V6 News

పుట్టింది హైదరాబాదే.. పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని.. స్పీచ్తో అదరగొట్టిన కిరణ్ భార్య

పుట్టింది హైదరాబాదే.. పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని..  స్పీచ్తో అదరగొట్టిన కిరణ్ భార్య

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈసారి నిర్మాతగా మారి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే విలేజ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు. శుక్రవారం ఏప్రిల్ 17న మూవీ విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏప్రిల్ 12 రాత్రి సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మరియు అతని భార్య మాట్లాడిన మాటలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు ప్రేమను గుర్తుచేసుకుంటూ, తమ కెరీర్ స్టార్టింగ్లో పడ్డ కష్టాలను గుర్తుచేసుకున్నారు.

జీవితంలో కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో తన భార్య, నటి రహస్య అండగా నిలిచిందని కిరణ్ చెప్పుకొచ్చారు. తినడానికి కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో తనను నమ్మిందని.. ఆఫర్ల కోసం తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి బాక్స్‌ తెచ్చేదని ఎమోషనల్ అయ్యారు.

“నేను హీరో కాకముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రొడక్షన్ ఆఫీసుల దగ్గర అవకాశాల కోసం తిరిగిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడు నా దగ్గర డబ్బు కూడా ఉండేది కాదు. సరిగ్గా తినడానికి కూడా లేకపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో రహస్య నా కోసం ఇంటి నుండి భోజనం తీసుకొచ్చేది. నేను ఏదో ఒక రోజు హీరో అవుతానని నమ్మి నా చేయి పట్టుకుంది” అంటూ కిరణ్ చెప్పగానే ఈవెంట్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

కిరణ్ మాటల్లో కనిపించిన నిజాయితీ, రహస్యపై ఉన్న ప్రేమ అందరి మనసులను తాకింది. తన విజయానికి కారణం తానే కాదు, తన వెనుక నిలిచిన వాళ్లని గుర్తు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చాలామంది “ఇది నిజమైన ప్రేమ”, “కష్టాల్లో తోడుగా ఉన్న భార్యను ఇంత అందంగా గుర్తు చేసుకోవడం గొప్ప విషయం” అంటూ పోస్టులు పెడుతున్నారు. 

పెళ్లి చేసుకుంది పక్కా ఊరోడ్ని..

ఈ క్రమంలోనే రహస్య మాట్లాడుతూ.. "నా లైఫ్‌లో ఆయనే నా ధైర్యం. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫ్రెండ్‌గా అయినా, పార్టనర్‌గా అయినా కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తి ఉండాలని అనుకుంటాను. ఎందుకంటే అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అయితే, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని.. నాకు ఊరి స్టైల్ నేర్పించాడు.. ఇప్పుడు ఈ తిమ్మరాజుపల్లి సినిమా చూస్తే మీకు అర్ధవమవుతుంది.. చూసి ఎంజాయ్ చేయండి " అని రహస్య ఆసక్తికర స్పీచ్ ఇచ్చింది. 

50 మంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి..

కిరణ్ స్పీచ్‌లో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ సినిమా కేవలం ఒక మూవీ కాదు అని ఆయన అన్నారు. “పల్లెల నుంచి, చిన్న చిన్న ఊళ్ల నుంచి ఎన్నో కలలతో వచ్చిన సుమారు 50 మంది కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ జీవితకాల స్వప్నం ఈ సినిమా” అని చెప్పారు. ఇప్పుడు అందరి చూపు ఏప్రిల్ 17పై ఉంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నిజంగానే కొత్త టాలెంట్‌కు పెద్ద బ్రేక్ ఇస్తుందా? కిరణ్ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతాడా? అన్నది చూడాలి.