దద్దమ్మలు కావాల్నా... దద్దరిల్లే గొంతు కావాల్నా?

దద్దమ్మలు కావాల్నా... దద్దరిల్లే గొంతు కావాల్నా?
  • హుజూరాబాద్ ప్రజలే నిర్ణయించాలె: కిషన్ రెడ్డి
  • ఇది తెలంగాణకు దిశానిర్దేశం చేసే ఎన్నిక
  • కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైంది
  • ఈటల గెలిస్తేనే సీఎం అహంకారం తగ్గుతది

హనుమకొండ, కమలాపూర్, వరంగల్‍, వెలుగు: ‘‘హుజూరాబాద్​లో టీఆర్ఎస్​కు ఓటేస్తె దద్దమ్మలు గెలుస్తరు. అదే బీజేపీకి వేస్తె అసెంబ్లీలో దద్దరిల్లేలా ప్రజా గొంతుక వినిపించే ఈటల గెలుస్తడు. వెన్నెముక లేనోళ్లను ఎన్నుకోవాల్నా, సభలో ధైర్యంగా ప్రశ్నించెటోళ్లనా? ప్రజలే ఆలోచించాలె. పిరికిపందలు కావాల్నా, ధైర్యవంతులా? కేసీఆర్​కుటుంబానికి వంగి వంగి సలాం కొట్టే బానిసలు కావాల్నా, హుజూరాబాద్ ప్రజల గొంతుక కావాల్నా? ఆత్మాభిమానాన్ని కేసీఆర్​ఫామ్​హౌజ్​ల తాకట్టు పెట్టెటోళ్లు కావాల్నా, నిలబెట్టెటోళ్లా? ప్రజలే తేల్చుకోవాలె” అని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; ప్రజాస్వామ్యానికి, కుటుంబ పాలనకు మధ్య పోరు జరుగుతోందన్నారు. ‘‘ఈ ఎన్నిక ఎవరు ఎమ్మెల్యే కావాల్నో నిర్ణయించేది మాత్రమే కాదు, తెలంగాణ ఎటు పోవాలనే దానికోసం జరుగుతున్నది. రాష్ట్రంలో కుటుంబ పాలన ఉండాల్నో, పోవాల్నో హుజూరాబాద్​ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలె. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటుతో తీర్పియ్యాలె” అన్నారు. ఈటలను గెలిపిస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవారవుతారన్నారు. ‘‘కేసీఆర్​కు ప్రజల మీద గానీ, సీఎంగా ఆయన చేసిన పనుల మీద గానీ నమ్మకం లేదు. కేవలం సొంత కుటుంబం మీద, డబ్బు మీదనే నమ్మకముంది. డబ్బులిస్తే గొర్రెల్లెక్క వచ్చి ఓట్లేస్తరని అనుకుంటున్నడు. హుజూరాబాద్​ ప్రజలు గొర్రెలు కాదు, పులిబిడ్డలని నిరూపించాలె. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలన్నా, 1,500 మంది అమరులకు ఆత్మ శాంతి కలగాలన్నా బీజేపీకి ఓటేయండి” అని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్​నియోజకవర్గం కమలాపూర్​ మండలంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఎంతో మంది ఆత్మబలిదానాలతో, బీజేపీ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నం. అందుకోసం సకల జనుల సమ్మె చేసినం. 3.5 కోట్ల మంది ఉద్యమంలో పాల్గొన్నరు. కేసీఆర్​మాత్రం తన కుటుంబ పోరాటం వల్లే తెలంగాణ వచ్చినట్టు చెప్పుకుంటున్నడు. ఇంత కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అభివృద్ధి కోసం. బంగారు తెలంగాణ కోసం. అంతేగానీ ఒక్క కేసీఆర్​కుటుంబం కోసం కాదు. రాష్ట్రంలో కేసీఆర్​ ఫ్యామిలీ మాత్రమే బంగారు కుటుంబమైంది’’ అని ఫైరయ్యారు. కేసీఆర్​తాను నిజాం రాజు, ప్రజలంతా తన బానిసలన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. నిజాం నియంత పాలన సాగుతున్నది. తండ్రీకొడుకుల పాలన మన నెత్తిన రుద్దుతున్నరు. కేసీఆర్​కుటుంబం అబద్ధాలు, డబ్బులు, దౌర్జన్యాలతోనే రాజకీయాలు చేస్తున్నది. ఇతర పార్టీల లీడర్లను కొనే సంస్కృతికి తెర తీసింది. అమ్ముడుపోయిన నాయకులు రెండు, మూడు రోజుల్లో గులాబీ కండువా తీసేసి పార్టీలోకి తిరిగి రావాలని, జీవితాలను చీకటిమయం చేసుకోవద్దని హితవు పలికారు. ‘‘హుజూరాబాద్ లో ఇప్పుడు మద్యం, డబ్బులు సప్లై చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ 30వ తేదీ తర్వాత ఇక్కడుండరు. హుజూరాబాద్​గడ్డ మీద ఉండేది ఈటల రాజేందర్, బీజేపీ జెండా మాత్రమే. దళితబంధు ఈటల వల్లే వచ్చింది తప్ప దళితులపై ప్రేమతో కాదు. కాబట్టి పథకానికి 'ఈటల రాజేందర్​దళితబంధు' అని పేరు పెట్టాలె. కేసీఆర్ కు దళితుల మీద ప్రేముంటే ఉప ఎన్నిక ముగియగానే అందరికీ దళితబంధు ఇయ్యాలె” అని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకుఈటల ఆట మొదలు పెట్టారన్నారు.

బీజేపీని అడ్డుకునే శక్తి లేదు
బీజేపీ మీటింగ్​కు రాకుండా జనాన్ని టీఆర్ఎస్ లీడర్లు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ‘‘మీటింగ్​కు పోవొద్దంటూ పైసలిస్తున్నరు. నిన్న మా ర్యాలీని అడ్డుకోజూసిన్రు. బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్ కు లేదు” అని దుయ్యబట్టారు.

ఓటింగ్‍ స్వేచ్ఛగా జరగాలంటే కేంద్ర బలగాలు రావాలె
‘‘హుజూరాబాద్‍లో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, బెదిరింపులు, నిర్బంధాలు ఎక్కువయ్యాయి .ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. కేంద్ర మంత్రిగా ఈసీ అనుమతితో ప్రచారానికి వెళ్లిన నాపైనే దాడులకు దిగే పరిస్థితి! డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నరు” అని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. టీఆర్‍ఎస్‍ దౌర్జన్యాలు ఆగాలంటే కేంద్ర బలగాలు రావాలన్నారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తండ్రీకొడుకులు, మామా అల్లుడు, బావ బామ్మర్ది అంటూ కుటుంబ నియంత పాలన పోవాలంటే ఈటలను గెలిపించాలని పిలుపునిచ్చారు. అప్పుడే కేసీఆర్‍ అహంకారం తగ్గుతుందన్నారు. ‘‘ఈటల గెలుపును ఓటర్లు ఎప్పుడో డిసైడ్‍ చేశారు. ప్రచారమంతా మెజార్టీ కోసమే” అన్నారు. అవసరాన్ని బట్టి హుజూరాబాద్‍లో అమిత్‌‌‌‌ షా పర్యటన ఉంటుందన్నారు. 

బీజేపీల తిరిగితె దళితబంధు ఇయ్యరట
కిషన్ రెడ్డితో వాపోయిన రైతులు

‘‘సార్! మేం బీజేపీల తిరుగుతానమని మాకొచ్చిన దళితబంధు పథకం బంద్ చేస్తరట. బీజేపీ మీటింగులకు పోవద్దని టీఆర్ఎస్ లీడర్లు బెదిరిస్తున్నరు’’ అని కమలాపూర్​ మండలం గూడూరు దళితులు కిషన్​రెడ్డితో చెప్పారు. బీజేపీ మీటింగులకు వెళ్లొద్దని ఇంటింటికి వెళ్లి మహిళలను బెదిరిస్తున్నారన్నారు. పేర్లు రాసుకుంటూ, బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరిస్తున్నారన్నారు.  పథకాలు అందరికీ అందుతాయని, దళితబంధు కట్ చేయలేరని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.