ప్రధానినే చంపేస్తామని బెదిరిస్తారా?..రాహుల్, ఖర్గే.. మోదీకి సారీ చెప్పాలి

ప్రధానినే చంపేస్తామని బెదిరిస్తారా?..రాహుల్, ఖర్గే.. మోదీకి సారీ చెప్పాలి
  • ప్రధానినే చంపేస్తామని బెదిరిస్తారా?
  • కాంగ్రెస్ కార్యకర్తల కామెంట్లపై కిరణ్ రిజిజు ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఆదివారం రాంలీలా మైదాన్​లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు మోదీకి వ్యతిరేకంగా బెదిరింపు నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ర్యాలీలో ‘మోదీ తేరీ ఖబర్ ఖుదేగి, ఆజ్​నహీ తో కల్ ఖుదేగి” (మోదీ, నీ సమాధి తవ్వుతాం.. ఇప్పుడైతే ఇప్పుడే, లేకుంటే  రేపు) వంటి నినాదాలు చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. 

‘‘ఇలాంటి నినాదాలు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దురదృష్టకరం.. విషాదకరం. మోదీని చంపేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరిస్తుంటే ఖర్గే, రాహుల్ సైలెంట్​గా ఉండటం సరికాదు. ప్రధాని మోదీ 140 కోట్ల మంది ప్రజల నాయకుడు. ప్రపంచంలోనే బలమైన నేత. అలాంటి నాయకుడిని హత్య చేస్తామని ప్రకటించడం లేదా సమాధి తవ్వుతామని బెదిరించడం కాంగ్రెస్ నేతల మానసిక స్థితిని సూచిస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న రాహుల్ గాంధీ (లోక్‌‌‌‌సభ), మల్లికార్జున ఖర్గే (రాజ్యసభ) ఈ ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పాలి’’ అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. 

బీజేపీ, ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఎప్పుడూ, ఎవరి తల్లిదండ్రులనూ అగౌరవపరచలేదని తెలిపారు. ఎవరినీ బెదిరించలేదని ఆయన స్పష్టంచేశారు. తాము రాజకీయంగా విభేదిస్తాం, విమర్శిస్తాం కానీ.. ఎవరినీ చంపాలని ఆలోచించలేదని కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు.