కిచెన్ తెలంగాణ ..బీట్​రూట్ కలర్​ఫుల్.. టేస్ట్​ఫుల్

కిచెన్ తెలంగాణ ..బీట్​రూట్ కలర్​ఫుల్.. టేస్ట్​ఫుల్

ఒంట్లో రక్తం తక్కువైందనగానే గుర్తొచ్చే వెజిటబుల్​ బీట్​రూట్​. బీట్​రూట్​ తింటే వెంటనే బ్లడ్​ వచ్చేస్తుంది అంటారు. కానీ, చెప్పినంత ఈజీ కాదు.. దాన్ని తినడం అంటారు కొందరు. అలాగంటే ఎలా? ఆరోగ్యాన్నిచ్చే వాటిని ఏదో ఒక విధంగా తినాలి కదా! అందుకే బీట్​రూట్​ని ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చే కలర్​ఫుల్​, టేస్టీ వంటలు​ఈ వారం మీకోసం. 

వడలు

కావాల్సినవి : 

శనగపప్పు, కంది పప్పు : ఒక్కోటి అర కప్పు

ఎండు మిర్చి : రెండు, నీళ్లు, ఉప్పు : సరిపడా

బీట్​రూట్ తురుము : ఒక కప్పు

ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు

కొత్తిమీర తరుగు : మూడు టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి : రెండు

అల్లం పేస్ట్ : అర టీస్పూన్

కరివేపాకులు : కొన్ని 

జీలకర్ర : ఒక టీస్పూన్

ఇంగువ : చిటికెడు

బియ్యప్పిండి : రెండు టీస్పూన్లు

తయారీ :  ఒక గిన్నెలో శనగపప్పు, కంది పప్పు, ఎండు మిర్చి వేసి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి, అందులో బీట్​రూట్ తురుము, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్ట్, కరివేపాకులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత బియ్యప్పిండి వేసి కలపాలి. ఈ పిండిని ఉండలు చేసి, చేత్తో వడల్లా వత్తాలి. వాటిని వేడి వేడి నూనెలో వేగిస్తే బీట్​రూట్​ వడలు రెడీ.

చట్నీ

కావాల్సినవి : 

పల్లీలు, మినపప్పు, శనగపప్పు : ఒక్కో టీస్పూన్

పచ్చిమిర్చి : ఒకటి

బీట్​రూట్​ తురుము : ఒక కప్పు

ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు

వెల్లుల్లి : నాలుగు రెబ్బలు

నూనె, ఉప్పు : సరిపడా 

కరివేపాకు : కొంచెం

చింతపండు గుజ్జు : అర టీస్పూన్

ఆవాలు, జీలకర్ర : ఒక్కోటి పావు టీస్పూన్

తయారీ :  ఒక పాన్​లో నూనె వేడి చేసి పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేగించాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. అందులో బీట్​రూట్ తురుము, ఉప్పు వేసి మరోసారి బాగా వేగించాలి. ఆ తర్వాత వాటన్నింటినీ మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు చింతపండు గుజ్జు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగించాలి. ఆ పోపుని బీట్​రూట్ మిశ్రమంలో వేయాలి.

కట్​లెట్

కావాల్సినవి :

నూనె, ఉప్పు : సరిపడా

పచ్చిమిర్చి : రెండు

బీట్​రూట్​ తురుము : ఒకటిన్నర కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్​ : అర టీస్పూన

కరివేపాకు : కొంచెం

కారం, ధనియాల పొడి : ఒక్కో టీస్పూన్

పసుపు : అర టీస్పూన్

ఆలుగడ్డ (ఉడికించి), నిమ్మకాయ : ఒక్కోటి

కార్న్​ఫ్లోర్, నీళ్లు : ఒక్కోటి పావు కప్పు

బ్రెడ్​ పొడి : అర కప్పు

తయారీ :  పాన్​లో నూనె వేడి చేసి, పచ్చిమిర్చి తరుగు, బీట్​రూట్​ తురుము వేసి కలపాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీరతోపాటు ఉడికించిన ఆలుగడ్డ మెదిపి, దాన్ని కూడా బీట్​రూట్ మిశ్రమంలో వేయాలి. తర్వాత నిమ్మరసం చల్లి మరోసారి కలిపి ముద్దగా చేయాలి. ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్ వేసి, అందులో నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత బీట్​రూట్​ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి, కట్​లెట్​లా చేత్తో వత్తాలి. దాన్ని కార్న్​ఫ్లోర్​ మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వాటిని నేరుగా వేడి వేడి నూనెలో వేసి రెండు వైపులా కాల్చితే బీట్​రూట్ కట్​ లెట్ రెడీ. 

షోర్బా 

కావాల్సినవి : 

బీట్​రూట్​ : నాలుగు

నూనె : రెండు టీస్పూన్లు

మిరియాలు : నాలుగు

బిర్యానీ ఆకు : ఒకటి

అల్లం తరుగు : అర టీస్పూన్

వెల్లుల్లి తరుగు : ఒక టీస్పూన్

ఉల్లిగడ్డ, టొమాటో : ఒక్కోటి

ఉప్పు : సరిపడా

నీళ్లు : ఐదు కప్పులు

తయారీ :  ప్రెజర్ కుక్కర్​లో నూనె వేడి చేసి బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం–వెల్లుల్లి తరుగు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో, బీట్​రూట్ ముక్కలు, ఉప్పు వేయాలి. అందులో మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత అందులోని బిర్యానీ ఆకు తీసేసి, బీట్ రూట్ మిశ్రమాన్ని మిక్సీజార్​లో పోసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాన్​లో పోసి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. మిరియాల పొడి వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. అంతే..  గరం గరంగా ఉండే బీట్​రూట్ షొర్బా తాగడమే ఆలస్యం. 

క్రిస్పీ దోశ

కావాల్సినవి :

మినపప్పు : ఒక కప్పు 

బియ్యం : మూడు కప్పులు

బీట్​రూట్ : ఒకటి

శనగపప్పు : ఒక టేబుల్ స్పూన్

మెంతులు : పావు టీస్పూన్

నీళ్లు, ఉప్పు : సరిపడా

పచ్చిమిర్చి : ఐదు

అల్లం : చిన్న ముక్క

తయారీ  :  ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం, శనగపప్పు, మెంతులు వేసి, నీళ్లు పోసి రెండు సార్లు కడగాలి. ఆ తర్వాత మళ్లీ నీళ్లు పోసి ఎనిమిది గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు బీట్​రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కూడా వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పెనం మీద దోశెలా పోసి మూడు నిమిషాలు కాల్చాలి.