కింగ్ ఫిషర్ (KF)10 లక్షల బీర్ బాటిళ్లు సీజ్..ఎందుకో తెలిస్తే షాక్

కింగ్ ఫిషర్ (KF)10 లక్షల బీర్ బాటిళ్లు సీజ్..ఎందుకో తెలిస్తే షాక్

మందుప్రియులకు బ్యాడ్ న్యూస్. మందు ప్రియులు ఇష్టంగా తాగే కింగ్‌ఫిషర్ బీర్‌లో ప్రమాదకరమైన పదార్థం వెలుగు చూసింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు రూ. 25 కోట్ల విలువైన 78,678 బీరు బాక్సులను సీజ్ చేశారు. ఈ బీర్లను తయారు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

మైసూరు జిల్లా నంజన్‌గూడ్‌లో యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తి చేసిన కింగ్ ఫిషర్ బీరులో నిషేధిత పదార్థాల అవక్షేపం ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది.  కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్, శాంపిల్ 7e బీర్‌లో, 7cలో నిషేధిత పదార్థాలు ఉన్నాయని కనుగొనబడింది. దీంతో వెంటనే కంపెనీలోని బీర్లను సీజ్ చేసిన అధికారులు..బీరు శాంపిల్‌ను కెమికల్‌ ల్యాబ్‌కు పంపించారు.

యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తి చేసిన కింగ్ ఫిషర్ బీరుకు  సంబంధించి ఆగస్టు 2 కెమికల్ రిపోర్టు అందిందని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎ. రవి శంకర్ తెలిపారు.  దీని ప్రకారం ఈ బీరు ఆరోగ్యానికి హానికరమని ఓ  నివేదిక పేర్కొందని చెప్పారు. అయితే బీరులో హానికర కెమికల్ పదార్థం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందడంతో..కంపెనీకి చేరుకున్నారు. అప్పటికే 78,678 బాక్సులు వైన్స్ డిపోలకు వెళ్లిపోయాయి. బాక్సులు వైన్స్ లకు  సరఫరా కూడా అయ్యాయి. ఈ విషయాన్ని అన్ని డిపోల నిర్వాహకులకు తెలియజేసి..వాటిని సీజ్ చేశారు. 

ఖండించిన కింగ్ ఫిషర్..

కింగ్ ఫిషర్ బీర్లలో హానికర కెమికల్స్ ఉన్నట్లు వార్తలు రావడాన్ని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్  యాజమాన్యం ఖండించింది. జులై 15న నంజన్‌గూడలో కొన్ని బీరు బాటిళ్లలో కొద్దిపాటి పొగమంచు కనిపించిందని..అయితే ఇది ఆరోగ్యానికి హానికరం కాదని పేర్కొంది. అయినా కూడా తమ వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించింది.  అధికారులకు సహకరిస్తామని..తమ బీర్లను అధికారులు పరిశీలించొచ్చని తెలిపింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఉత్పత్తులన్నీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నాయని, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తామన్నారు.