కేసీఆర్​ను నిరుద్యోగులే ఓడిస్తరు : : కిషన్​రెడ్డి

కేసీఆర్​ను నిరుద్యోగులే ఓడిస్తరు : : కిషన్​రెడ్డి
  • కేసీఆర్​ను నిరుద్యోగులే ఓడిస్తరు .. 
  • కాపలా కుక్కలెక్క ఉంటనని నియంతలా మారిండు: కిషన్​రెడ్డి
  • రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిండు
  • కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా?
  • రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టే
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​ రెండూ ఒక్కటే
  • మజ్లిస్​తో దోస్తీ చేసే వాళ్లతో  మేం ఎన్నటికీ కలువం
  • బీసీ సీఎం నినాదంతోనే ముందుకు వెళ్తాం
  • ‘మీట్​ ది ప్రెస్​’లో వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్​పై యువత, నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడగొట్టేది వాళ్లేనని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఏ లక్ష్యాల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామో వాటికి విరుద్ధంగా పదేండ్లుగా కేసీఆర్​ పాలిస్తున్నారని, కాపలా కుక్కలా ఉంటానని చెప్పి నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల పాలిట కేసీఆర్​ పాలన యమపాశంగా మారిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. పదేండ్లుగా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని, టీఎస్ పీఎస్సీ అక్రమాల వల్ల లక్షల మంది నిరుద్యోగులు గోస పడుతున్నారని తెలిపారు. ‘‘తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై విసిగిపోయారు. హైదరాబాద్​లోని అశోక్​నగర్​లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. 15 నిమిషాల్లోనే వేలాది మంది యువత అక్కడికి చేరుకున్నారు. ఇది నేటి యువతలో కేసీఆర్ పాలనపై ఉన్న ఆగ్రహావేశాలకు నిదర్శనం. వాళ్లే బీఆర్​ఎస్​కు తగిన బుద్ధి చెప్తరు. గజ్వేల్, కామారెడ్డిలో.. రెండుచోట్లా కేసీఆర్​ను ఓడగొడ్తరు” అని హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

‘‘తాను ఢిల్లీకి పోవాలి.. తన కొడుకు సీఎం కావాలన్నదే  కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ప్రజలంతా తనకు బానిసలుగా ఉండాలి అన్నట్లుగా ఆయన తీరు ఉంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ వస్తే పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టే

రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి.. కాంగ్రెస్ వచ్చినా మార్పు రాదని, తెలంగాణ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని కిషన్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వస్తే.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తప్పుడు ప్రచారంచేస్తున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రానికి పెద్ద సమస్య అని విమర్శించారు. కర్నాటకలో కేవలం ఈ  5 నెలల్లోనే .. ఐదేండ్లలో  వచ్చేంత ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. అమలుకు నోచుకోలేని హామీలను కాంగ్రెస్​ ఇస్తున్నదని,  అధికారంలోకి రావడానికి ఏమైనా చేద్దామన్నట్లు ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. 

ప్రమాణస్వీకారానికి ముందు నుంచే దగా..

‘‘చిన్న రాష్ట్రం, చాలా చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ తీరుతో ఉద్యమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నం. అధికారంలోకి వస్తే కాపలా కుక్కలా ఉంటా... ఇచ్చినమాట తప్ప.. తల నరుక్కుంటా.. అన్నడు. ప్రమాణస్వీకారానికి ముందు నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయడం, మాట తప్పడం ప్రారంభించిండు. నియంతలాగా రాష్ట్రాన్ని పాలిస్తున్నడు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చి.. మరెవరూ ఉద్యమాలు చేయకుండా, తమ మాటను చెప్పే అవకాశం లేకుండా గొంతు నొక్కేస్తున్నడు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం లేకుండా చేస్తున్నడు” అని కిషన్​రెడ్డి ఫైర్​ అయ్యారు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్​ సిద్ధమా?

రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయడానికి వీలులేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనో లేక కోర్టు ద్వారానో సీబీఐ దర్యాప్తు జరుగుతుందని కిషన్​రెడ్డి చెప్పారు. ‘‘కాళేశ్వరం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని.. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ సంతకం పెడితే..  సాయంత్రం 4 గంటల కల్లా సీబీఐ టీమ్​ను సిద్ధం చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా?” అని ఆయన సవాల్​ చేశారు. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం గురించి కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు వాస్తవ  పరిస్థితి వేరుగా ఉందని, కాళేశ్వరం పేరుతో  తెలంగాణను కేసీఆర్ నిట్టనిలువునా ముంచారని ఆయన మండిపడ్డారు. ‘‘మేడిగడ్డ కుంగిపోయిన విషయం తెలియగానే  కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశాను. వారు కమిటీని ఏర్పాటుచేశారు. ఆ నివేదిక వచ్చింది. దీని ఆధారంగా చర్యలుంటాయి. డ్యామ్ భద్రత కోసం ప్రయత్నం చేస్తాం. సహకార  సమాఖ్య విధానంలో రాష్ట్రాలకు కొన్ని అధికారాలుంటాయి. సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. కోర్టు అనుమతి ఇస్తే.. వెంటనే దర్యాప్తు  ప్రారంభమవుతుంది” అని చెప్పారు. 

కల్వకుంట్ల కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ

‘‘తెలంగాణ రాకముందు సీఎంను కలవాలంటే.. అపాయింట్ మెంట్ దొరికేది. మంత్రులను కలిసేందుకు టైమ్ ఇచ్చేవారు. కాని ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒక కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. కేసీఆర్ సీఎంగా పాలనకు కేటాయించే టైమ్​ కన్నా ఫామ్​హౌస్​కే ఎక్కువ కేటాయిస్తున్నడు’’ అని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. భద్రాచలంలో రామనవమి నాడు శ్రీ సీతారామచంద్ర కల్యాణానికి ముఖ్యమంత్రి తలంబ్రాలు, పట్టుబట్టలు తీసుకెళ్లే సంప్రదాయం ఉండేదని, కానీ కేసీఆర్ అక్కడికి వెళ్లకుండా తన మనుమడిని ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి  పంపించారని ఆయన విమర్శించారు. ‘‘ఇదేమైనా రాచరిక పాలననా...ఇలా చేయడానికి” అని నిలదీశారు. ‘‘కేజీ టు పీజీ విద్య, దళితులకు 3 ఎకరాల భూమి.. ఇలా ఏ పథకం కూడా అమలు చేయలేదు. రైతుల రుణమాఫీ చేయని కారణంగా.. వడ్డీ పెరిగి.. రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నయ్. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కేసీఆర్  పాలనలో ఉద్యోగులకు టైమ్​కు జీతాలిచ్చే పరిస్థితి లేదు” అని అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏంచేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధం. తేదీ వాళ్లు నిర్ణయించినా.. ప్రెస్ క్లబ్ వాళ్లు నిర్ణయించినా సరే.. అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా..” అని ఆయన ప్రశ్నించారు.

కవిత అరెస్ట్​ దర్యాప్తు సంస్థల చేతుల్లో..

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అంశం దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉంటుందని, ఇందులో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని అన్నారు. ‘‘కాంగ్రెస్ అగ్ర నేత సోనియాను కూడా ఈడీ విచారించింది. కాని అరెస్ట్ చేయలే. సోనియాను అరెస్టు చేయలేదని.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని అనుకోవచ్చా..! దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని డిమాండ్​ చేశారు.

నామినేషన్ల తర్వాత మేనిఫెస్టో

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసమే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఎవరికో భయపడి కాదని కిషన్​రెడ్డి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తున్నామని, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యమని  స్పష్టం చేశారు.  త్వరలోనే తమ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు వస్తుందని,  జనసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అని, పొత్తు ధర్మంగా ఆ పార్టీని కలుపుకుని ముందుకెళ్తామని చెప్పారు. ‘‘బీజేపీ సిద్ధాంతం ఆధారంగా, కార్యకర్తల బలంతో నడిచే పార్టీ  తప్ప.. వ్యక్తుల ఆధారంగా నడిచే పార్టీ  కాదు. నేను కార్యకర్తను, పార్టీకి కట్టుబడి ఉంట. పార్టీ వీడేవారు వ్యక్తిగత అవసరాలకోసం వెళ్తున్నరు. మాది క్యాడర్ ఆధారిత పార్టీ. ఎవరు వెళ్లినా ..ఏం ఇబ్బంది లేదు. మేం అధికారంలోకి వస్తం. ప్రజలు మాతోనే ఉన్నరు. అంతిమ నిర్ణేతలు ప్రజలు. తెలంగాణ  ప్రజలకు సేవ చేస్తం” అని కిషన్​రెడ్డి తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఆ తర్వాత విత్ డ్రా అయిపోగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని, ఇలా చేయడం తమ పార్టీలో ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమని చెప్పారు.

ALSO READ : ఎలక్షన్​ డ్యూటీలో ఆఫీసర్లు .. బార్డర్​ దాటుతున్న సీఎంఆర్​ వడ్లు

బీఆర్​ఎస్​తో కలిసే ప్రసక్తే లేదు

కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్​తోనే ప్రారంభించారని, కాంగ్రెస్, బీఆర్ఎస్​కు పూర్తి అవగాహన ఉందని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. ‘‘2004 లో కాంగ్రెస్ సర్కారుతో టీఆర్ఎస్ పనిచేసింది. కాంగ్రెస్ అమ్ముకుంటే..బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్​తో ఎలాంటి సంబంధాల్లేవు. ఇటు సూర్యుడు అటు పొడిచి నా.. రజాకార్ల  వారసత్వ పార్టీ  మజ్లిస్​తో దోస్తీ చేసిన వారితో కలవబోం” అని స్పష్టం చేశారు.