IPL 2023 : ఆరో వేలుగా గ్రౌండ్ లోకి దిగి అదరగొట్టాడు.. ఎవరీ సుయాష్ శర్మ?

IPL 2023 : ఆరో వేలుగా గ్రౌండ్ లోకి దిగి అదరగొట్టాడు..  ఎవరీ సుయాష్ శర్మ?

కోల్ కత్తా, బెంగళూరు మ్యాచ్ లో మొదటి నాలుగోవర్లు పరుగుల వరద పారింది. ఉమేష్, టిమ్ సౌథీపై దాడి చేసిన ఆర్సీబీ బ్యాట్స్ మెన్ ను నరైన్, వరుణ్ చక్రవర్తి అడ్డకట్ట వేశారు. ఇక అప్పుడే వచ్చాడు.. కోల్ కత్తా మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బెంగళూరు భరతం పట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు ఈ 19 ఏళ్ల ఢిల్లీ మిస్టరీ స్పిన్నర్. 

సుయాష్ శర్మ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడటమే కాదు.. సీనియర్ ప్లేయర్లతో కలిసి ఆడటం కూడా ఇదే ఫస్ట్ టైం. సుయాష్ శర్మ ఇప్పటి వరకు లిస్టు-ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లు ఏవి కూడా ఆడలేదు. కేవలం ఢిల్లీ తరుపున అండర్-25 స్టేట్-ఎ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 

మొదట బ్యాట్స్ మెన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుయాష్.. తన కెరీర్ లో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని రిస్ట్ స్పి్న్ బౌలింగ్ లోకి అడుగు పెట్టాడు. గతేడాది కోల్ కత్తా టీం సుయాష్ ను కొనుగోలు చేసింది. అప్పటినుంచి కోల్ కత్తా క్యాంపులో సీనియర్ల, తోటి ఆటగాళ్ల సలహాలు పొందుతూ.. ఈ స్థాయికి ఎదిగాడు. 

మ్యాచ్ అనంతరం కోల్ కత్తా కెప్టెన్ నితీష్ రాణా మాట్లాడుతూ.. సుయాష్‌ శర్మకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. తనకొచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలడు. గతేడాది నుంచి నెట్స్ లో బౌలింగ్‌ చేస్తూ మంచి ప్రదర్శన కనబరిచాడు. దాంతో జట్టు అతనిపై పూర్తి నమ్మకం ఉంచి ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఛాన్స్ ఇచ్చింద’ని చెప్పాడు.