కల నిజమైన వేళ: అతని జర్నీ ఒక ఇన్‌స్పిరేషన్

కల నిజమైన వేళ: అతని జర్నీ ఒక ఇన్‌స్పిరేషన్

బానోతు గణేష్ నాయక్… బోర్డ్ మీద రాసిన అక్షరాలని కూడా చూడలేడు. అయినా సరే అతని కళ్లు కలలు కనగలవు. అది చాలు కదా.. ఆ కలల్నే నమ్మి, దాన్ని నిజం చేసేదాకా ఈ ప్రపంచాన్ని చూడలేని కళ్లతో ఆ కలనే చూశాడు.  ‘లైఫ్ ఈజ్ ఎ రేస్’… ‘జీవితాన్ని గెలిచి తీరాలి’ అనే మాటలు తరచూ వింటూనే ఉంటాం. కానీ చెప్పినంత ఈజీ కాదు… కోరుకున్న జీవితాన్ని సాధించుకోవటం కోసం గణేష్ పడిన కష్టం మాటల్లో చెప్పలేం. అతని జర్నీ తెలుసుకోవటమే ఒక ఇన్‌స్పిరేషన్.

ముదిగొండ, వెలుగు : గవర్నమెంట్ స్కూల్ చదువా?’ అని తేలికగా చూసేవాళ్లు, ‘తెలుగు మీడియంలో చదువు  ఎందుకు పనికి వస్తుంది?’ అనే ఒపీనియన్ ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటిది చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ లలో తెలుగు మీడియంలోనే చదువుతూ జేఈఈ లో ర్యాంక్ కొట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా గణేష్‌‌కి కళ్ళు సరిగ్గా కనిపించవు. పుట్టుకతోనే కంటికి సంబందించిన సమస్యతో బాధపడే వాడు గణేష్. బోర్డ్ మీద రాసింది కనిపించేది కాదు. పక్కన ఉండే వాళ్ల నోట్స్‌‌లో చూసి రాసుకునే వాడు. అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు. కౌలుకు తీసుకున్న పొలం మీద వచ్చే సంపాదనతోనే ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు. ఉండటానికి ఇల్లు సరిగా లేదు. అయినా సరే.. తమ పిల్లలు చదివితే బాగుపడతారని కష్టపడుతున్నారు.

గణేష్ కుటుంబం పరిస్థితులు,అతనికి చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన టీచర్లు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. గణేష్‌‌ చదువుకునేందుకు కావాల్సిన ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు… పదవ తరగతిలో 8.2 గ్రేడ్ సాధించాడు. ప్రొఫెసర్  జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ డిప్లొమాలో సీటు వచ్చింది. కానీ దృష్టిలోపంవల్ల  కాలేజీలో చేరలేకపోయాడు. ఇక చేసేది లేక ముదిగొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌‌లో ఇంటర్ ఎంపీసీ జాయిన్ అయ్యాడు.  ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్ అతని ఇబ్బందిని గమనించి మరింత శ్రద్ధ తీసుకున్నారు. గణేష్‌‌కి స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఇంటర్‌‌‌‌లో కూడా 943 మార్కులు సాధించాడు గణేష్.

ఎంసెట్, నెట్ రాయాలనుకున్నా కనీసం కోచింగ్ తీసుకోవటానికి కూడా డబ్బుల్లేక ఇంట్లోనే చదవటం మొదలుపెట్టాడు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ జేఈఈ కోచింగ్ ఇప్పించాలని ప్రయత్నించినా కోవిడ్ వల్ల కోచింగ్ సెంటర్లు మూత పడటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ఇంట్లోనే చదువుకున్న గణేష్ జేఈఈ ప్రిలిమ్స్ సాధించాడు. ఇంట్లోనే ప్రిపేర్ అవుతూ అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రిపేర్ అయి నేషనల్ పీడీబ్ల్యుడీ కోటాలో 64 వ ర్యాంకు కొట్టాడు. అన్ని సౌకర్యాలూ ఉండి, కోచింగ్ తీసుకున్న వాళ్లకి కూడా కష్టమైన ర్యాంక్ అది. అన్ని అడ్డంకులని దాటుకుంటూ ఆ ప్లేస్‌‌కి చేరుకోవటం మామూలు విషయం కాదు. మొదట ఐ.ఐ.టి భోపాల్(మధ్యప్రదేశ్)లో సీట్ వచ్చింది కానీ అంత దూరం వెళ్లలేక దగ్గర్లో ఉన్న వరంగల్ లో సీట్ కోసం 8 సార్లు కౌన్సెలింగ్‌‌కి వెళ్లాడు. కానీ,  ప్రతి సారి నీట్ కాలికట్ (కేరళలో)నే  సీటు వచ్చింది.  తప్పక ఆ కాలేజీలోనే చేరాడు. కరోనా కారణంగా కాలేజ్ ఓపెన్ కాకపోవటంతో ఇప్పటికైతే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నాడు.

సూదిలో దారం ఎక్కించలేదని

గణేష్ పదవ తరగతి పాస్ అయ్యాక  ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిప్లొమా కోసం అప్లై చేశాడు. మూడు సంవత్సరాల అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో క్వాలిఫై అయ్యాడు. కానీ,  కళ్లు కనిపించవనే కారణంతో సీటు ఇవ్వలేదు. దీంతో యూనివర్సిటీపై రెండు సంవత్సరాలు లీగల్ గా పోరాటం చేశాడు. అయినా ఫలితం లేదు. మార్కులు చూడకుండా సూదిలో దారం ఎక్కించమన్నారు. దారం ఎక్కించలేకపోవటంతో చదవటం కష్టమనే కారణంతో సీటు రద్దు చేశారు.

ఆ సార్ల దయ వల్లే

‘మా చిన్న కొడుకు గణేష్​కు కళ్ళు సరిగ్గా కనిపించవని తెలిసి ఎంతో బాధపడ్డాం. ఎలా బతుకుతాడో అనుకునే వాళ్లం. ఏడాదికేడాది మంచి మార్కులు తెచ్చుకుంటే  చాలా ఆనంద పడేవాళ్ళం. సార్లు కూడా మావోడికి ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవాళ్లు. గణేష్ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడని వాళ్లు అంటుంటే సంతోషంగా ఉండేది. మావాడికి అక్కడెక్కడో పెద్ద కాలేజీలో సీట్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం.
ఇదంతా కూడా గణేష్‌కు పాఠాలు చెప్పిన సార్ల వల్లే… వాళ్ళందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలం’ అంటున్నారు గణేష్​ తల్లిదండ్రులు బానోతు మల్లయ్య, సుజాత.

ఉన్నతస్థానంలో చూడాలనుకుంటున్నా….

రెండు సంవత్సరాల క్రితం  అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు “గ్యాప్ ఎందుకు వచ్చింది? మంచిగా ఉన్న స్టూడెంట్సే సరిగా కాలేజీకి రావడం లేదు. నీకు కళ్ళు సరిగ్గా కనిపించవు. పైగా చదువులో రెండు సంవత్సరాల గ్యాప్ ఉంది” అని కోప్పడ్డాను. కానీ  ప్రొఫెసర్  జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీటు ఇవ్వలేదని చెప్పినప్పుడు బాధగా అనిపించింది. దీంతో గణేష్ కు  స్పెషల్​ క్లాసులు తీసుకొని పాఠాలు చెప్పమన్నాను. గణేష్ విజయంలో మా లెక్చరర్స్‌ అందరి  సహకారం ఉంది. గణేష్‌ని భవిష్యత్తులో ఉన్నత స్థానంలోచూడాలనేదే నా కోరిక.

 – వాసిరెడ్డి శ్రీనివాస్, ముదిగొండ కాలేజ్‌ ప్రిన్సిపాల్

ఐఏఎస్ టార్గెట్
నేను చదువుకోవటానికి టీచర్లు, లెక్చరర్‌‌‌‌లు సాయం చేశారు. మోరల్‌‌ సపోర్ట్‌‌గా నిలబడ్డారు. ఇంటర్‌‌‌‌లో గెస్ట్ ఫ్యాకల్టీ లావణ్య మేడం అందరికీ క్లాసులు చెప్పిన తర్వాత నాకు ప్రత్యేక క్లాసులు చెప్పేవారు. ఫిజిక్స్ సార్ రాంబాబు, కెమిస్ట్రీ మేడమ్ సునీత, మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ అందరూ
నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు దృష్టిలోపం ఉందని నన్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఆ రుణం తీరాలంటే నేనూ ఇంకొంతమందికి సాయపడాలి. అందుకోసమైనా నేను ఐఏఎస్‌‌ కావాలనుకుంటున్నా. నా టార్గెట్ ఇప్పుడు ఐఏఎస్‌‌. – బానోతు గణేష్ నాయక్