వెల్లింగ్టన్: విమెన్స్ వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టు వరల్డ్ రికార్డును సృష్టించింది. సౌతాఫ్రికా విమెన్స్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో 347 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసి ఔరా అనిపించింది. దాంతో 2025లో ఇండియా.. ఆస్ట్రేలియాపై నెలకొల్పిన 339 రన్స్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 346/6 స్కోరు చేసింది. అనెకా బోష్ (91), లారా వోల్‌వర్ట్ (69), చోలే ట్రయాన్ (52 నాటౌట్) సత్తా చాటగా.. సున్ లుస్ (40), సినాలో జాఫ్తా (37) బ్యాట్లు ఝుళిపించడంతో సఫారీలు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
బ్రిలింగ్ 3, కేలీ నైట్2 వికెట్లు తీశారు. భారీ ఛేజింగ్‌లో కివీస్ 49.4 ఓవర్లలో 350/8 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ అమెలియా కెర్ (139 బాల్స్‌లో 23 ఫోర్లు, 1 సిక్స్‌తో 179 నాటౌట్) భారీ సెంచరీ ఆకట్టుకుంది. తనతో పాటు ఇసబెల్లా గాజా (68) దంచికొట్టడంతో రెండు బాల్స్ మిగిలి ఉండగానే కివీస్ గెలిచింది.
అమెలియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉంది. ఇరుజట్ల మూడో వన్డే శనివారం జరుగుతుంది.
