ఫిజికల్లీ డిసేబుల్డ్‌‌ పిల్లలకు అమ్మగా మారిన కిరణ్ పితియా

ఫిజికల్లీ డిసేబుల్డ్‌‌ పిల్లలకు అమ్మగా మారిన కిరణ్ పితియా

అనాథలైన ఫిజికల్లీ డిసేబుల్డ్‌‌ పిల్లల కోసం ఆశ్రమం పెట్టాలి అనుకుంది. అలాగే, వాళ్ల బాగోగులు చూసుకుంటూ ఆ పిల్లలకి తల్లిగా మారాలి అనిపించింది గుజరాత్‌‌కు చెందిన కిరణ్ పితియాకు. ఈ ఆలోచన వెనక తన అన్న బాధతో చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ మాటలే ఇప్పుడామెను 30 మంది పిల్లలకు అమ్మను చేశాయి.

గుజరాత్‌‌, రాజ్‌‌కోట్‌‌లోని అప్లెటా అనే ఊళ్లో ఉంటుంది ముప్పై ఏండ్ల కిరణ్‌‌. తన అన్న డిసేబిలిటీతో పుట్టాడు. దాంతో స్కూల్‌‌, ఫ్రెండ్స్‌‌ అనేవి లేకుండా పోయాయి. తన ఈడు పిల్లల్ని చూస్తూ లోలోపలే కుమిలిపోయేవాడు. ఏం చేయలేని పరిస్థితి. అతన్ని బయటివాళ్లెవరూ సరిగా గుర్తించేవాళ్లు కాదు. ఇవన్నీ చూస్తూ కిరణ్‌‌తో ఒకరోజు ‘నాకు సాయం చేయడానికి మీరున్నారు. ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు’ అంటూ బాధ పడేవాడు. తన అన్నపడే బాధ​లన్నీ తెలిసిన కిరణ్ ఫిజికల్లీ డిసేబుల్డ్‌‌ పిల్లలకోసం ఏదైనా చేయాలనుకునేది.

భర్త సాయంతో...

పెండ్లయ్యాక కొన్ని రోజులు ప్రైవేట్‌‌ స్కూల్‌‌లో టీచర్‌‌‌‌గా జాబ్‌‌ చేసింది కిరణ్‌‌. స్కూల్‌‌ పిల్లల్ని చూసిన ప్రతీసారి డిసేబిలిటీతో ఉన్న పిల్లలే గుర్తొచ్చేవాళ్లు. అప్పుడే, ఆ పిల్లల కోసం ఆశ్రమం పెట్టాలనుకుంది. ఈ విషయాన్ని తన భర్త రమేష్‌‌కి చెప్తే, అతను కూడా ఒప్పుకున్నాడు. దాంతో పదిమంది డిసేబుల్డ్‌‌ అనాథ పిల్లలతో ‘దివ్య జ్యోత్‌‌ దివ్యాంగ్‌‌’ అనే ఆశ్రమాన్ని 2016లో ప్రారంభించింది. ఒక ఇంటిని అద్దెకు తీసుకొని దాన్ని రిన్నొవేట్‌‌ చేసి టాయిలెట్స్‌‌, బెడ్స్‌‌ ఫెసిలిటీస్ పెట్టించింది. ఆశ్రమంలో ఫుడ్‌‌తో పాటు, మామూలు స్కూల్‌‌లో ఏవైతే ఉంటాయో... అంటే బోర్డ్స్‌‌, ప్లే ఐటమ్స్‌‌లాంటి వాటిని పెట్టించి స్కూల్‌‌ మొదలుపెట్టింది. కిరణ్‌‌ భర్త రమేష్‌‌ గవర్నమెంట్‌‌ టీచర్ కావడంతో ఆయనతోపాటు ఆమె కూడా ఇక్కడి పిల్లలకు చదువు చెప్తోంది. రోజూ ఆరుగంటలకు పిల్లల్ని నిద్రలేపి స్నానం చేయిస్తుంది. వాళ్లను రెడీ చేసి ప్రార్థన చేయించి స్కూల్‌‌ మొదలుపెడుతుంది. ఆ పిల్లలతో పాటే తన ఆరేండ్ల కొడుకును కూడా ఇదే ఆశ్రమంలో చదివిస్తోంది.  చుట్టు పక్కల ఊళ్లలో డిసేబిలిటీ ఉన్న పిల్లల్ని కూడా వీళ్ల స్కూల్‌‌లోనే చేర్చారు. దాంతో  ఆశ్రమంలో ఉన్న పిల్లల సంఖ్య ఇప్పుడు 30కి చేరింది. ఆశ్రమం నడపడానికి కొంతమంది డొనేషన్స్‌‌ కూడా ఇస్తున్నారు. ఆ డబ్బుతో సొంత బిల్డింగ్ కట్టించింది కిరణ్‌‌. పిల్లల బాగోగులు చూసుకునేందుకు ముగ్గుర్ని పనిలో కూడా పెట్టింది.   

‘‘ఇలాంటి పిల్లల్ని కొంతమంది జాలిగా చూస్తారు, ఇంకొందరు అసలు పట్టించుకోరు. తల్లిదండ్రులు కూడా వేరే పిల్లలతో కలపడానికి, స్కూల్స్‌‌కు పంపించడానికి వెనకాడతారు. అలాంటి వాళ్లను కూడా మా స్కూల్‌‌లో చేర్పించుకుంటున్నాం. ఇక్కడికొచ్చాకే వాళ్లు ఆనందంగా ఉంటున్నారు. వాళ్ల ముఖాల్లో నిజమైన నవ్వుల్ని చూస్తున్నాం’’ అని అంటోంది కిరణ్‌‌.