సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం అనేవాళ్లు మూర్ఖులు

సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవం అనేవాళ్లు మూర్ఖులు

సెప్టెంబర్ 17వ తేదీని సమైక్యతా దినోత్సవం అనే వాళ్లు మూర్ఖులన్నారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరపాలన్న కేసీఆర్..ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. ఎంతో మంది తెలంగాణ ప్రజలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుంది కేసీఆర్ అని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని...సెప్టెంబర్ 17పై పరకాల అమరధామం దగ్గర చర్చకు కేసీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. 

సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని కిషన్ రెడ్డి అన్నారు.  రజాకార్ల పీడ విరగడైన రోజు అని చెప్పారు. తెలంగాణలో బురుజులు కట్టుకుని మాన, ప్రాణాలను కాపాడుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన రోజును బయటకు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా చేసిన ఈ పాపం కాంగ్రెస్ దే అని మండిపడ్డారు. సోనియాగాంధీకి సెప్టెంబర్ 17న మీటింగ్ పెట్టే అర్హత లేదన్నారు. సెప్టెంబర్ 17 చరిత్రను దేశానికి తెలియనివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చార్మినార్ దగ్గర ముక్కు నేలకు రాసి పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఊరూర విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని హామీ ఇచ్చారు.