IND vs ENG: నాలుగో టెస్టుకు వచ్చేస్తున్న రాహుల్.. ఎవరి స్థానంలో ఆడతాడంటే..?

IND vs ENG: నాలుగో టెస్టుకు వచ్చేస్తున్న రాహుల్.. ఎవరి స్థానంలో ఆడతాడంటే..?

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ గెలిచిన తర్వాత భారత జట్టుకు ఒక శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నాలుగో టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో వైజాగ్, రాజ్ కోట్ టెస్టులకు దూరమైన ఈ సీనియర్ బ్యాటర్..రాంచీ టెస్ట్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ జరుగుతుంది. రాహుల్ హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా వైజాగ్ లో జరిగిన రెండో టెస్ట్, రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్ట్ కు దూరమయ్యాడు.    

 రాహుల్ బాగానే ఉన్నాడని రాజ్ కోట్ టెస్ట్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. BCCI మెడికల్ బులెటిన్ ప్రకారం.. రాహుల్ 90 శాతం ఫిట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ రాహుల్ నాలుగో టెస్టులో ఆడితే ఫామ్ లో లేని రజత్ పటిదార్ బెంచ్ కు పరిమితం కాక తప్పదు. రాహుల్ గాయంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న పటిదార్.. వైజాగ్, రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ లో నిరాశ పరిచాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లో 32,9,5,0 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తుంది. 

ప్రస్తుతం రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ లో గాయం తర్వాత కంబ్యాక్ ఈ కర్ణాటక బ్యాటర్ అదరగొట్టేశాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.  టెస్ట్ క్రికెట్ లోనూ రాహుల్ తన హవా కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు ఇంగ్లాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో 86 పరుగులు చేశాడు. రాహుల్ పై పని భారం తగ్గించాలని జట్టు యాజమాన్యం అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్ గా కొనసాగిస్తోంది.