- ట్రెక్కింగ్, సఫారీ, బోటింగ్తో కొత్త అనుభవం
- 10 కిలోమీటర్ల ఫారెస్టు సఫారీకి ప్రత్యేక వాహనాలు
- 160 రకాల దుప్పులతో ఆకట్టుకునే డీర్ పార్క్
- త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టులో తొలిసారిగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్టు టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ట్రెక్కింగ్, ఫారెస్టు సఫారీ, బోట్ షికారు, డీర్ పార్క్ సందర్శన వంటి అనుభూతులను ఒకే ప్యాకేజీలో అందించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్లు పూర్తి చేసి, కొత్త బోట్లు, సఫారీ వాహనాలు, పర్యాటకుల బస కోసం కాటేజీలు సిద్ధం చేస్తున్నారు. మరో వారం నుంచి పది రోజుల్లో ఈ ప్రకృతి విహారాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తెలంగాణలో తొలిసారిగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టులో ట్రెక్కింగ్, ఫారెస్టు సఫారీ, బోట్ షికారుతో పాటు డీర్ పార్క్, కాటేజీలతో కూడిన ఫారెస్టు టూరిజాన్ని అటవీశాఖ అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పాల్వంచ మండలం లోని కిన్నెరసాని ప్రాజెక్టులో ఒకే ట్రిప్లో ట్రెక్కింగ్, ఫారెస్టు సఫారీ, బోట్ షికారు, డీర్ పార్క్ సంద ర్శన వంటి అనుభూతులను అందించేలా ప్రత్యేక టూరిజం ప్యాకేజీ రూపొందిస్తున్నారు.
కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే నేషనల్ హైవేకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో డ్యాం నుంచి గోదావరి లోకి ప్రవహించే నీటి ప్రవాహం ప్రకృతి అందాలను మరింత పెంచుతుంది. ఈ ప్రాజెక్టు కిన్నెరసాని అభయారణ్యంలోనే ఉండటం విశేషం.
10 కిలోమీటర్ల ఫారెస్టు సఫారీ..
అభయారణ్యంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఫారెస్టుసఫారీని నిర్వహించేందుకు ఇప్పటికే మూడు ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చారు. డీఎస్ఓ కిష్ట్లా గౌడ్, పాల్వంచ వైల్డ్ లైఫ్ డివిజన్ డిప్యూటీ కన్జర్వే టర్ ఆఫ్ ఫారెస్టు ఎం.బాబు ఆధ్వర్యంలో ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. సఫారీని రెండు మార్గా లుగా విభజించారు. కిన్నెరసాని నుంచి వాచ్ టవర్, "కుహూ... కుహూ" వాచ్ టవర్ వరకు ఒక మార్గం ఉండగా, యానంబైలు రూట్లో హరిణి వాచ్ టవర్ వద్ద గుట్టపైకి ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
బోట్ షికారు, కాటేజీలు..
సఫారీలో భాగంగా కిన్నెరసాని ప్రాజెక్టులో బోట్ షికారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టూరిజం బోట్లకు తోడు రూ.30 లక్షలతో రెండు కొత్త బోట్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. సఫారీలో అడవి అందాలు, డ్యాం దృశ్యాలు, ఆనంద ద్వీపం పర్యాటకులను ఆకట్టు కుంటాయి. పర్యాటకులు బస చేసేందుకు టూరిజం శాఖకు చెందిన కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ఫొటో షూట్ల కోసం ఏర్పాటు చేసిన అద్దాల మేడ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా డీర్ పార్క్..
ప్రాజెక్టు ప్రవేశ ద్వారంలోనే ఉన్నడీర్ పార్క్ సందర్శ కులను ఆకర్షిస్తుంది. ఇక్కడ సుమారు 160 చుక్కల దుప్పులు, నాలుగు కొండ గొర్రెలు, మూడు మూషిక దుప్పులు ఉన్నాయి. సమీపంలోని చిన్నకొలనులో బాతులు, హంసలు సందడి చేస్తుంటాయి. పక్కనే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ మ్యూజియం సందర్శకులకు అవగాహన కల్పిస్తుంది.
త్వరలో అందుబాటులోకి..
మరో వారం నుంచి పది రోజుల్లో ఫారెస్టు టూరి జాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాల్వంచ వైల్డ్ లైఫ్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎం.బాబు తెలిపారు. భవిష్యత్తులో డ్యాం మధ్యలో ఉన్న ఆనంద ద్వీపాన్ని కూడా పర్యాటకుల కు అందుబాటులోకి తీసుకువచ్చి, అక్కడ కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
