నమ్మి వెంట వెళితే.. బంధించి అత్యాచారం

నమ్మి వెంట వెళితే.. బంధించి అత్యాచారం

కోచి: నమ్మి వెంట వెళితే.. బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే సన్నిహితంగా తీసిన ఫోటోలు బయటపెడతానంటూ బెదిరించాడు. అంతేకాదు ఆమె దగ్గర అందినకాడికి డబ్బులు పిండుకోవడం ప్రారంభించాడు. దశల వారీగా లక్షలు తీసుకున్నాడు. అతడి ఫ్లాట్ లో నుంచి రెండు నెలల క్రితం బయటపడిన ఆమె స్నేహితురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు మార్టిన్ జోసెఫ్ పెలికోట్ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. అతడు గతంలో కూడా ఇలాగే ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేసినట్లు వెలుగులోకి రావడం సంచలనం రేపింది.
కరోనా సమయంలో ఏదైనా చేసి స్థిరపడదామని భావిస్తున్న బాధిత యువతిని మార్టిన్ జోసెఫ్ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరం కలసి స్వతంత్రంగా బిజినెస్ చేసి సొంతకాళ్లపై నిలబడదామని ఊరించాడు. అతడి మాటలు నమ్మి ఆమె కొంత డబ్బులతో వచ్చేసింది. వేర్వేరుగా ఎందుకు అంటూ ఇద్దరూ కలసి మెరైన్ డ్రైవ్ లోని అతడి అపార్టుమెంట్లోనే ఉండడం ప్రారంభించారు. అతడి రూమ్ కు వచ్చిన కొద్ది రోజులకే బాధితురాలికి అతడి నిజస్వరూపం తెలిసొచ్చింది. ఆమె అనుమానించడం గమనించిన మార్టిన్ ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని, పరువు పోతుందని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు కొట్టి చిత్ర హింసలకు గురిచేసి బంధించాడు. దీంతో బాధితురాలు రెండు నెలల క్రితం తప్పించుకుని బయటకు వచ్చేసింది. స్నేహితురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతను కేసు ను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించాడు. తనపైన పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఎర్నాకుళం పోలీసుల దృష్టికి తెచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మార్టిన్ అసలు స్వరూపాన్ని వెలుగులోకి తెచ్చారు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ కు ముందే మోడలింగ్ చేస్తున్న ఓ యువతిని పరిచయం చేసుకుని నమ్మించి మోసం చేశాడని.. ఆమె వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని తేలింది. అమ్మాయిలను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడు మార్టిన్ వ్యవహారం స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో పోలీసులు తీవ్రంగానే స్పందించారు. నిందితుడి కోసం త్రిసూర్, కోజికోడ్ ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోందని కోచి ఐజీ సీహెచ్ నాగరాజు వెల్లడించారు. అతని కదలికలపై పక్కా సమాచారం అందుతోందని.. వీలైనంత తొందర్లోనే అతడ్ని అరెస్టు చేస్తామన్నారు. పోలీసులు అతడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.