తెలంగాణకు కాకా ఫ్యామిలీ ఏం చేసిందో తెలుసుకో : వివేక్ వెంకటస్వామి

తెలంగాణకు కాకా ఫ్యామిలీ ఏం చేసిందో తెలుసుకో  :  వివేక్ వెంకటస్వామి
  • 3వ తేదీ తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకే
  • రాష్ట్ర సాధన కోసం మేం సొంత పార్టీపైనే కొట్లాడినం
  • ఆనాడు కాంగ్రెస్​తో పొత్తు కోసం కాకా దగ్గరికి కేసీఆర్ వచ్చి బతిమాలిండు
  • అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని ఫైర్

మంచిర్యాల, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. డిసెంబర్ 3 తర్వాత కేటీఆర్, బాల్క సుమన్ సంగతి చూస్తామని ఆ పార్టీ చెన్నూరు అభ్యర్థి జి.వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. తెలంగాణ కోసం సొంత పార్టీపైనే కొట్లాడిన చరిత్ర కాకా ఫ్యామిలీదైతే.. ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర కల్వకుంట్ల ఫ్యామిలీదని విమర్శించారు. మంగళవారం మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో వివేక్ మాట్లాడారు. తెలంగాణకు కాకా ఫ్యామిలీ ఏం చేసిందన్న కేటీఆర్‌‌‌‌ వ్యాఖ్యలపై వివేక్‌‌ మండిప్డడారు. ‘‘కేటీఆర్ ఒక బచ్చా. తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభమైంది.. కాకా కృషి ఏందనే సోయి లేక మాట్లాడుతుండు. వెంకటస్వామి తెలంగాణవాది. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. రెండు నెలలు హాస్పిటల్‌‌లో ఉన్నడు. ఉద్యమం కోసం ఆనాడు సీడబ్ల్యూసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన్రు. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు కోసం కాకా దగ్గరికి వచ్చి కేసీఆర్ బతిమాలిండు. అప్పుడు పొత్తు కుదుర్చకపోతే మీ పార్టీ ఖతమయ్యేది. నువ్వు అమెరికాలోనే ఉండిపోయేటోడివి. 2013లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తిని నేను. నా వల్లే సోనియా గాంధీ తెలంగాణ ఆకాంక్షను గుర్తించిన్రు”అని చెప్పారు. 2009లో సిరిసిల్లలో ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి సీటును కేటీఆర్ కబ్జా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దగ్గర రూపాయి లేదని, అప్పుడు తానే ఆర్థిక సాయం చేశానని, పార్టీ ఫండ్ ఇచ్చానని తెలిపారు. కాకా కుటుంబంతోనే కల్వకుంట్ల ఫ్యామిలీ లాభపడ్డదని అన్నారు.  

కేటీఆర్‌‌‌‌కు అహంకారం పెరిగింది..

కేటీఆర్‌‌‌‌కు అహంకారం పెరిగిందని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వివేక్‌‌ ఫైర్‌‌‌‌ అయ్యారు. ‘‘కాకా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణికి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల లోన్ ఇప్పించిన్రు. బీఐఎఫ్‌‌ఆర్ నుంచి కాపాడి లక్ష మంది కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన్రు. ఆయన కృషి వల్లే జైపూర్ పవర్ ప్లాంట్ వచ్చింది. నేను రామగుండం ఆర్‌‌‌‌ఎఫ్‌‌సీఎల్ రీ ఓపెన్ కోసం కృషి చేసిన”అని చెప్పారు. తెలంగాణ వచ్చే నాటికి సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 39 వేలకు తగ్గిందని, ఈ పదేండ్లలో 23 వేల మందిని కేసీఆర్‌‌‌‌ తొలగించారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి, బాల్క సుమన్‌‌కు అలవాటైందని ఫైర్ అయ్యారు.

మీలాగ నేను అవినీతి చేయలే..

కేటీఆర్, సుమన్ మాట్లాడితే చాలు.. సూట్ కేసులు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివేక్ ఫైర్ అయ్యారు. ‘‘నేను పారిశ్రామికవేత్తను. నా సంస్థల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల పన్నులు కట్టిన. మీరు లక్షల కోట్ల అవినీతి చేసిన్రు. ధరణి పోర్టల్‌‌తో రంగారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాలు కబ్జా చేసిన్రు. తప్పుడు ఆరోపణలతో నాపై ఈడీ రెయిడ్స్ చేయించిన్రు”అని మండిపడ్డారు. తనపై ఈడీకి ఫిర్యాదు చేసే అధికారం పోలీసులకు లేదన్నారు. రూ.20 కోట్ల పన్ను కట్టిన సంస్థ రూ.20 లక్షల టర్నోవరే చేసిందని, తనకు సంబంధం లేకున్నా తప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చిన అధికారులపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై హైపవర్ టీమ్‌‌తో రివ్యూ చేయిస్తామని తెలిపారు. ఎక్కువ భూములు ఉండి వ్యవసాయం చేయని వాళ్లకు రైతుబంధు ఇవ్వడం అవసరమా? అనే అంశంపై సమీక్షిస్తామని వెల్లడించారు.

ముగ్గురూ ఓడిపోతరు..

కేసీఆర్ రిటైర్‌‌‌‌మెంట్ తీసుకుంటే తాను సీఎం అవుతానని కేటీఆర్ కలలు కంటున్నారని.. కానీ కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ ముగ్గురికీ ఓటమి తప్పదని వివేక్ అన్నారు. కేటీఆర్ బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయ్యాక జరిగిన పార్లమెంట్, దుబ్బాక, జీహెచ్‌‌ఎంసీ, హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. మునుగోడులో కూడా నైతికంగా ఓడిపోయారన్నారు. ‘‘సుమన్‌‌.. నీకు ప్రమోషన్ కాదు. ఓడిపోతున్నావ్ చూసుకో. 30న మీ భరతం పట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నరు. జాగ్రత్తగా ఉండాల్సింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి”అని హెచ్చరించారు. డిసెంబర్ 3 తర్వాత కల్వకుంట్ల కుటుంబం, సుమన్ అవినీతిపై విచారణ చేసి జైలుకు పంపుతామన్నారు. సుమన్ ఫ్రస్ట్రేషన్‌‌లో గొడవలు చేయడానికి ప్రయత్నిస్తారని, ఈ రెండ్రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ఓపిక పట్టాలని ఆయన కోరారు. ప్రెస్​మీట్​లో తమిళనాడు ఎంపీ జైకుమార్, చెన్నూర్​మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పీసీసీ అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, బండి సదానందం యాదవ్ పాల్గొన్నారు.

చెన్నూరు మారలె.. సుమన్ రూపురేఖలే మారినయ్

బాల్క సుమన్ చెన్నూరు రూపురేఖలు మార్చాడన్న కేటీఆర్ కామెంట్లను వివేక్ ఖండించారు. ‘‘చెన్నూరు రూపురేఖలు మారలేదు. సుమన్ రూపురేఖలే మారినై. రోడ్లు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి అదే అభివృద్ధి అంటున్నడు. ఇసుక దందా కోసమే నాలుగు బ్రిడ్జిలు కట్టి రోడ్లు వేసిండు. అభివృద్ధి అంటే ఇదేనా? నాపై వంద కేసులు, నా దగ్గర రెండు జతల బట్టలే ఉన్నయ్‌‌ అని ఆనాడు సుమన్‌‌ అన్నడు. ఈరోజు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయ్” అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబీకులు, సుమన్ కలిసి చెన్నూరులో దోపిడీ చేశారని, ఇసుక తవ్వకాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని కేటీఆర్ ఒప్పుకున్నారని, అందుకే కరకట్ట కడతామంటున్నారని చెప్పారు.