాటు ఫుడ్​ విషయంలో కూడా కఠినంగా ఉంటాడు. 

 

 •    ఎంత బిజీ షెడ్యూల్‌‌‌‌లో ఉన్నా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను మాత్రం నిర్లక్ష్యం చేయడు. ఫిట్‌‌‌‌గా ఉండాలని తనకెంతో ఇష్టమైన చికెన్‌‌‌‌ను పూర్తిగా దూరం పెట్టాడు. 
 •     మసాలా వంటకాలకు పూర్తిగా దూరం. కూరగాయలు, పప్పు, గుడ్లను ఆహారంలో భాగం చేసుకున్నాడు. 
 •     ఉదయం పూట బ్రెడ్‌‌‌‌ ఆమ్లెట్‌‌‌‌తో ఉడకబెట్టిన గుడ్లు తింటాడు. పాలకూర, ఎండుమిర్చి, పనీర్‌‌‌‌ సలాడ్‌‌‌‌ బ్రేక్​ఫాస్ట్​. 
 •     మధ్యాహ్నం నట్స్, బ్రౌన్‌‌‌‌ బ్రెడ్  తింటాడు. ప్రొటీన్‌‌‌‌ షేక్‌‌‌‌ తాగుతాడు. 
 •     డిన్నర్‌‌‌‌ను రోటీ, పప్పు, పచ్చి ఆకుకూరలతో కానిస్తాడు. 
 •     శరీరాన్ని డీహైడ్రేట్​ కాకుండా చూసుకోవడం కోసం బ్లాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ తాగుతాడు. ఖరీదైన ఈ నీళ్ల ధర లీటర్‌‌‌‌కు నాలుగు వేల రూపాయల వరకూ ఉంటుంది. 
 •     వ్యాయామం చేశాక ప్రొటీన్‌‌‌‌ షేక్స్, సోయా మిల్క్, బటర్‌‌‌‌ పనీర్‌‌‌‌ తీసుకుంటాడు. 
 •     గంటల కొద్దీ వ్యాయామం చేస్తుంటాడు. వెయిట్‌‌‌‌లిఫ్టింగ్, కార్డియో వాస్క్యులర్‌‌‌‌ ఎక్సర్​సైజ్​లు కలిపి చేస్తాడు.
 • ప్రస్తుతం ప్రపంచకప్‌‌‌‌ కోసం విరాట్‌‌‌‌ ప్రత్యేకమైన డైట్‌‌‌‌ ఫాలో అవుతున్నాడట!

ఆ జెర్సీ ప్రత్యేకం

ప్రతి ప్లేయర్‌‌‌‌ జెర్సీ వెనుక ఓ నెంబర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. కొందరి విషయంలో ఆ నెంబర్‌‌‌‌‌‌‌‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. కోహ్లీకి కూడా అంతే. ఇదే విషయాన్ని అతడు ఓ సందర్భంలో చెప్పాడు. ‘‘అండర్‌‌‌‌ 19 క్రికెట్‌‌‌‌ ఆడేటప్పుడు నా పేరుపై 18వ నెంబర్‌‌‌‌‌‌‌‌తో జెర్సీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ నెంబర్‌‌‌‌ నా జీవితంలో ప్రత్యేకంగా మారింది. నేను క్రికెట్‌‌‌‌లో అరంగేట్రం చేసింది ఆగస్టు 18. నా తండ్రి చనిపోయింది డిసెంబర్‌‌‌‌ 18. నా జీవితంలో రెండు ముఖ్యమైన క్షణాలు ఈ రోజునే జరిగాయి’’ అని చెప్పాడు. నిజానికి విరాట్ తండ్రి ప్రేమ్‌‌‌‌ కోహ్లీ కూడా క్రికెట్‌‌‌‌ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నాడు. 

పద్మశ్రీని అందుకున్నాడు

తన సుదీర్ఘ కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో అవార్డులు కోహ్లీని వరించాయి. 2013లో అర్జున అవార్డు అందుకున్నాడు. దేశంలో మూడో అత్యుత్తమ అవార్డు పద్మశ్రీని 2017లో, క్రీడల్లో అత్యున్నతమైన మేజర్ ధ్యాన్‌‌‌‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు 2018లో ఎంపికయ్యాడు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్ (2011–2020) అవార్డు,  2012, 2017, 2018లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు, 2018లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2017లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు... ఇంకో ఎన్నింటినో అందుకున్నాడు. 

వివాదాలూ ఎక్కువే

కోహ్లీ బ్యాటుకే కాదు.. మాటకూ పదునెక్కువ. ప్రత్య ర్థులతో, తనను కవ్వించిన బౌలర్లతో దూకుడుగానే ఉంటాడు. ఎవరితోనైనా ఢీ అంటే ఢీ అంటాడు. ఈ తీరుతో చాలా కాంట్రవర్సీలకు కేంద్ర బిందువయ్యాడు. ఇండియన్ లెజెండ్స్​ సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌తో కూడా కోహ్లీకి విభేదాలు ఉన్నాయి. 

కెప్టెన్సీ కాంట్రవర్సీ

వన్డే కెప్టెన్‌‌‌‌గా తొలగించే విషయంలో బీసీసీఐ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని కోహ్లీ చెప్పాడు. ‘‘నేను టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి మొదట చెప్పా. అది చెప్పినప్పుడు  ఎవరూ అడ్డుచెప్పలేదు. కెప్టెన్‌‌‌‌గా దిగిపోవద్దని నన్ను ఎవరూ అడగలేదు” అన్నాడు. దీంతో 2021 టీ20 వరల్డ్‌‌‌‌కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలిగాడు. అయితే ఈ విషయంలో బీసీసీఐ వాదన మరోలా ఉంది. ‘‘కోహ్లీతో మేము మాట్లాడాం. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని సజెస్ట్​ చేశా’’మని అప్పటి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చెప్పాడు.

వేలు చూపించి...

2012 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టు రెండో రోజు సందర్భంగా ప్రేక్షకులు కోహ్లీని బాగా విసిగించారు. దాంతో అతడు వారి వైపు ‘మధ్య వేలు’ చూపించాడు. ఇది కాస్తా వివాదాస్పదమైంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 2 కింద మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. 

అనిల్ కుంబ్లేతో విభేదాలు

టీమిండియా కోచ్‌‌‌‌గా అనిల్ కుంబ్లే 2016 జూన్‌‌‌‌లో బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటి కోహ్లీతో విభేదాల కారణంగా కాంట్రాక్టు కన్నా ముందే అర్ధంతరంగా కోచ్‌‌‌‌ పదవి నుంచి వైదొలిగాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తప్పుకున్నాడు. కుంబ్లే ‘హెడ్‌‌‌‌ మాస్టర్’ తరహాలో వ్యవహరిస్తున్నాడని, ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కెప్టెన్‌‌‌‌గా కోహ్లీ మాట నెగ్గుతుండటంతో కుంబ్లే దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత తమకు అనుకూలంగా ఉండే రవి శాస్త్రి తిరిగి కోచ్ అయ్యాడు.

గంభీర్‌‌‌‌‌‌‌‌తో ఢీ అంటే ఢీ

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. 2013 ఐపీఎల్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్, కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా జరిగిన గొడవ.. తీవ్ర సంచలనమైంది. లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా.. లక్నో ప్లేయర్ నవీనుల్ హాక్, కోహ్లీ మధ్య వాగ్వాదం సాగింది. దీంతో మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్ వాదించుకోవడం కనిపించింది. తర్వాత కోహ్లీతో లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్ మాట్లాడుతుండగా.. మేయర్స్‌‌‌‌ను గంభీర్ పక్కకి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

గంగూలీతో నో షేక్‌‌‌‌హ్యాండ్

బీసీసీఐ బాస్‌‌‌‌గా గంగూలీ, టీమిండియా కెప్టెన్‌‌‌‌గా కోహ్లీ ఉన్నప్పుడు మొదలైన వివాదం.. మొన్నటి ఐపీఎల్‌‌‌‌ 2023లోనూ కొనసాగింది. ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత.. గంగూలీకి కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అంత కుముందు ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టుకున్న కోహ్లీ.. డీసీ డగౌట్‌‌‌‌లో కూర్చున్న గంగూలీ వైపు సీరియస్‌‌‌‌గా చూడటం వైరల్ అయింది. 

ఎల్లలు దాటిన అభిమానం

కోహ్లీకి అభిమానులు కోకొల్లలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అతడిని ఆరాధిస్తారు. కోహ్లీ కనిపిస్తే చాలు.. అతడితో ఒక్క ఫొటో దిగితే చాలు అని ఆశపడే వాళ్లు ఎందరో. గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే.. స్టేడియం హోరెత్తిపోవాల్సిందే. కోహ్లీని అభిమానించే వారి లిస్టులో కొందరు క్రికెటర్లు, వాళ్ల పేరెంట్స్‌ కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. గత జులైలో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడింది.

రెండో టెస్టు రెండో రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ కీపర్ జాషువా డిసిల్వా తల్లి కరోలిన్.. విరాట్ కోహ్లీని కలిశారు. కోహ్లీని గుండెకు హత్తుకుని, భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లీ బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. తర్వాత అతడితో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతకుముందు రెండో టెస్టు తొలి రోజున.. గ్రౌండ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేసేటపుడు అతడితో జాషువా మాట్లాడాడు.

నా ఆట చూడటానికి కాదు.. నీ (కోహ్లీ) ఆట చూడటానికి వస్తున్నానని మా అమ్మ చెప్పింది..” అని అనడం స్టంప్స్​కు ఉన్న మైకుల్లో రికార్డయింది. తర్వాత తన తల్లి కోహ్లీని కలవడం గురించి స్పందిస్తూ.. ‘‘కోహ్లీ బస్సులో ఉన్నప్పుడు.. కిటికీని తట్టా. అతడు బయటికి వచ్చి మా అమ్మను కలిశాడు. ఆమెకు ఇది మరిచిపోలేని రోజు. ఈ రోజు మాత్రమే కాదు.. ఈ సంవత్సరమే మరపురానిది” అన్నాడు జాషువా.

ఆ ఫొటో వెనుక కథ ఇదీ

ఆశిశ్ నెహ్రా, కోహ్లీది ఢిల్లీనే. నెహ్రా చాలా సీనియర్ అయినప్పటికీ.. అతడు, కోహ్లీ కలిసి ఒకేసారి టీమిండియాకు ఆడారు. అయితే గతంలో ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కోహ్లీకి నెహ్రా ఓ ప్రైజ్ ఇస్తూ కనిపించాడు. కోహ్లీ అప్పటికి టీనేజ్‌లో ఉన్నాడు. ఈ ఫొటో వెనుక ఉన్న కథను ఓ ఇంటర్వ్యూలో నెహ్రా చెప్పాడు. ‘‘2003 వరల్డ్​కప్ తర్వాత తీసిన ఫొటో అది. తన అకాడమీకి రావాలని కోహ్లీ కోచ్ రాజ్​కుమార్ శర్మ ఓ సారి నన్ను ఆహ్వానించాడు. ఆ టైమ్‌లోనే ఆ ఫొటో తీశారు” అని వివరించాడు. ఆ సమయంలో నెహ్రా వయసు 24 ఏండ్లు కాగా, కోహ్లీ వయసు సుమారు 15 ఏండ్లు. చాంపియన్స్ ట్రోఫీ 2009, వన్డే వరల్డ్​కప్ 2011, టీ20 వరల్డ్​కప్ 2016 తదితర చాలా మ్యాచ్‌లలో ఇద్దరూ కలిసి ఆడారు. కోహ్లీ కెప్టెన్సీలో నెహ్రా ఆడటం విశేషం.

కంపెనీలు, పెట్టుబడులు, ప్రమోషన్లు

డబ్బే డబ్బును పుట్టిస్తుందని అంటారు. అయితే ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగించడంలోనే అసలు కథ ఉంది. కోహ్లీ కూడా అదే పని చేస్తున్నాడు. రన్స్​తో రిటర్న్స్‌ సాధిస్తున్నాడు. క్రికెట్‌తో వస్తున్న సంపాదనతోపాటు అడ్వర్టైజ్​మెంట్ల ద్వారా కోట్లలో ఆర్జిస్తున్నాడు. మరోవైపు కొత్త కంపెనీలను ప్రారంభిస్తున్నాడు. హెల్త్, ఇన్స్యూరెన్స్, ట్రావెల్, ఫ్యాషన్ రంగాల్లోని కొన్ని కంపెనీలు, స్టార్టప్స్​లో పెట్టుబడులు పెడుతున్నాడు. వాటిని తానే ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఇటీవల భార్య అనుష్క శర్మతో కలిసి ‘నిసర్గ’ అనే కంపెనీని ప్రారంభించాడు. ‘

వ్రాగన్’ అనే అప్పెరల్ కంపెనీకి అతడే ఓనర్. ‘బ్లూ ట్రైబ్’, ‘హైపరీస్’ అనే స్టార్టప్స్​లో ఇన్వెస్ట్ చేశాడు. ఫిన్‌టెక్ స్టార్టప్ ‘డిజిట్‌’లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ‘రేజ్ కాఫీ’ అనే బ్రాండ్‌లో 2022లో పెట్టుబడి పెట్టాడు. లండన్‌కు చెందిన సోషల్ మీడియా స్టార్టప్ ‘స్పోర్ట్ కాన్వో’తో కొన్నేండ్ల కిందటే భాగస్వామి అయ్యాడు. ‘యూనివర్సల్ స్పోర్ట్స్​బిజ్’ అనే సంస్థలో కార్నర్ స్టోన్ స్పోర్ట్స్​తో కలిసి 4 వేలకు పైగా షేర్లను కొన్నాడు.

ప్యూమాతో కలిసి ‘ప్యూమా వన్8’ అనే స్టార్టప్‌ను లాంచ్ చేశాడు. వన్8 కమ్యూన్, నుయివా వంటి సంస్థలకు అతడు ఓనర్‌‌గా ఉన్నాడు. ఇక ఎఫ్‌సీ గోవా (ఫుట్‌బాల్), యూఏఈ రాయల్స్(టెన్నిస్), బెంగళూరు యోధాస్ (రెజ్లింగ్) వంటి సంస్థలకు కో–ఓనర్​గా కొనసాగుతున్నాడు.

అతడో స్ఫూర్తి

కోహ్లీ సక్సెస్‌ఫుల్ క్రికెటర్.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అతడూ ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. పరుగుల యంత్రమని పేరు పొందినా.. రన్స్ చేయలేక ఇబ్బందులు పడ్డాడు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఓ సందర్భంలో అతడే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘2014 ఇంగ్లాండ్ టూర్‌ని నా జీవితంలో మరిచిపోలేను. పరుగులు చేయలేకపోతున్నాననే బాధ నన్ను ఎంతగానే వేధించింది.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఒక్కసారిగా ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరని అనిపించింది. ‘

మాట్లాడేందుకు మనుషులు లేరు.. నా మనసులో ఉన్నది చెప్పుకునేందుకు, నన్ను అర్థం చేసుకునేందుకు ఎవ్వరూ లేరు’ అనిపించింది. అంటే నా చుట్టూ ఎవ్వరూ లేరని కాదు. డిప్రెషన్‌ నన్ను అలాంటి మానసిక స్థితిలోకి నెట్టేసింది. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. అలాంటి స్టేజ్ నుంచి బయటపడడానికి ఫిట్‌నెస్‌పైనే ఫోకస్ పెట్టా. సాధ్యమైనంత ఎక్కువసేపు జిమ్‌లో గడపడం అలవాటు చేసుకున్నా. నాపైన నాకు పోయిన నమ్మకాన్ని తిరిగి ఎక్సర్​సైజ్​ ద్వారా సాధించా” అని చెప్పాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దని చెప్పడానికి అతడి జర్నీ ఓ పాఠం. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన తండ్రి చనిపోతే.. దుఃఖాన్ని దిగమింగుకుని.. మ్యాచ్ ఆడాడు. అతడి మనోబలానికి నిదర్శనమిది.

 గ్రౌండ్‌లో కోహ్లీ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. కానీ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ప్రత్యర్థులు ఎంత కవ్వించినా, నోరు పారేసుకున్నా.. డిస్టర్బ్​ కాడు. ఆట గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఏం జరిగినా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. టార్గెట్‌ మీద మాత్రమే దృష్టి. తన దేహాన్ని మలుచుకున్న తీరు కూడా అద్భుతం. కెరియర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేవాడు. కానీ తన ఆటకు అదే అడ్డంకి అనుకుని.. నోరు కట్టుకున్నాడు. 

డైట్, ఎక్సర్​సైజ్​లతో కండలు తిరిగిన దేహంతో అసలు సిసలైన అథ్లెట్‌లా మారాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని.. కష్టమైనా తప్పదని అతడి జర్నీ చెప్తుంది.నువ్వు ఇవ్వగలిగితే.. తీసుకోవాలి కూడా. అలా కానప్పుడు ఇవ్వొద్దు’’ అంటాడు కోహ్లీ. అంటే ఓడి పోవద్దు! ఓడినా ఆగిపోవద్దు!! అతడూ వైఫల్యాలను ఎదుర్కొన్నాడు.. నిలిచాడు.. గెలిచాడు.. గెలుస్తూనే ఉన్నాడు.

2017లో ఒక్కటైన విరుష్క

బాలీవుడ్‌‌‌‌ నటి అనుష్క శర్మను విరాట్​ కోహ్లీ లవ్​మ్యారేజ్​ చేసుకున్నాడు. 2017 డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీ నగరంలో ఉన్న ఒక రిసార్టులో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. డిసెంబర్ 21న ఢిల్లీలో నిర్వహించిన రిసెప్షన్‌‌‌‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. ఈ జంటను ఆశీర్వదించారు.

అభిమానులు ఈ జోడీని ‘విరుష్క’ అని పిలుచుకుంటారు. వీరికి 2021 జనవరి 11న అమ్మాయి పుట్టింది. ‘వామిక’ అని పేరు పెట్టారు. పాప ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ.. ఆమె ముఖం కనిపించకుండా ఈ జంట జాగ్రత్త పడుతుంటుంది. వీళ్లు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ విరుష్క దంపతులు మాత్రం ఈ ఊహాగానాలపై స్పందించలేదు. 

 అనుష్క శర్మ ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని అయోధ్యలో 1988 మే 1న పుట్టింది. షారుక్ ఖాన్ హీరోగా 2008లో విడుదలైన ‘రబ్ నే బనా ది జోడీ’ చిత్రంలో బాలీవుడ్‌‌‌‌లోకి అనుష్క ఎంట్రీ ఇచ్చింది. 25 దాకా సినిమాల్లో నటించారు. 2015లో విడుదలైన ‘ఎన్‌‌‌‌హెచ్ 10’ చిత్రం ద్వారా నిర్మాతగానూ మారింది. పెండ్లి తర్వాత సినిమాలను తగ్గించేసింది అనుష్క. విరాట్, అనుష్క తమ కెరియర్ ద్వారా ఒకే ఏడాదిలో వెలుగులోకి రావడం గమనార్హం. వీళ్లిద్దరూ జాయింట్ వెంచర్లు కూడా మొదలుపెట్టారు. ‘నిసర్గ’ అనే పేరుతో ఇటీవల కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు.

ఐపీఎల్‌‌‌‌లోనూ రికార్డులు

ఐపీఎల్‌‌‌‌లో మొత్తం 237 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు కోహ్లీ. 2008లో తన కెరియర్ ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరి.. ఇప్పటికీ అదే జట్టులో ఉన్నాడు. 229 ఇన్నింగ్స్‌‌‌‌లో 7,263 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉండగా.. ఏకంగా 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌‌‌‌లో లీడింగ్ రన్ స్కోరర్ కోహ్లీనే. 6,617 పరుగులతో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. సెంచరీల విషయంలోనూ కోహ్లీనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. హాఫ్ సెంచరీల విషయంలో మాత్రం డేవిడ్ వార్నర్ (61) తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో 50 చొప్పున హాఫ్ సెంచరీలతో కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు. ఒక సీజన్‌‌‌‌లో అత్యధిక పరుగులు (2016లో 973) కొట్టింది కూడా విరాట్ కోహ్లీనే. 

కోహ్లీ రికార్డులివి...

 •   ఒకే టీమ్‌‌‌‌పై ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. శ్రీలంకపై 10 సెంచరీలు నమోదు చేశాడు. రెండో స్థానంలోనూ కోహ్లీనే ఉన్నాడు. వెస్టిండీస్‌‌‌‌పై 9 శతకాలు కొట్టాడు. సచిన్ కూడా ఆస్ట్రేలియాపై 9 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
 •   వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ కోహ్లీనే. ఈ ఫీట్‌‌‌‌ను 267 ఇన్నింగ్స్‌‌‌‌కే సాధించాడు. సచిన్‌‌‌‌ ఈ ఫీట్ సాధించేందుకు 321 ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు.
 •   టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌‌‌‌’లు అందుకున్న రికార్డు కోహ్లీపైనే ఉంది.  ఏడు సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. 
 •  టీ20ల్లో 15 సార్లు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ లిస్టులో ఆఫ్గాన్ ప్లేయర్ నబి (14) రెండో స్థానంలో ఉన్నాడు.
 • టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధికంగా 20 ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌‌‌‌’లను అందుకున్నాడు. సచిన్ కూడా 20 సార్లు ఈ అవార్డు అందుకోవడం విశేషం. 
 • టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లీనే. ఇప్పటిదాకా 4008 పరుగులు చేశాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ 3853 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 
 • టీ20ల్లో 38 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 33 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. 
 •   కెప్టెన్‌‌‌‌గా కోహ్లీ 6 డబుల్ సెంచరీలు సాధించాడు. తర్వాతి స్థానం (కెప్టెన్‌‌‌‌గా 5 డబుల్ సెంచరీలు)లో వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా ఉన్నాడు. 
 • ఒక క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో 11 సెంచరీలు కొట్టాడు. అయితే ఒక క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో 12 సెంచరీలతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
 • క్రికెట్‌‌‌‌లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ వన్డేలు, టెస్టుల్లో కలిపి వంద శతకాలు కొట్టాడు. 78 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో, 71 సెంచరీలతో పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నారు. 
 •  వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో, 48 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు. 40కి పైగా సెంచరీలు కొట్టింది వీళ్లిద్దరే. 31 సెంచరీలతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
 • వన్డేల్లో 27 సెంచరీలను సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లోనే కోహ్లీ నమోదు చేశాడు. ఇదో రికార్డు. అతడి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో కొట్టిన సెంచరీలు 17 మాత్రమే. 
 • వన్డేల్లో సెఈకండ్ ఇన్నింగ్స్‌‌‌‌లో కోహ్లీ చేసిన స్కోరు 7,794. ఇతడికంటే ముందు 8,720 పరుగులతో సచిన్ ఉన్నాడు. రానున్న రోజుల్లో ఈ రికార్డును కూడా కోహ్లీ చేరుకునే అవకాశం ఉంది.

వెయ్యి కోట్లపైనే ఆస్తులు

విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ రూ.1000 కోట్లు పైనే. స్టాక్ గ్రో అనే కంపెనీ వివరాల ప్రకారం..  విరాట్‌‌‌‌ కోహ్లీ స్థిర, చరాస్తుల విలువ రూ.1050 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద వ్యాపార సంస్థలు విరాట్‌‌‌‌ కోహ్లీతో అడ్వర్టైజ్​మెంట్స్​ ద్వారా తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌‌‌‌ చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం 18 కంపెనీల నుంచి కోహ్లీకి అడ్వర్టైజ్​మెంట్స్​ రూపంలో ఆదాయం వస్తోంది. స్టార్టప్‌‌‌‌ కంపెనీల్లో కూడా కోహ్లీ పెట్టుబడి పెడుతున్నాడు.

ప్రస్తుతం 8 స్టార్టప్స్‌‌‌‌లో కోహ్లీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఉన్నాయి. సోషల్ మీడియాలో కోహ్లీ చేసే పోస్టులకు భారీ మొత్తమే అందుకుంటున్నాడు. ట్విట్టర్‌‌‌‌ (ఎక్స్)లో చేసే ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో చేసే ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్ల చొప్పున తీసుకుంటాడని అంచనా. బీసీసీఐ నుంచి ప్రతి ఏటా వార్షిక వేతనంగా రూ.7 కోట్లు కోహ్లీకి అందుతుంది. ప్రతి ఐపీఎల్ సీజన్‌‌‌‌లో రాయల్‌‌‌‌ ఛాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు ఫ్రాంచైజీ రూ.15 కోట్ల శాలరీ ఇస్తుంది.

తొలి నుంచి ఆర్సీబీతోనే

తొలి టీ20 ప్రపంచకప్‌‌‌‌లో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. మన దేశంలో ఐపీఎల్ పురుడు పోసుకుంది. 2008లో తొలి సీజన్ విజయవంతంగా సాగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌‌‌‌తోనే విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇది చాలా అరుదైన విషయం. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆడుతున్న అతితక్కువ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. ఇప్పటిదాకా ఒకే జట్టుతో కొనసాగుతున్న ఒకే ఒక్కడు కోహ్లీ.

మేనేజ్‌‌‌‌మెంట్ అతడిని ఎంత నమ్మిందో.. మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను అతడూ అంతే నమ్మాడు. అందుకే ఇది సాధ్యమైంది. గతంలో కొన్ని ఫ్రాంచైజీలు కోహ్లీని సంప్రదించాయి. కానీ అతడు మాత్రం బెంగళూరు టీమ్‌‌‌‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో విరాట్ గుర్తు చేసుకున్నాడు. ‘‘గతంలో కొన్ని ఫ్రాంఛైజీలు నన్ను వేలంలోకి రావాలని కోరాయి. నేనూ ఆలోచించా. రాయల్‌‌‌‌ ఛాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుతోనే ఉండాలని నిర్ణయించుకున్నా” అని చెప్పాడు.

రాము కొట్టాల