మరీ అంత కావాల్సినవాడేం కాదు

 మరీ అంత కావాల్సినవాడేం కాదు

రాజావారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, సెబాస్టియన్ వంటి డిఫరెంట్ కాన్సెప్టులతో ఫాలోయింగ్ సంపాదించిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా అందరికీ మరింత నచ్చాలని తానే పెన్ను పట్టి స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ రాశాడు. మరి అతని కోరుకున్నట్టే సినిమా అందరికీ నచ్చిందా? మంచి మార్కులు వేయించుకుందా? 

కథ

వివేక్ (కిరణ్) క్యాబ్ నడుపుతూ ఉంటాడు. ఆ క్రమంలో అతనికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తేజు (సంజన) పరిచయమవుతుంది. ఆమె ప్రతిరోజూ వివేక్ క్యాబ్ ఎక్కుతూ ఉంటుంది. పైగా రోజూ డ్రింక్ చేస్తుంది. ఓరోజు మత్తులో ఉన్న ఆమెని రౌడీలు ఎత్తుకెళ్లడంతో వివేక్ రక్షిస్తాడు. ఆమె ఎందుకలా తాగుతోందో తెలుసుకుంటాడు. ప్రేమలో మోసపోయానని, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని, కుటుంబానికి దూరమయ్యానని చెప్పుకుని బాధపడుతుంది తేజు. ఆమెకి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. తన ఫ్యామిలీతో కలిసేలా చేస్తాడు. దాంతో తేజు అతన్ని ఇష్టపడుతుంది. సరిగ్గా తన ప్రేమను అతనికి తెలియజేసే సమయంలో తేజూకి వివేక్‌ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఇంతకీ ఏమిటా నిజాలు? అసలు కిరణ్ ఎవరు? వాళ్లిద్దరి ప్రేమకథకు శుభం కార్డు పడిందా లేదా అనేది మిగతా కథ.


 
విశ్లేషణ 

చెప్పుకోడానికి సింపుల్‌గా ఉన్న ఈ కథని... చూడటానికి మాత్రం అతి కష్టంగా ఫీలయ్యేలా తీశారు. అసలు సినిమాయే ఐటమ్ సాంగ్‌తో మొదలవుతుంది. ఇందులో చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ చిత్రంలోని ‘ఆట కావాలా పాట కావాలా’తో పాటు బాలయ్య ‘సమరసింహారెడ్డి’లోని ‘చిలకపచ్చ కోక’ పాటల్ని రీమిక్స్ చేయడం, మధ్యలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తో కిరణ్ ఇంప్రెస్ చేశాడు. దీంతో ప్రేక్షకులు ఓ పాజిటివ్‌ ఫీల్‌తో సినిమా చూడటం మొదలుపెడతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. క్యారెక్టర్లను రివీల్ చేసే క్రమంలో వచ్చి పడే రొటీన్‌ సీన్లు మామూలుగా విసిగించవు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. అవి కొన్ని బాగున్నా, మరికొన్ని మాత్రం అవునా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. 

హీరోయిన్‌ అక్క ఎవరినో ప్రేమిస్తుంది. కానీ తండ్రి (ఎస్వీ కృష్ణారెడ్డి) ఒప్పుకోడనే భయంతో ఆయన చూసిన సంబంధం చేసేసుకుంటుంది. దాంతో ఆ లవర్‌‌ పగబడతాడు. ఇదంతా ఆ తండ్రి వల్లే జరిగిందనే కోపంతో, అతనికి బుద్ధి చెప్పాలని హీరోయిన్‌ని తెలివిగా ప్రేమలో దించుతాడు. ఆమెకి ఆశలు కల్పిస్తాడు. దాంతో పెళ్లి పీటల మీది నుంచి వచ్చేస్తుంది హీరోయిన్. తీరా వచ్చాక ఆ అబ్బాయి మోసం చేస్తాడు. అటు కుటుంబానికీ దూరమై, ఇటు ప్రేమలోనూ మోసపోవడంతో తట్టుకోలేక తాగుడుకు బానిసవుతుంది. ఏ పెళ్లి కొడుకునైతే వద్దనుకుని వచ్చేసిందో అతనే తనకి క్యాబ్ డ్రైవర్‌‌గా పరిచయమయ్యాడని తెలియక అతనితో ప్రేమలో పడుతుంది. ఈ విషయాన్ని రివీల్ చేయడానికి నడిపిన కథ మామూలుగా లేదు. అది అర్థం కాక బుర్ర వాచిపోతుంది. ఒక్క రోజు పరిచయంతోనే హీరోయిన్ రోజూ హీరో క్యాబ్ ఎక్కడం, అతను ఒక్క మాట చెప్పగానే కన్విన్స్ అయిపోయి వెళ్లి ఫ్యామిలీతో కలిసిపోవడం ప్రేక్షకులకు అస్సలు రుచించదు.

హీరోయిన్ మందు తాగడం వెరైటీగా ఉంటుందని మూవీ యూనిట్ ఫీలై ఉంటుంది. హీరో క్యారెక్టర్‌‌ని సస్పెన్స్లో పెట్టి చివర్లో రివీల్ చేస్తే అదిరిపోతుందనుకుని ఉంటారు అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ అంతవరకు కథని రక్తి కట్టించాలే కాకుండా ప్రేక్షకుల మీద కక్షగట్టినట్టు రొటీన్ సీన్స్, బోరింగ్ డైలాగ్స్ నింపేశారు. ఆ విషయంపై రైటర్ కిరణ్ కానీ, దర్శకుడు గానీ దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్లాన్ చేసుకుని, దానికి తగ్గట్టు సినిమాని మలచుకుంటూ పోయారేమో అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండూ తప్ప సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గవేమీ లేవు. ‘శశిరేఖా పరిణయం’ స్టోరీని తీసుకుని అటూ ఇటూ తిప్పి తీసేసిన ఫీలింగ్‌ కూడా వస్తుంది. ఏ మాత్రం అందం లేని పాటలు, అవసరం లేని ఫైట్లు అదనపు టార్చర్. 

మైనస్‌లే ఎక్కువ

ఈ సినిమా విషయంలో ప్లస్సులూ మైనస్సులూ అని బేరీజు వేయడం పెద్ద పనే. యాక్టింగ్ పరంగా కిరణ్ అబ్బవరం తన గత సినిమాల కన్నా మెరుగ్గా కనిపించాడు. డ్యాన్సులు, ఫైట్స్, స్టైల్ విషయంలో మరోసారి యూత్‌ని ఇంప్రెస్ చేస్తాడు. అయితే రైటర్‌‌గా తన సినిమాని సక్సెస్ చేసుకోడానికి అతనికి చాలా స్కోప్ ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే బాగుండేది. ఎంతసేపూ తనని తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోడానికే ప్రయత్నించాడేమో అని కొన్ని సందర్భాల్లో అనిపించింది. అలా కాకుండా టైట్ స్క్రీన్‌ ప్లే రాసుకుని, కొన్ని క్యాచీ సీన్స్ వేసుకుని ఉంటే ఇది మంచి సినిమానే అయ్యుండేది. సంజనది బలమైన పాత్ర. అందంగా కనిపించింది. పర్‌‌ఫార్మెన్స్‌ పరంగానూ ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి.  పిల్లల పెంపకం, ఆడ పిల్లల పెళ్లి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ పాత్ర ద్వారా చక్కగా చెప్పారు. బాబాయ్‌గా సమీర్, హీరోయిన్ అక్కగా నవీనా రెడ్డి, నెగిటివ్ రోల్‌లో  సిద్థార్థ్ మీనన్‌లతో పాటు సోనూ ఠాకూర్, బాబా భాస్కర్ పరిధి మేర బాగానే నటించారు.

టెక్నికల్ అంశాలు చూసుకుంటే.. ఈ సినిమాలో దేని గురించైనా కాస్త చెప్పుకోవాలి అంటే అది సంగీతం గురించే. పాటలు ఓ రేంజ్‌లో లేకపోయినా బీజీఎం మాత్రం మణిశర్మ స్టాండర్డ్ లో ఉంది. అయితే ఇలాంటి చాలా కాన్సెప్టులకు ఆయన వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఇందులో కొత్తగా ఆయన చేయడానికి, మనం చెప్పుకోడానికి ఏమీ లేదు. సినిమాటోగ్రాఫర్ రాజ్ నల్లి తన బెస్ట్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్‌ కనిపిస్తున్నాయి. అయితే అసలు అన్నమే ఉడకలేదంటే అందులో ఆవకాయ కలిపితే బాగుంటుందా, కూర కలిపితే బాగుంటుందా అనే డిస్కషన్ అర్థం లేనిదవుతుంది. కథ, కథనాలే ఆకట్టుకోలేకపోయినప్పుడు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ లాంటివి వర్కవుటైనా పెద్ద ఉపయోగం ఉండదు. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. టేకింగ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే దర్శకుడి ఖాతాలో ఓ మంచి హిట్టు పడి ఉండేది.

నటీనటులు : కిర‌ణ్ అబ్బవ‌రం, సంజ‌నా ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌ త‌దిత‌రులు 
సంగీతం: మణిశర్మ
నిర్మాణం : కోడి దివ్య దీప్తి
కథనం, మాటలు: కిరణ్ అబ్బవరం 
దర్శకత్వం : శ్రీధర్ గాదె