IND vs ENG: మాకు అన్యాయం జరిగింది.. DRS రూల్ మార్చాలంటూ స్టోక్స్ డిమాండ్

IND vs ENG: మాకు అన్యాయం జరిగింది.. DRS రూల్ మార్చాలంటూ స్టోక్స్ డిమాండ్

రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమిని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు కేవలం 122 పరుగులకే ఆలౌటైంది. దీంతో 434 పరుగుల తేడాతో ఓడిపోయి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండో అతి పెద్ద ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్..DRS విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రాజ్ కోట్ టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలి ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బుమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్లకు తాకడంతో అంపైర్ కుమార్ ధర్మసేన ఔట్ గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయానికి ఛాలెంజ్ విసురుతూ క్రాలి డీఆర్ఎస్ కు వెళ్ళాడు. లెగ్-స్టంప్ పైభాగంలో బంతి మిస్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపించినా.. అంపైర్స్ కాల్ ఫైనల్ కావడంతో క్రాలీ  ఔటయ్యాడు. దీంతో ఆగ్రహంగా ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ పెవిలియన్ కు చేరాడు. ఈ సిరీస్ లో క్రాలికి ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. వైజాగ్ టెస్ట్ లో కూడా ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఇలాగే ఔటయ్యాడు. 

మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. 'అంపైర్స్ కాల్ రూపంలో ఔటవ్వడం క్రాలికు ఇదే తొలిసారి కాదు. వైజాగ్ టెస్టులోనూ ఇలానే ఔటయ్యాడు. ఈ నిర్ణయం మమ్మలి చాలా బాధించింది. రీప్లేలో బంతి  స్టంప్ ను మిస్ అయినట్టు చాలా స్పష్టంగా కనిపించింది. అంపైర్ కాల్ రావడంతో మేము షాక్ కు గురయ్యాం. కాబట్టి హాక్-ఐ నుండి మేము కొంత స్పష్టత కోరుతున్నాము. అంపైర్ కాల్‌ను పూర్తిగా రద్దు చేయాలి' అని ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు.